Bina Tiwari: నేనున్నానంటూ.. తుర్కియే ప్రజలకు అండగా మన బీనా..!

తుర్కియే భూకంపం వేళ.. భారత ప్రభుత్వం అందిస్తోన్న సాయానికి మన్ననలు దక్కుతున్నాయి. భారత సైన్యాని(Indian Army)కి చెందిన వైద్యురాలు బీనా తివారీ తన సేవలతో అక్కడి స్థానికుల మనసు గెలుచుకున్నారు

Updated : 15 Feb 2023 14:07 IST

దిల్లీ: ప్రకృతి ప్రకోపంలో తుర్కియే(Turkey) కంపించిపోయింది. వేలాది ప్రజలు అసువులుబాసారు. ఇంకొన్నివేల మంది శిథిలాల కింద చిక్కి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు భారత సైన్యానికి ఆ దేశంతో  విభేదాలు గుర్తుకురాలేదు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుల ఆర్తనాదాలే వినిపించాయి. ఇక్కడే మన ఆర్మీ అందిస్తోన్న సేవలు, మరీ ముఖ్యంగా ఓ అధికారిణి చూపుతోన్న ఆత్మీయతతో తుర్కియే వాసులు కరిగిపోతున్నారు. వైరల్‌గా మారిన ఆమె చిత్రాలపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు కురిపించారు.

భారత సైన్యం(Indian Army) అందిస్తోన్న సాయాన్ని మెచ్చి, తుర్కియే మహిళ ఒకరు మన సైనికురాలిని ప్రేమగా ముద్దాడిన చిత్రం ఇక్కడివారి హృదయాలను తాకింది. ఆ అధికారిణే.. మేజర్‌ బీనా తివారీ( Bina Tiwari). తుర్కియే(Turkey) వెళ్లిన వైద్య బృందంలో బీనా ఒక్కరే మహిళ. అక్కడ భారత్‌ తాత్కాలికంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. సేవలు ప్రారంభించిన 24 గంటల్లోనే  ఆమె స్థానికుల మనసు గెలుచుకున్నారు.

28 ఏళ్ల బీనా స్వస్థలం దేహ్రాదూన్‌. దిల్లీలోని ఆర్మీ కాలేజ్‌లో వైద్యవిద్యను అభ్యసించారు. దేశం కోసం సేవలు అందించడం ఆమె కుటుంబానికి కొత్తేం కాదు. ఆమె తాత ఆర్మీలో సుబేదార్‌గా పనిచేయగా.. తండ్రి 16 కుమావ్‌ పదాతిదళంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త కూడా వైద్యుడే. ప్రస్తుతం ఆమె కల్నల్‌ యదువీర్‌ సింగ్‌ ఆధ్వర్యంలో అస్సాంలో పనిచేస్తున్నారు. 60 పారా ఫీల్డ్ ఆస్పత్రిలో ఆమె ఒక్కరే మహిళ. ఇటీవల భారతసైన్యం ఆమె చిత్రాన్ని షేర్ చేసి.. ‘మేం జాగ్రత్తగా చూసుకుంటాం’ అని తుర్కియే ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. తాజాగా ఆమె ఓ బాలికను కాపాడిన చిత్రాన్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసి..‘ప్రపంచంలోనే అదిపెద్ద సైన్యాల్లో మనది ఒకటి. సహాయకచర్యలు, పీస్‌కీపింగ్‌లో మనకు దశాబ్దాల అనుభవం ఉంది. ఇదీ భారత్‌ ఇమేజ్‌’ అని ప్రశంసించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు