Sansad TV: హ్యాకింగ్‌కు గురైన సంసద్‌ టీవీ.. యూట్యూబ్‌ ఖాతా తొలగింపు

పార్లమెంట్‌ ఉభయ సభల కార్యకలాపాలను ప్రత్యక్ష  ప్రసారం చేసే సంసద్‌ టీవీ యూట్యూబ్‌ ఖాతాను నేడు రద్దు చేశారు. యూట్యూబ్‌ మంగళవారం ఈ ఖాతాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Updated : 15 Feb 2022 14:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పార్లమెంట్‌ ఉభయ సభల కార్యకలాపాలను ప్రత్యక్ష  ప్రసారం చేసే సంసద్‌ టీవీ యూట్యూబ్‌ ఖాతాను తాజాగా తొలగించారు. ఈ ఖాతాను తొలగిస్తున్నట్లు యూట్యూబ్‌ మంగళవారం ప్రకటించింది. తమ కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను ఈ చర్య తీసుకొన్నట్లు వివరణ ఇచ్చింది. అయితే.. ఏ నిబంధన ఉల్లంఘించడం వల్ల ఈ నిర్ణయం తీసుకొందో మాత్రం తెలియజేయలేదు. గూగుల్‌ కూడా దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

మరోపక్క సంసద్‌ టీవీ మాత్రం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తమ యూట్యూబ్‌ ఛానల్‌ను కొందరు మోసగాళ్లు హ్యాక్‌ చేసినట్లు వివరణ ఇచ్చింది. దీనిని సరిచేసేందుకు యూట్యూబ్‌ ప్రయత్నిస్తోందని వెల్లడించింది.  నిన్న అర్థరాత్రి దాటిన తర్వాత హ్యాకర్లు దీనిని ఆధీనంలోకి తెచ్చుకుని లైవ్‌స్ట్రీమ్‌ ప్రసారం చేశారు. దీంతోపాటు ఛానల్‌  పేరును ‘ఇథేరియం’గా మార్చారు. తెల్లవారుజామున 3.45 సమయంలో తిరిగి ఛానల్‌ నియంత్రణను  తమ ఆధీనంలోకి తీసుకొన్నట్లు సంసద్‌ టీవీ పేర్కొంది.

ప్రస్తుతం ఈ యూట్యూబ్‌ ఖాతా 404 ఎర్రర్‌తో.. ఈ పేజీ అందుబాటులో లేదనే సందేశాన్ని చూపిస్తోంది. హ్యాకింగ్‌పై ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ కూడా సంసద్‌ టీవీని హెచ్చరించింది. ప్రస్తుతం యూట్యూబ్‌ సమస్యను సరిచేసిన తర్వాత మళ్లీ అందుబాటులోకి తెస్తుందని సంసద్‌ టీవీ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని