Tornado: అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఇదీ ఒకటి: జో బైడెన్‌

అమెరికాను సుడిగాలులు(టోర్నడో) వణికిస్తున్నాయి. ఆరు రాష్ట్రాల్లో సుడిగాలులు విరుచుకుపడటంతో 80 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గల్లంతైనట్లు సమాచారం. అయితే, ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలియదంటూ స్థానిక మీడియా కథనాలు రాయడాన్ని బట్టి చూస్తే.. భారీ సంఖ్యలోనే ప్రాణనష్టం జరిగి

Updated : 12 Dec 2021 15:18 IST

వాషింగ్టన్‌: అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి. ఆరు రాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకుపడటంతో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గల్లంతైనట్లు సమాచారం. అయితే, ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలియదంటూ స్థానిక మీడియా కథనాలు రాయడాన్ని బట్టి చూస్తే.. భారీ సంఖ్యలోనే ప్రాణనష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది. సుడిగాలుల బీభత్సంపై దేశాధ్యక్షుడు జో బైడెన్‌ సమీక్ష నిర్వహించారు. ‘అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద విపత్తుల్లో ఒకటి’అని  ఈ సందర్భంగా బైడెన్‌ వ్యాఖ్యానించారు. కెంటకీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. టోర్నడో ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆయా ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటిస్తానని బైడెన్‌ వెల్లడించారు.

కెంటకీలో టోర్నడోల ధాటికి ఈ ప్రాంతంలోనే 70 మంది పౌరులు మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో అత్యధికులు మేఫీల్డ్‌లోని ఉన్న క్యాండిల్‌ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులుగా గుర్తించారు. సుడిగాలులు వీచే సమయంలో ఆ ఫ్యాక్టరీలో 110 మంది ఉన్నట్లు యాజమాన్యం వెల్లడించింది. 40 మందిని కాపాడగలిగామని పేర్కొంది. మేఫీల్డ్‌ పట్టణమంతా సుడిగాలుల కారణంగా నేలమట్టమైంది. అక్కడి చారిత్రక భవనాలు, కార్యాలయాలు కుప్పకూలాయి. అలాగే ఇల్లినోయీలో ఉన్న అమెజాన్‌ గోదాంలో గోడకూలి ఆరుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో గోదాంలో వంద మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా క్రిస్మస్‌ సందర్భంగా వచ్చిన ఆర్డర్స్‌ను ప్యాకింగ్‌ చేయడం కోసం నైట్‌షిఫ్ట్‌లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.

మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్‌, టెన్నెసీలోని వివిధ ప్రాంతాల్లోనూ టోర్నడోలు బీభత్సం సృష్టించి ఆస్తి, ప్రాణ నష్టం కలిగించాయి. బాధితులను కాపాడటం కోసం రెస్క్కూ సిబ్బందితోపాటు అమెరికా రెడ్‌ క్రాస్‌ సోసైటీ సహాయకచర్యల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. అమెరికా చరిత్రలో 1925 తర్వాత అత్యంత తీవ్రమైన సుడిగాలులు ఇవేనని అధికారులు చెబుతున్నారు. ఆ ఏడాది మిస్సౌరిలోని సుడిగాలుల ధాటికి 915 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కెంటకీ నగరంలో సుడిగాలులు సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Read latest National - International News and Telugu NewsRead latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని