WHO: ‘అన్ని రకాల మహమ్మారులకు అంతిమ టీకా ఇదే’

రెండు రోజులపాటు రోమ్‌లో నిర్వహించిన జీ- 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కీలక ప్రకటన చేశారు. ‘కొవిడ్‌ మహమ్మారిని అంతం చేయడంలో వ్యాక్సిన్‌ సహయపడుతుంది. కానీ.. అన్ని రకాల...

Published : 01 Nov 2021 16:05 IST

రోమ్‌: రెండు రోజులపాటు రోమ్‌లో నిర్వహించిన జీ- 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కీలక ప్రకటన చేశారు. ‘కొవిడ్‌ మహమ్మారిని అంతం చేయడంలో వ్యాక్సిన్‌ సహయపడుతుంది. కానీ.. అన్ని రకాల మహమ్మారులు, ఆరోగ్య విపత్తులకు అంతిమ టీకా..సరైన నాయకత్వమే’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచానికి ఇదే అత్యవసరమని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ ఆవశ్యకతను కరోనా వివరించిందని, ఈ రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఎందుకు కొనసాగించాలో కూడా నేర్పిందని చెప్పారు. ‘కొవిడ్‌కు ముందు .. ఆరోగ్య సంబంధిత లక్ష్యాలను సాధించడంలో ప్రపంచం వెనుకబడి ఉంది. ఇప్పుడు మరింత వెనక్కు వెళ్లింది. దీంతోపాటు మలేరియా, క్షయ, హెచ్‌ఐవీ తదితర రుగ్మతల కట్టడిలో ఇన్నేళ్లలో సాధించిన ప్రయోజనాలనూ ప్రమాదంలో పడేసింద’ని టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

‘ఫ్రంట్‌లైన్‌ వ్యవస్థను బలోపేతం చేయాలి’

ఆరోగ్య భద్రతతోపాటు ప్రాథమిక వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు డబ్ల్యూహెచ్‌వో ప్రతిపాదిస్తున్న మూడు వ్యూహాత్మక ప్రాధాన్యాలకు మద్దతు ఇవ్వాలని టెడ్రోస్ ఈ సందర్భంగా ప్రపంచ దేశాలను కోరారు. మొదటిది.. ‘ప్రజలు అనారోగ్యం పాలవడానికి, చనిపోవడానికి గల అంతర్లీన కారణాల అన్వేషణ, పేదరికం, జాతి- లింగ అసమానతలు, వాతావరణ మార్పులు’. రెండోది.. ‘ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో అన్ని దేశాలు ఒప్పందం కుదుర్చుకోవడం’. మూడోది.. ‘ప్రతి దేశంలో ప్రాథమిక వైద్య వసతులతోపాటు అన్ని రకాల వ్యాధులు, మహమ్మారులపై పోరాడేందుకు ఫ్రంట్‌లైన్‌ వ్యవస్థను బలోపేతం చేయడం’ అని వివరించారు. అంతకుముందు ఈ సదస్సులో భాగంగా వాతావరణ మార్పులకు కళ్లెం వేయాలని కూటమిలోని దేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని