Vaccine: రాష్ట్రాల వద్ద మిగులు డోసులు.. ఉత్పత్తి తగ్గించనున్న సీరమ్..!

కేంద్ర నుంచి తదుపరి ఆర్డర్లు లేనందున..కొవిషీల్డ్ టీకా ఉత్పత్తిని 50 శాతం మేర తగ్గించాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ నిర్ణయించింది.

Published : 07 Dec 2021 23:31 IST

దిల్లీ: కేంద్రం నుంచి తదుపరి ఆర్డర్లు లేనందున..కొవిషీల్డ్ టీకా ఉత్పత్తిని 50 శాతం మేర తగ్గించాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ నిర్ణయించింది. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే వారం ప్రారంభం నుంచి కనీసం 50 శాతం మేర ఉత్పత్తిని తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ దేశానికి భారీ మొత్తంలో అవసరమైతే.. అదనపు సామర్థ్యాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఆ పరిస్థితి రాదని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రస్తుత టీకాలు పనిచేయవని నమ్మడానికి ఎలాంటి కారణం లేదని వెల్లడించారు. 

ఐదు రాష్ట్రాల వద్ద 11 కోట్ల డోసుల నిల్వ..ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, బిహార్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో సుమారు 11 కోట్లకు పైగా టీకా డోసులు నిల్వ ఉన్నాయని కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ రాజ్యసభలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద దాదాపు 23 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌ వద్ద అత్యధికంగా 2.9 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయని తెలిపింది. పశ్చిమ్ బెంగాల్‌ (2.5 కోట్లు), మహారాష్ట్ర (2.2 కోట్లు), బిహార్‌ (1.80 కోట్లు), రాజస్థాన్‌ (1.43 కోట్లు) , తమిళనాడు (1.35 కోట్లు), మధ్యప్రదేశ్‌ (1.1 కోట్లు) తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇలా అధిక స్థాయిలో టీకా మిగులు ఉన్న కొన్ని రాష్ట్రాల్లో.. టీకా తీసుకోని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని