Vaccination Record: 100కోట్ల డోసుల పంపిణీపై.. భారత్‌కు WHO ప్రశంసలు!

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేయడంలో భారత్‌ సాధించిన ఘనతను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. తాజాగా 100కోట్ల డోసులను పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

Published : 21 Oct 2021 14:01 IST

తక్కువ సమయంలో భారత్‌ ఈ ఘనత సాధించిందన్న సీరం, భారత్‌ బయోటెక్‌

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ సాధించిన ఘనతను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. తాజాగా 100కోట్ల డోసులను పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ‘కొవిడ్‌ 19 మహమ్మారి ముప్పు ఉన్న ప్రజలను రక్షించడంతో పాటు వ్యాక్సిన్‌ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు మీరు చేస్తోన్న ప్రయత్నాలకు భారత ప్రధాని, శాస్త్రవేత్తలు, వైద్య ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజలకు అభినందనలు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయెసస్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 100కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్‌ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు టెడ్రోస్‌ స్పందించారు.

‘100 కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసి మరో కీలక మైలురాయిని సాధించినందకు భారత్‌కు అభినందనలు. బలమైన నాయకత్వం, వివిధ రంగాల మధ్య సమన్వయం, ఆరోగ్య కార్యకర్తలతో పాటు వైద్య ఆరోగ్య వ్యవస్థ కృషి, ప్రజలందరి భాగస్వామ్యం లేకుండా తక్కువ సమయంలో ఇంతటి అసాధారణ ఘనత సాధించడం సాధ్యం కాదు. భారత్‌ సాధించిన ఈ పురోగతి కేవలం వ్యాక్సిన్‌ పంపింణీలో నిబద్ధతనే కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడే ఈ వ్యాక్సిన్‌లను ప్రపంచ దేశాలకు అందుబాటులో ఉండేలా చూసే ప్రయత్నాల కోణంలో చూడాలి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ పేర్కొన్నారు.

సీరం ఇన్‌స్టిట్యూట్‌ హర్షం..

భారత్‌లో 100 కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను విజయవంతంగా పంపిణీ చేయడం పట్ల సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. మీ నాయకత్వంలో ఈ రోజు భారత్‌ ఈ ఘనత సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, ఇందులో భాగస్వామ్యమైన ఇతర సంస్థలతో పాటు ఇందుకు కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందికి అదర్‌ పూనావాలా అభినందనలు తెలిపారు.

అభినందించిన భారత్‌ బయోటెక్‌..

కేవలం తొమ్మిది నెలల కాలంలోనే భారత్‌ ఈ అసాధారణ ఘనత సాధించడం పట్ల భారత్‌ బయోటెక్‌ సంతోషం వ్యక్తం చేసింది. ‘ఈ చారిత్రక కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు, ఆరోగ్య కార్యకర్తలు, దేశ పౌరుల సహకారంతోనే ఆత్మనిర్భరతలో భారత్‌ విజయం సాధించింది’ అని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని