Coronavirus: మరో కీలక నేతకు కరోనా పాజిటివ్‌.. తీవ్రమైన లక్షణాలున్నట్లు ట్వీట్‌!

భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. చాలా బలమైన లక్షణాలు ఉన్నాయని తెలిపారు....

Published : 09 Jan 2022 14:01 IST

దిల్లీ: భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నాయని తెలిపారు. తన నియోజకవర్గమైన పిలిభిత్‌లో మూడు రోజులు పర్యటించానని.. ఆ సమయంలో తనకు వైరస్‌ సోకి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల నుంచి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అభ్యర్థులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పార్టీల ముఖ్య కార్యకర్తలకు కరోనా వ్యాక్సిన్‌ ‘ప్రికాషనరీ డోసు’లు ఇవ్వాలని కోరారు. కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతోన్న ఈ సమయంలో ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు తప్పవని అభిప్రాయపడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌లలో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మార్చి 10న ఒకేసారి చేపడతారు. శనివారం విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌చంద్ర ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు.


కేజ్రీవాల్‌కు నెగెటివ్‌

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్‌గా తేలింది. జనవరి 4న ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా నెగెటివ్‌ రావడంతో ఆయన విధుల్లో పాల్గొననున్నారు. ట్విటర్‌ వేదికగా సీఎం స్వయంగా ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని