Divy Ayodhya App: భక్తుల కోసం ‘దివ్య్‌ అయోధ్య’ యాప్‌

అయోధ్య నగరానికి వచ్చే భక్తులు రామమందిరంతోపాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల గురించిన సమాచారం ‘దివ్య్‌ అయోధ్య’ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది.  

Published : 16 Jan 2024 02:25 IST

లఖ్‌నవూ: అయోధ్యలో శ్రీరాముడి (Ayodhya Ram Mandir) దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు ‘దివ్య్‌ అయోధ్య’ (Divy Ayodhya) యాప్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) విడుదల చేశారు. ఈ యాప్‌ ద్వారా నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. హోమ్‌స్టే (పర్యాటకులకు ఇంట్లో ఒక గదిని అద్దెకు ఇవ్వడం), హోటళ్లు, గుడారాలు, వీల్‌ఛైర్‌ అసిస్టెంట్‌, గోల్ఫ్‌కార్ట్‌ వాహనాలు, ఎలక్ట్రిక్‌ కార్లు, బస్సులను, టూరిస్ట్‌ గైడ్‌లను ముందస్తు బుకింగ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వ్యక్తిగత వివరాలను నమోదు చేసి లాగిన్‌ అవ్వాలి. యాప్‌లో స్థానిక వంటలు, తప్పక చూడాల్సిన ప్రదేశాలు, టూర్‌ ప్యాకేజ్‌లకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్యను ఆధ్యాత్మిక పర్యాటక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నగర శివార్లలో గ్రామీణ వాతావరణంలో ఇళ్లను నిర్మించే యోచనలో ఉంది. హోమ్‌స్టే కోరుకునే భక్తుల కోసం వీటిని కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ధర్మ పథ్‌, రామ్‌ పథ్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులను ప్రారంభించారు. విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత అయోధ్యను సందర్శించే భక్తుల కోసం మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనపై యోగి ప్రభుత్వం దృష్టి సారించనుంది. జనవరి 19 నుంచి లఖ్‌నవూ- అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. 

ప్రధాని మోదీ జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ మహాక్రతువులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. సుమారు 11 వేల మందికి పైగా అతిథులు హాజరవుతారని ట్రస్టు సభ్యులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే వారికి దేశీ నెయ్యితో తయారుచేసిన మోతిచూర్‌ లడ్డూతో పాటు అయోధ్య మట్టిని చిన్న బాక్సుల్లో అందజేయనున్నట్లు ట్రస్టు సభ్యుడొకరు తెలిపారు. ఆహ్వానితులు ఎవరైనా ఈ కార్యక్రమానికి రాలేకపోతే వారు అయోధ్యను సందర్శించినప్పుడు ఈ మట్టిని అందజేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని