
Spy: ప్రేమించి మోసం చేసిన గూఢచారి.. మహిళకు₹2కోట్ల పరిహారం!
లండన్: అనగనగా ఓ గూఢచారి. తన గుర్తింపును దాచిపెట్టి నకిలీ పేరుతో అండర్ కవర్ ఆపరేషన్ చేపడతాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి తారసపడుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు.. ఇలాంటి సీన్లు చాలా సినిమాల్లో చూసి ఉంటారు కదా..! వాస్తవంగానూ ఇలాంటిదే జరిగింది. అయితే, ఆ గూఢచారి గురించి ప్రియురాలికి అసలు విషయం తెలియడంతో తనను మోసం చేశాడంటూ ఆమె కేసు పెట్టింది. సుదీర్ఘ న్యాయపోరాటంలో గెలుపొంది.. పరిహారం కింద పోలీసుశాఖ నుంచి భారీ మొత్తంలో నగదు అందుకుంది. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మార్క్ కెన్నడీ ఓ పోలీస్ ఆఫీసర్. మెట్రోపాలిటన్ పోలీస్ పబ్లిక్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ యూనిట్ కోసం 2003లో గూఢచారిగా పనిచేశారు. ఓ అండర్ కవర్ ఆపరేషన్ నిమిత్తం పర్యావరణవేత్త అవతారమెత్తి తన పేరును మార్క్ స్టోన్‌గా మార్చుకున్నారు. అయితే, అదే ఏడాది పర్యావరణ కార్యకర్త కేట్ విల్సన్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్లపాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి 2005లో విడిపోయారు. అయితే, తను ప్రేమించిన వ్యక్తి పర్యావరణవేత్త కాదని, ఓ గూఢచారన్న విషయాన్ని ఐదేళ్ల తర్వాత కేట్ గుర్తించింది. అంతేకాదు, అప్పటికే మార్క్‌కి వివాహమైందని, మరికొందరు మహిళలతోనూ సంబంధాలున్నాయని తెలుసుకుంది.
దీంతో మార్క్ నిజాలు చెప్పకుండా నకిలీ గుర్తింపుతో తనని ప్రేమించి మోసం చేశాడని, తన వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిందంటూ కేట్.. 2010లో కోర్టును ఆశ్రయించింది. మార్క్ కెన్నడీ మోసం అప్పట్లో యూకే వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీటూ ఉద్యమం సమయంలోనూ ఈ కేసు తెరపైకి వచ్చింది. అయితే, దశాబ్దానికిపైగా కొనసాగిన ఈ కేసులో ఇన్వెస్టిగేటరీ పవర్స్ ట్రిబ్యునల్ ఇటీవల కేట్కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. మహిళ మానవ హక్కులకు భంగం కలిగిందని పేర్కొంటూ.. మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం, నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ కేట్కు 2.29లక్షల పౌండ్లు(రూ. 2.3కోట్లు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.