Twitter: చివరి ‘వార్నింగ్‌’ ఇచ్చిన కేంద్రం

సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్‌ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై

Published : 05 Jun 2021 13:46 IST

దిల్లీ: సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్‌ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ నేడు తుది నోటీసులు జారీ చేసింది. తక్షణమే అధికారులను నియమించాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. 

డిజిటల్ మాధ్యమాల్లో కంటెంట్‌ నియంత్రణ కోసం కేంద్రం నూతన ఐటీ నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనల అమలు కోసం సోషల్‌మీడియా సంస్థలకు ఇచ్చిన 3నెలల గడువు ముగియడంతో మే 26 నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనల కింద చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉండగా.. ట్విటర్‌ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక, రూల్స్‌ ప్రకారం.. రెసిడెంట్ గ్రీవెన్స్‌ ఆఫీస్‌, నోడల్‌ కాంటాక్ట్‌ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించకపోవడంతో కేంద్రం ఆగ్రహించింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి వారం గడిచినా ట్విటర్‌ ఇంకా వీటిని పాటించేందుకు విముఖత చూపిస్తోందని ఆరోపించింది. 

ఈ క్రమంలోనే కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ నేడు ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదే చివరి నోటీసు అని, నిబంధనలు తక్షణమే పాటించకపోతో ట్విటర్‌ తన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది. అప్పుడు సంస్థ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

కాగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాకు వెరిఫైడ్‌ బ్లూ టిక్‌ మార్క్‌ను శనివారం కాసేపు తొలగించి మళ్లీ యాడ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది గంటలకే ట్విటర్‌కు నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని