Indian Passport: శక్తిమంతమైనపాస్‌పోర్ట్‌ల జాబితాలో మెరుగైన భారత్‌ ర్యాంకు

2022లో శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ సంస్థ విడుదల చేసింది.ఈ జాబితాలో భారత్‌ గతేడాదికంటే ఏడు స్థానాలు మెరుగుపరుచుకుంది. 

Published : 15 Jan 2022 11:36 IST

వీసా లేకుండానే 90 దేశాలకు వెళ్లొచ్చు..

  

దిల్లీ: ప్రపంచ దేశాల్లో భారత పాస్‌పోర్టు విలువ పెరుగుతోంది. వీసా లేకుండా మరిన్ని దేశాలు వెళ్లేలా భారత్‌ పాస్‌పోర్ట్‌ ర్యాంక్‌ మెరుగైంది. తాజాగా విడుదల చేసిన శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్‌ ఏడు స్థానాలు మెరుగుపరుచుకుంది. గతేడాది 90వ స్థానంలో ఉన్న భారత్‌ పాస్‌పోర్ట్ తాజా ర్యాకింగ్స్‌లో 83వ స్థానానికి చేరుకుంది. దీంతో వీసా లేకుండా భారత్‌ పాస్‌పోర్ట్‌తో 60 దేశాలు చుట్టిరావొచ్చు. గతంలో 58 దేశాలకు వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉండేది. ఏటా ప్రంపచ దేశాల్లోని శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ అనే సంస్థ ప్రకటిస్తుంది. అంర్జాతీయ విమాన రవాణా సంఘం (ఐఏటీఏ) నుంచి సేకరించిన సమాచారం మేరకు హెన్లీ సంస్థ 2022లో 199 దేశాలకు సంబంధించి ఈ జాబితాను విడుదల చేసింది.

ఈ పాస్‌పోర్ట్ సూచీలో జపాన్‌, సింగపూర్‌ ప్రథమస్థానంలో నిలిచాయి. ఈ రెండు దేశాల పాస్‌పోర్ట్‌లతో వీసా లేకుండా 192 దేశాల్లో ప్రయాణించవచ్చని తెలిపింది. జర్మనీ, దక్షిణ కొరియా పాస్‌పోర్ట్‌లు ద్వితీయ స్థానం పొందాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్, లక్సెంబర్గ్‌, స్పెయిన్‌ దేశాలు మూడో స్థానంలో ఉన్నాయి. ఫాన్స్‌, నెదర్లాండ్స్‌, స్వీడన్‌, ఆస్ట్రియా, డెన్మార్క్‌ దేశాల పాస్‌పోర్టులు నాలుగో స్థానంలో నిలిచాయి. ఐదో స్థానంలో ఐర్లాండ్, పోర్చుగల్‌ ఉన్నాయి. అమెరికా, బ్రిటన్‌, బెల్జియమ్‌, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్‌ దేశాల పాస్‌పోర్టులు ఆరో స్థానానికి పరిమితమయ్యాయి. గతేడాది ఇవి ఎనిమిదో స్థానంలో నిలిచాయి. వీసా లేకుండా అమెరికా పాస్‌పోర్ట్‌తో 180 దేశాల్లో పర్యటించవచ్చు.

ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, గ్రీక్, మాల్టాలు ఏడో స్థానంలో ఉన్నాయి. పోలాండ్‌, హంగరీలకు 8వ ర్యాంక్, లిథువేనియా, స్లొవేకియాలకు 9వ ర్యాంకు దక్కాయి. ఎస్టోనియా, లాట్వియా, స్లొవేనియాలు పదో స్థానాన్ని దక్కించుకున్నాయి. 2022 జాబితాలో మొదటి పది స్థానాల్లో  యూరప్ దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లే ఎక్కువగా ఉండటం గమనార్హం. అరబ్‌ దేశాల్లో యూఏఈ గోల్డెన్‌ వీసా 15 స్థానంలో నిలిచింది. దాయాది దేశం పాకిస్థాన్‌ 108వ స్థానంలో ఉండగా, పొరుగు దేశం చైనా 64వ స్థానంలో నిలిచాయి. అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్‌గా ఆఫ్ఘనిస్థాన్ పాస్‌పోర్ట్‌ చివరి స్థానంలో నిలిచింది. ఇటీవల ఆ దేశంలో చోటు చేసుకున్న పరిణామాలే అందుకు కారణంగా చెప్పవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని