Zelensky : మాకు సాయం చేయండి: మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ

సంక్షోభంలో చిక్కుకుపోయిన ఉక్రెయిన్‌(Ukraine) తన దేశ పునర్నిర్మాణం నిమిత్తం ప్రపంచ సాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ మంత్రి ఒకరు భారత్‌లో పర్యటించారు. 

Updated : 12 Apr 2023 11:29 IST

దిల్లీ: అదనపు మానవతా సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీ(PM Modi)కి లేఖ రాశారు. రష్యా దాడితో సంక్షోభంలో చిక్కుకుపోయిన ఉక్రెయిన్‌(Ukraine) ఈ మేరకు అభ్యర్థన చేసింది. ఈ లేఖ గురించి భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. 

ఏడాదికిపైగా ఉక్రెయిన్ దేశం రష్యా దురాక్రమణను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ ఉప మంత్రి ఎమినే జపరోవా(Emine Dzhaparova) భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి జెలెన్‌స్కీ(Zelensky) రాసిన లేఖను ఆమె విదేశాంగ శాఖకు అందించారు. వైద్య సామాగ్రి వంటి అదనపు మానవతా సాయం అందించాలని అందులో కోరారు. అందుకు భారత్‌ ముందుకువచ్చిందని వెల్లడిస్తూ మన విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ట్విటర్‌లో స్పందించారు. అలాగే ఉక్రెయిన్‌ పునర్నిర్మాణం భారత సంస్థలకు ఓ అవకాశమని జపరోవా తెలిపారు. 

రష్యా(Russia), ఉక్రెయిన్‌(Ukraine) మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సోమవారం భారత్‌ నుంచి ఆమె మరింత సహకారాన్ని కోరారు.  మోదీ, ఇతర ఉన్నతాధికారులు తమ దేశంలో పర్యటించాలని అభ్యర్థించారు. అయితే.. ఇతర దేశాలతో భారత్‌కున్న సంబంధాల విషయంలో సూచనలు చేసే స్థితిలో తమ దేశంలేదన్నారు. రష్యా నుంచి భారత్‌ భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి ఈ దిగుమతులు పెరిగాయి. 

యుద్ధం తర్వాత మొదటిసారి భారత్‌లో పర్యటిస్తోన్న ఆమె.. మనదేశంపై ప్రశంసలు కురిపించారు. ‘భారత్‌ ఒక గ్లోబల్‌ ప్లేయర్‌.. విశ్వ గురువు అని నేను భావిస్తున్నాను’ అని అన్నారు. అలాగే తాము విలువల కోసం పోరాడుతూ తీవ్ర వేదనను అనుభవిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని