Omicron: ఒమిక్రాన్‌తో రీఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయా?

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనం కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది...

Published : 03 Dec 2021 14:12 IST

దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల అధ్యయనంలో కీలక విషయాలు

జోహెన్నస్‌బర్గ్: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనం కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. డెల్టా, బీటా వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్‌ మూడు రెట్లు ఎక్కువ రీఇన్‌ఫెక్షన్లు కలగజేసే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక అధ్యయనంలో తేలింది. ఒకసారి కరోనా సోకిన తర్వాత ఏర్పడే రోగనిరోధకత నుంచి తప్పించుకోగలిగే సామర్థ్యం ఒమిక్రాన్‌కు ఉందా? లేదా? అనే విషయంపై జరిగిన తొలి అధ్యయనం ఇదే కావడం గమనార్హం. ఈ అధ్యయనాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

దక్షిణాఫ్రికాలో నవంబరు 27 నాటికి దాదాపు 28 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. వీరిలో 35,670 మంది రీఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒకసారి కరోనా సోకి దాన్నుంచి కోలుకున్న 90 రోజుల తర్వాత తిరిగి పాజిటివ్‌గా తేలితే.. వాటిని రీఇన్‌ఫెక్షన్లుగా పరిగణిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వస్తున్న రీఇన్‌ఫెక్షన్లలో చాలా వరకు డెల్టా విజృంభణ సమయంలో కరోనా బారినపడ్డ వారిలోనివేనని దక్షిణాఫ్రికాలో ప్రతిష్ఠాత్మక సంస్థ ‘డీఎస్‌ఐ-ఎన్‌ఆర్‌ఎఫ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎపిడెమాలాజికల్‌ మోడలింగ్‌ అండ్‌ అనాలసిస్‌’ డైరెక్టర్‌ జూలియెట్‌ పులియం పేర్కొన్నారు.

అయితే, తాజా అధ్యయనంలో విశ్లేషించిన బాధితుల్లో ఎంతమంది వ్యాక్సిన్‌ తీసుకున్నారన్నది ఇంకా తెలియదని పులియం తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వల్ల ఏర్పడుతున్న నిరోధకత నుంచి తప్పించుకునే సామర్థ్యం ఒమిక్రాన్‌కు ఉందా? లేదా? ఇంకా చెప్పలేమన్నారు. అలాగే ఒమిక్రాన్‌ వల్ల వచ్చే రీఇన్‌ఫెక్షన్ల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడం కూడా అత్యవసరమని తెలిపారు.

ఈ అధ్యయనాన్ని యూకేకు చెందిన సౌతాంప్టన్‌ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్త మైకేల్‌ హెడ్‌ ‘అత్యంత నాణ్యమైనది’గా అభివర్ణించారు. అయితే, ఈ విశ్లేషణ ఫలితాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అలాగే ఇవి తప్పు అని తేలే అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని