మోర్బీ ఘటన నుంచి నేర్వని పాఠాలు.. తీగల వంతెనపై కారు నడిపిన టూరిస్టులు

కర్ణాటకలో ఓ తీగల వంతెనపై ఆకతాయిలు ప్రమాదకరంగా ప్రవర్తించారు. బ్రిడ్జిపై ఏకంగా కారును నడిపారు.

Published : 02 Nov 2022 01:22 IST

బెంగళూరు: గుజరాత్‌లోని మోర్బీ నగరంలో తీగల వంతెన దుర్ఘటనలో మానవ తప్పిదాలే ప్రధాన కారణంగా కన్పిస్తున్నాయి. కొందరు ఆకతాయిలు వంతెన తీగలను పట్టుకొని ప్రమాదకరంగా ఊపడమూ ఆ విషాదానికి ఓ కారణమైంది. ఆ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి.. కర్ణాటకలో కొందరు టూరిస్టులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తీగల వంతెనపైకి ఏకంగా కారును ఎక్కించి నడిపేందుకు ప్రయత్నించారు.

ఉత్తర కన్నడ జిల్లా యెల్లపురాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శివపుర తీగల వంతెనపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు టూరిస్టులు సస్పెన్షన్ బ్రిడ్జిపైకి కారును తీసుకొచ్చారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా స్థానికులతో వాగ్వాదం చేస్తూ కారును వంతెనపై కొంతదూరం తీసుకొచ్చారు. స్థానికులు గట్టిగా అభ్యంతరం చెప్పడంతో టూరిస్టులు కారును వెనక్కి తీసుకెళ్లారు. కారును తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం స్థానిక వార్తా ఛానళ్లలో వైరల్‌ అయ్యాయి. కారు వెనుక చాలా మంది ఉన్నారు. వాహనాన్ని తోసేప్పుడు వంతెన ఊగుతూ ప్రమాదకరంగా కన్పించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గత ఆదివారం గుజరాత్‌లోని మోర్బీ నగరంలో గల మచ్చు వంతెనపై ఉన్న తీగల వంతెన ప్రమాదవశాత్తూ కూలిపోయి 135 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. వంతెన సామర్థ్యం కంటే 3-4 రెట్లు ఎక్కువగా జనం దాని మీదకు చేరడంతో పాటు.. కొందరు ఆకతాయిలు వంతెన తీగలను ప్రమాదకరంగా ఊపడమూ దుర్ఘటనకు కారణమని అధికారులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని