‘పప్పు ఎవరు..? హూ ఈజ్‌ పప్పు?’.. కేంద్రంపై టీఎంసీ ఎంపీ ప్రశ్నల వర్షం!

Mahua Moitra at Centre: లోక్‌సభ వేదికగా కేంద్రంపై తృణమూల్‌ ఎంపీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ పట్ల ప్రశ్నలు లేవనెత్తారు. ‘ఇప్పుడు పప్పు అని ఎవర్ని నిందించాలి’ అంటూ విమర్శలు గుప్పించారు. 

Published : 13 Dec 2022 20:05 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తృణమూల్‌ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ప్రశ్నల వర్షం కురిపించారు. పారిశ్రామికోత్పత్తి, ఇతర గణాంకాలను ఉదాహరణలుగా చూపుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ‘ఇప్పుడు పప్పు ఎవరు?’ అంటూ పదే పదే తన విమర్శల్లో ఆ పదాన్ని భాగం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు నిధుల వ్యయానికి సంబంధించిన చర్చలో భాగంగా లోక్‌సభలో మంగళవారం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యక్తుల అసమర్థత, వారిని అవమానించడానికి ‘పప్పు’ అనే పదాన్ని ఇదే ప్రభుత్వం, అధికార పార్టీ వినియోగించాయని గుర్తు చేస్తూ.. తన ప్రశ్నల దాడిని మొదలు పెట్టారు. ఆమె స్పీచ్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

  • దేశంలో పారిశ్రామికోత్పత్తి 26 నెలల కనిష్ఠానికి చేరిందని, ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే తయారీ రంగం ఏకంగా 5.6 శాతం క్షీణించిందని మొయిత్రా పేర్కొన్నారు. జాతీయ గణాంక కార్యాలయం వెలువరించిన పారిశ్రామికోత్పత్తి డేటాను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘దేశీయ పారిశ్రామికోత్పత్తి గతేడాది అక్టోబర్‌లో 3.3 శాతం వృద్ధి నమోదు చేస్తే ఈ ఏడాది 5.6. శాతం క్షీణించింది. దేశ విదేశీ నిల్వలు 72 బిలియన్‌ డాలర్లు పడిపోయాయాయి. ఇప్పుడు పప్పు అని ఎవర్ని అనాలి?’’ అని ప్రశ్నించారు.
  • ‘‘భాజపా అధ్యక్షుడు సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లో భాజపా ఓడిపోయింది. మరిప్పుడు ఎవర్ని అనాలి?
  • వర్దమాన దేశాల్లో విదేశీ సంస్థాగత మదుపరులు పెడుతున్న పెట్టుబడుల్లో దాదాపు 50 శాతం వరకు భారత్‌కే వస్తున్నాయని నిర్మలా సీతరామన్‌ చెప్పారు. అదే సమయంలో గడిచిన 10 నెలల్లో 2 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 12.5 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. దీనిపై ఎవర్ని అనాలి?
  • ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులతో దేశంలో ఒకరకమైన భయకంపిత వాతావరణం నెలకొంది. వ్యాపారులు, సంపన్నులు, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. అధికార పార్టీ.. విపక్ష నేతలను కొనుగోలు చేస్తుంటే అస్సలు పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ఈడీ విచారిస్తున్న రాజకీయ నేతల్లో 95 శాతం మంది ప్రతిపక్షానికి చెందిన వారే ఉంటున్నారు’’ అని మొయిత్రా పేర్కొన్నారు.
  • ‘‘2016లో ప్రధాని మోదీ నోట్ల రద్దు చేశారు. ఇప్పటికీ ఆ లక్ష్యం నెరవేరలేదు. దేశంలో నగదే రారాజుగా వెలుగొందుతోంది. నకిలీ కరెన్సీ అరికట్టడం అనేది ఇప్పటికీ కలగానే ఉంది.’’ అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

మహువా ‘పప్పు’ వ్యాఖ్యలను భాజపా ఎంపీ జగదాంబికా పాల్‌ ఖండించారు. ఆమె వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌ కుర్చీలో కూర్చున్న రాజేంద్ర అగర్వాల్‌ కోరారు. మోదీ హయాంలోనే భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. ఐదు ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ దూసుకెళుతోందన్నారు. 2024లో మళ్లీ తాము అధికారంలోకి రానున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని