Hybrid Variants: కలవరపెడుతున్న హైబ్రిడ్‌ వేరియంట్లు..!

XD, XE, XF అనే మూడు హైబ్రిడ్‌ రకాలను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.

Published : 02 Apr 2022 01:45 IST

హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంపవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గినప్పటికీ కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలో మ్యుటేషన్‌ కారణంగా కొత్తగా పుట్టుకొస్తున్న హైబ్రిడ్‌ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించింది. ఇప్పటివరకు XD, XE, XF అనే మూడు హైబ్రిడ్‌ రకాలను గుర్తించినట్లు పేర్కొన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ.. ఎక్స్‌ఈ స్ట్రెయిన్‌ (ఒమిక్రాన్‌ రెండు వేరియంట్ల ఉపరకమైన హైబ్రిడ్‌ స్ట్రెయిన్‌)లో 10శాతం పెరుగుదల రేటు అధికంగా ఉన్నట్లు పేర్కొంది.

మూడు వేరియంట్లు గుర్తింపు

కరోనా వైరస్‌ విజృంభణ తక్కువగానే ఉన్నప్పటికీ వైరస్‌ చాలా మార్పులకు గురవుతూనే ఉంది. ఇప్పటివరకు మూడు హైబ్రిడ్‌ వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్లు యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) వెల్లడించింది. డెల్టా, బీఏ.1 కాంబినేషన్‌లో XD, XE ఏర్పడగా.. ఒమిక్రాన్‌ ఉపరకాల్లో మార్పుల వల్ల XE ఏర్పడినట్లు తెలిపింది.

* XD వేరియంట్‌ ఫ్రాన్స్‌లో వెలుగు చూసింది. వీటిలో స్పైక్‌ ప్రొటీన్‌ బీఏ.1 నుంచి కాగా మిగతా జన్యుక్రమం డెల్టా నుంచి వచ్చింది.

* XF వేరియంట్‌ యూకేలో తొలుత గుర్తించారు. బీఏ.1 నుంచి స్పైక్‌ ప్రొటీన్‌ రాగా.. మరో ఐదోవంతు జన్యుక్రమం డెల్టా రకం నుంచి ఉన్నట్లు అంచనా.

* XE మాత్రం బీఏ.1, బీఏ.2 ఉపరకాల వల్ల ఏర్పడింది. బీఏ.2 నుంచి స్పైక్‌ ప్రొటీన్‌ రాగా, మరో ఐదోవంతు బీఏ.1 జన్యుక్రమంగా గుర్తించారు.

ఆందోళనకరమేనా..?

జనవరి 19న యూకేలో XE రీకాంబినాంట్‌ గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ఈ మూడు హైబ్రిడ్‌ వేరియంట్లలో XE, XF రకాలు మాతృ వైరస్‌ మాదిరిగానే ప్రవర్తించే అవకాశం ఉందని ప్రముఖ వైరాలజిస్ట్‌ టామ్‌ పీకాక్‌ వెల్లడించారు. XD మాత్రమే కొంత ఆందోళనకరమైనదన్న ఆయన.. ఇప్పటికే జర్మనీ, నెదర్లాండ్‌, డెన్మార్క్‌ దేశాల్లో వెలుగు చూసిందన్నారు. అయితే, వీటి ప్రభావాలపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేనప్పటికీ.. వాటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని