Tiger: అమ్మో.. పులి! ఆర్మీ వార్‌ కాలేజీలో డ్రోన్లతో గాలింపు

ఆర్మీ వార్‌ కాలేజీలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడి పులి సంచరిస్తుందన్న సమాచారంతో అక్కడ ఉన్నవారంతా భయంతో వణుకుతున్నారు.

Published : 08 May 2023 21:19 IST

మౌ:  మధ్యప్రదేశ్‌లోని ఆర్మీ వార్‌ కళాశాలలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఇండోర్‌ జిల్లా మౌలో ఉన్న సైనిక శిక్షణ, పరిశోధనా సంస్థ క్యాంపస్‌లోకి పులి ప్రవేశించడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్మీ వార్‌ కాలేజీ సత్వర ప్రతిస్పందన దళాలు, అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగాయి. పులి ఆచూకీ కోసం డ్రోన్‌ కెమెరాలతో జల్లెడపడుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం ఈ కాలేజీ క్యాంపస్‌లోని మూడో నంబర్‌ గేటు వద్ద పులి సంచరిస్తున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అప్రమత్తమైన అధికారులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఈ ఘటనపై ఆర్మీ వార్‌ కాలేజ్‌ అధికారులు మాట్లాడుతూ.. పులి ఆచూకీ కోసం గాలిస్తున్నా ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదన్నారు. క్యాంపస్‌లో చాలాచోట్ల పొదలతో నిండి ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి పవన్‌ జోషీ మాట్లాడుతూ.. మూడో నంబర్‌ గేటు వద్ద అమర్చిన సీసీటీవీలో పులి సంచరించడానికి సంబంధించిన సమాచారం అందిందన్నారు. ఆ ఫుటేజీని గమనించగా అందులో ఉన్నది పులిగా నిర్ధారణకు వచ్చామన్నారు.  గత ఐదేళ్లలో కోరల్‌, మాండులో పులులు కనిపించాయని.. తాజాగా ఇక్కడ పులి కనిపించడం ఇదే తొలిసారని తెలిపారు. మరోవైపు, అటవీశాఖ అధికారుల బృందం, కళాశాల సత్వర ప్రతిస్పందన దళం (క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌) తమ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. క్యాంపస్‌ను స్కానింగ్‌ చేసేందుకు డ్రోన్‌ కెమెరాలతో గాలిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు