Kedarnath: కేదార్‌నాథ్‌లో అపచారం.. ఆ మహిళపై చర్యలు తీసుకోండి

కేదార్‌నాథ్‌ గర్భాలయంలో శివలింగంపై ఓ మహిళ కరెన్సీ నోట్లు చల్లడం వివాదాస్పదమైంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ పోలీసులను కోరింది.

Updated : 19 Jun 2023 19:47 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) హిమాలయాల్లో వెలసిన కేదార్‌నాథ్‌ ఆలయం (Kedarnath Temple) గర్భగుడిలో శివలింగంపై ఓ మహిళ కరెన్సీ నోట్లు చల్లడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆ మహిళపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ పోలీసులను కోరింది. అయితే, ఆ మహిళ ఎవరన్నది ఇంతవరకు తెలియరాలేదు. వీడియోను పరిశీలిస్తే.. శివలింగానికి పక్కనే కుడివైపున నిలబడి ఉన్న మహిళ  కేదారేశ్వరుడిపై నోట్లు విసురుతోంది. పురోహితులు కూడా మంత్రాలు పఠిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి కేదార్‌నాథ్‌ ఆలయ గర్భగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధం. అంతేకాకుండా గర్భగుడిలోకి వెళ్లిన మహిళ అవమానకరంగా కరెన్సీ నోట్లను చల్లుతూ అనుచితంగా ప్రవర్తిస్తుంటే ఆమెను ఎవరూ వారించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘దేవాలయంలో ఇదేం ప్రవర్తన,  పెళ్లి వేడుక అనుకుంటున్నారా?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేవాలయ సిబ్బంది, నిర్వహణ అధికారుల తీరుపై విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌ స్పందించారు. రుద్రప్రయాగ్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాకు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు కేదార్‌నాథ్‌ ఆలయ గోడల స్వర్ణ తాపడం విషయంలో రూ.125 కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఆలయ సీనియర్‌ పూజారి సంతోష్‌ త్రివేది చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో తాజాగా శివలింగంపై మహిళ కరెన్సీ నోట్లను చల్లడం అక్కడి అధికారుల పని తీరు, దేవాలయ నిర్వహణ తదితర అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని