Ukrainian Bride: ఈ మెషీన్ మా ప్రేమ కథకు నిజమైన హీరో..!

రష్యా చేస్తోన్న దాడితో ఉక్రెయిన్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు సరిహద్దులు దాటుతున్నారు.

Updated : 13 Apr 2022 14:17 IST

దిల్లీ: రష్యా చేస్తోన్న దాడితో ఉక్రెయిన్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు సరిహద్దులు దాటుతున్నారు. తమకు ఇష్టమైన వస్తువులను ఎన్నింటినో వదిలేసి వెళ్లిపోతున్నారు. అలాగే అన్నా హొరొడెట్‌స్కా కూడా ఖరీదైన ఎన్నో వస్తువులను వదిలేసి, తన ప్రేమను గెలిపించుకునేందుకు, నానమ్మ ఇచ్చిన కాఫీ మెషీన్‌ను వెంట పెట్టుకొని భారత్‌కు వచ్చారు. ఈ ఆదివారం తన భారత స్నేహితుడు అనుభవ్ భాసిన్‌ను వివాహమాడారు. 

2019లో అన్నా కీవ్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో పర్యటన కోసం ఇండియాకు వచ్చారు. అప్పుడే అనుభవ్‌ను తొలిసారి కలిశారు. తర్వాత నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ వెంటనే అన్నా తిరిగి కీవ్‌ వెళ్లిపోయినా.. ఇద్దరి మధ్య ఫోన్లు, సందేశాలు కొనసాగాయి. మళ్లీ ఆమె మరుసటి ఏడాది రాజస్థాన్ రోడ్‌ ట్రిప్‌ కోసం ఇండియా వచ్చారు. అదే సమయంలో దేశంలో కరోనా విజృంభించడంతో లాక్‌డౌన్‌ విధించారు. ఇక తిరిగి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. అన్నాకు అనుభవ్‌ వాళ్లింట్లోనే ఆశ్రయమిచ్చారు. ఇలా కొన్ని నెలల పాటు గడిపిన వాళ్లిద్దరి మధ్య క్రమంగా ప్రేమ చిగురించింది.

అనుభవ్ కుటుంబానికి ఆమె నచ్చడంతో వారిపెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత ఆమె ఉక్రెయిన్‌ వెళ్లిపోయారు. ఈ మార్చిలో వివాహం చేసుకుందామనుకునేలోగా రష్యాతో యుద్ధం వచ్చిపడింది. తనకెలా ఉందోనని ఇక్కడ అనుభవ్ ఆందోళనకు గురయ్యారు. చివరకు రైలు మార్గంలో తన తల్లితో కలిసి అన్నా దేశం వీడారు. తర్వాత తన తల్లిని మెక్సికోలో ఉన్న తండ్రి వద్దకు పంపి.. ఆమె దిల్లీ విమానాశ్రయంలో దిగారు. ఆమె రావడంతో ఉద్వేగానికి గురైన భాసిన్‌.. అక్కడే ఆమెను గుండెలకు హత్తుకొని, వేలికి ఉంగరం తొడిగేశారు. అయితే ఈ క్రమంలో ఆమె తన వెంట తీసుకువచ్చిన వస్తువును చూసి, ఆయన ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తన ఇంటి నుంచి కొన్ని దుస్తులు తెచ్చుకున్న ఆమె.. వాటితోపాటే తన నానమ్మ పెళ్లి కానుకగా ఇచ్చిన కాఫీ మెషీన్‌ను వెంటపెట్టుకొచ్చారు. ‘తను శిక్షణ పొందిన మేకప్ ఆర్టిస్ట్‌. ఈ కాఫీ మెషీన్‌ కోసం ఎంతో విలువైన మేకప్ సామగ్రిని వదిలేసింది. ఈ మెషీన్ మా ప్రేమ కథకు నిజమైన హీరో అనుకుంటున్నా’ అంటూ భాసిన్ ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. 

ఇక ఆదివారం ఈ జంట ఒక్కటైంది. వివాహ చిత్రాలను వారు నెట్టింట్లో షేర్‌ చేశారు. ‘మేం కలిసిన రోజు నుంచి మా ప్రయాణం కాస్త చిత్రంగానే సాగింది. కానీ మాకు ఎదురైన ప్రతి అడ్డంకినీ ఎదుర్కొన్నాం. నీతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నాను బేబీ’ అంటూ అతడు ఉక్రెయిన్‌ భాగస్వామిని తన జీవితంలోకి ఆహ్వానించారు. అయితే తన పెంపుడు శునకం, ఇతర వస్తువుల కోసం అన్నా ఒకసారి ఉక్రెయిన్ వెళ్లాలనుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని