Sandeshkhali: ‘బెంగాల్‌లో మహిళలంతా సురక్షితమే..’ కోల్‌కతాలో మమతా భారీ ర్యాలీ

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గురువారం కోల్‌కతాలో మహిళలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలంతా సురక్షితమేనని పేర్కొన్నారు.

Published : 07 Mar 2024 17:55 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో మహిళలంతా సురక్షితమేనని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు. పెద్దఎత్తున మహిళలతో గురువారం కోల్‌కతాలో నిర్వహించిన ప్రదర్శనకు దీదీ నాయకత్వం వహించారు. సందేశ్‌ఖాలీ ఘటనల (Sandeshkhali Incidents) విషయంలో టీఎంసీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విరుచుకుపడిన మరుసటిరోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆడబిడ్డలకు రక్షణ కల్పించే విషయంలో విఫలమైన బెంగాల్‌ ప్రభుత్వం.. దానిపై బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని మోదీ విమర్శించిన విషయం తెలిసిందే.

‘‘బెంగాల్‌లో మహిళలపై హింస జరుగుతోందని నిన్న కొంతమంది భాజపా నాయకులు ఆరోపించారు. మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు వారు ఎక్కడికెళ్లారు? హాథ్రస్‌లో ఒక అత్యాచార బాధితురాలి మృతదేహానికి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించినప్పుడు ఎక్కడున్నారు? బిల్కిస్ బానోని మరిచిపోయారా?’’ అంటూ మమతా విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రంలో అతివలు అత్యంత సురక్షితంగా ఉన్నారనే దానిపై సవాలు విసరగలనన్నారు. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ భాజపాలో చేరడంపై స్పందిస్తూ.. అటువంటి వారినుంచి న్యాయం ఎలా ఆశించగలమని ప్రశ్నించారు.

సందేశ్‌ఖాలీతో టీఎంసీ కొట్టుకుపోతుంది: ప్రధాని మోదీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో సందేశ్‌ఖాలీ ప్రాంతానికి చెందిన మహిళలూ పాల్గొన్నట్లు సమాచారం. ఇటీవల రాజ్యసభకు ఎంపికైన సాగరిక ఘోష్‌, పార్టీ నేతలు శశి పంజా, సుష్మితా దేవ్‌ తదితరులు భాగమయ్యారు. ఇదిలాఉండగా.. కొద్దిరోజులుగా సందేశ్‌ఖాలీ ప్రాంతం వార్తల్లో నిలుస్తోంది. సస్పెన్షన్‌ ఎదుర్కొంటోన్న టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ స్థానికుల నుంచి భూములను లాక్కోవడం, ఇవ్వనిపక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ అకృత్యాలపై నిరసనలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని