Char Dham: చార్‌ధామ్‌ యాత్రపై ఆంక్షల ఎత్తివేత.. నూతన మార్గదర్శకాలు ఇవే!

చార్‌ధామ్‌ యాత్రపై పరిమితులను ఎత్తివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.....

Published : 07 Oct 2021 01:15 IST

దెహ్రాదూన్‌: చార్‌ధామ్‌ యాత్రపై పరిమితులను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. యాత్రికుల సంఖ్యలో ఎలాంటి పరిమితులు లేవని.. కానీ దర్శనాల కోసం తప్పనిసరిగా చార్‌ధామ్‌ బోర్డు పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఇకపై పోర్టల్ నుండి యాత్ర ఇ-పాస్ అవసరం లేదని వెల్లడించింది. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని, ఇది సాధ్యంకాని పక్షంలో మరింత మందిని అనుమతించాలని కోరుతూ కొద్దిరోజుల క్రితమే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు మంగళవారం స్పందిస్తూ రోజువారీ యాత్రికులపై పరిమితులను ఎత్తివేసింది.

ఇప్పటివరకు బద్రీనాథ్‌కు రోజుకు 1000 మంది భక్తులు, కేదార్‌నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మందికి మాత్రమే అనుమతి ఉంది. కాగా ఈ ఆంక్షలు సడలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవరణ దరఖాస్తు దాఖలు చేసింది. ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభమైన ఈ యాత్ర నవంబరు మధ్య వరకే కొనసాగుతుందని, ప్రస్తుతం భక్తుల సంఖ్యపై పరిమితి కారణంగా యాత్రికులపై ఆధారపడి ఉన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో నిబంధనలు సడలించాలని కోరింది. దీనిపై కోర్టు స్పందిస్తూ రోజువారీ పరిమితులను ఎత్తివేసింది. దీంతో ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న ధ్రువపత్రం లేదా 72 గంటల్లోగా తీసుకున్న కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టును యాత్రికులు అందించాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని