సందేశ్‌ఖాలీతో టీఎంసీ కొట్టుకుపోతుంది

మహిళలకు రక్షణ కల్పించే విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం విఫలమై, దానిపై బుజ్జగింపు రాజకీయాలకు మాత్రం పాల్పడుతోందని ప్రధాని మోదీ విమర్శించారు.

Updated : 07 Mar 2024 06:25 IST

అక్కడ జరిగిన ఘటనలు సిగ్గుచేటు
మమత పార్టీ పని అయిపోయినట్లే: మోదీ
దేశంలో తొలి నదీగర్భ మెట్రోరైలు ప్రారంభం 

బారాసత్‌ (పశ్చిమబెంగాల్‌): మహిళలకు రక్షణ కల్పించే విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం విఫలమై, దానిపై బుజ్జగింపు రాజకీయాలకు మాత్రం పాల్పడుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. ‘పేదలు, దళితులు, గిరిజన కుటుంబాలకు చెందిన సోదరీమణులు, ఆడబిడ్డలపై తృణమూల్‌ నేతలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీనిపై మహిళలు భగ్గుమంటూ దుర్గామాతల్లా పోరాటం చేస్తున్నారు. సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటనలపై వారి ఆగ్రహజ్వాలలు బెంగాల్‌లో ప్రతి ప్రాంతాన్నీ తాకుతాయి. చివరకు అవి లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు నామరూపాల్లేకుండా చేస్తాయి’ అని ఆయన చెప్పారు. సందేశ్‌ఖాలీ ప్రాంతం ఉన్న ‘ఉత్తర 24 పరగణాల జిల్లా’ కేంద్రమైన బారాసత్‌లో బుధవారం నిర్వహించిన ‘నారీశక్తి వందన్‌ అభినందన్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తర్వాత ఆ ప్రాంతానికి చెందిన కొందరు మహిళలతో భేటీ అయ్యారు. జరిగిన దురాగతాలను వివరిస్తూ వారు కన్నీళ్ల పర్యంతయ్యారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మోదీ భరోసా ఇచ్చారు.

అలాంటి నేలపై ఇలాంటి పనులా?

‘‘సందేశ్‌ఖాలీ ఘటనలు సిగ్గు చేటు. ప్రతిఒక్కరినీ ఇవి తలదించుకునేలా చేశాయి. మహిళా సాధికారతకు బెంగాల్‌ ఎప్పటినుంచో పేరొందింది. ఇలాంటి నేలపై తృణమూల్‌ పాలనలో మహిళలపై ఘోరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. సందేశ్‌ఖాలీ ఘటనలకు బాధ్యులైనవారి అరెస్టును రాష్ట్ర సర్కారు అడ్డుకుంటోంది. బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేయడానికి కేంద్రం ఒక సహాయవాణి (హెల్ప్‌లైన్‌) ఏర్పాటు చేసినా తృణమూల్‌ ప్రభుత్వం దానినీ పనిచేయనివ్వడం లేదు. ఇలాంటి మహిళా వ్యతిరేక ప్రభుత్వాలు మహిళలకు ఎలాంటి మంచి పనులు చేయలేవు’’ అని ప్రధాని చెప్పారు.  బిహార్‌లో రూ.12,800 కోట్ల పనుల్ని మోదీ కోల్‌కతా నుంచి ఆవిష్కరించారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు చెందిన పలు పనుల్ని కూడా ప్రారంభించారు.

మెట్రో వేడుకకు మమత గైర్హాజరు

దేశంలో తొలిసారిగా హుగ్లీ నదీగర్భంలో నిర్మించిన మెట్రోరైలును మోదీ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి దానిలో ప్రయాణించారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దీనికి హాజరుకాలేదు. దేశంలోని వేర్వేరు నగరాల్లో రూ.15,400 కోట్ల మెట్రో ప్రాజెక్టులను కూడా మోదీ ప్రారంభించారు. మహిళాభద్రతపై మోదీ వ్యాఖ్యలను తృణమూల్‌ ఖండించింది. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలు వ్యక్తం చేసిన మహిళా రెజ్లర్లు దిల్లీ పోలీసుల చేతిలో హింసకు గురైనప్పుడు హెల్ప్‌లైన్‌ ఏమైందని ప్రశ్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని