Omicron: అమెరికాలో 95% కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌వే..!

అమెరికాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 95శాతం ఒమిక్రాన్‌వే ఉంటాయని అక్కడి ఆరోగ్యాధికారులు భావిస్తున్నారు.......

Published : 06 Jan 2022 01:42 IST

వాషింగ్టన్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అగ్రరాజ్యంలో విలయతాండవం చేస్తోంది. అయితే అమెరికాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 95శాతం ఒమిక్రాన్‌వే ఉంటాయని అక్కడి ఆరోగ్యాధికారులు భావిస్తున్నారు. కొవిడ్​ వైరస్​లలో ఏ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది అనే అంశాన్ని పరిశీలించిన అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది. గతేడాది జూన్​లో కొత్త కేసులకు డెల్టా వేరియంట్​ కారణంగా కాగా.. నవంబర్​లో తగ్గిపోయినట్లు పేర్కొంది. తాజాగా ఆ స్థానాన్ని ఒమిక్రాన్​ ఆక్రమించినట్లు తెలిపింది.

అగ్రరాజ్యంలో ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఊహించని విధంగా సోమవారం ఒక్కరోజే అక్కడ 10లక్షలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. కాగా మంగళవారం ఈ కేసులు తగ్గాయి. 5.67 లక్షల కేసులు బయటపడినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. 1,847 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రుల్లో లక్షకుపైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రోగులతో నిండిపోయి.. పడకలు దొరక్క రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

మరోవైపు.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షణాలు లేని కేసులే ఎక్కువగా ఉన్న ప్రస్తుత సమయంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిపై దృష్టిసారించటం మంచిదని సూచించారు. గత రెండు వారాలుగా అమెరికాలో రోజుకు సగటున 4.80 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాఠశాలలు, ఆసుపత్రులు, విమానయాన సంస్థలు సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు యూఎస్‌లో మొత్తం 5.55కోట్ల మందికి పైగా వైరస్‌ బారినపడ్డారు. 8.27లక్షల మంది మృతిచెందినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు