వాళ్లలో ఒక్కరిని కూడా వదలను

తన మాటల సందడితో బుల్లితెర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాదు, ‘రంగమ్మత్త’ వంటి పాత్రలతో వెండితెర పైనా శెభాష్‌ అనిపించుకున్నారామె. ఏ షోలోనైనా ఆమె ఉంటే ఆ సందడే వేరు. చలాకీ మాటలతో, చిరునవ్వులతో అలా కాలం గడిపోతుంది. ఆమే వ్యాఖ్యాత, నటి

Updated : 26 Aug 2020 10:34 IST

తన మాటల సందడితో బుల్లితెర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాదు.. ‘రంగమ్మత్త’ వంటి పాత్రలతో వెండితెర పైనా శెభాష్‌ అనిపించుకున్నారామె. ఏ షోలోనైనా ఆమె ఉంటే ఆ సందడే వేరు. చలాకీ మాటలతో, చిరునవ్వులతో అలా కాలం గడిచిపోతుంది. ఆమే వ్యాఖ్యాత, నటి అనసూయ. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో  సరదాగా’ కార్యక్రమంలో ఆమె పాల్గొని అనేక సరదా ముచ్చట్లతో పాటు, తన జీవితంలో పడిన కష్టాలను సైతం చెప్పుకొచ్చారు.

మీ అసలు పేరు పవిత్రా?

అనసూయ: అమ్మ నా పేరు పవిత్ర అని పెడదామనుకున్నారట. నాన్నగారి కుటుంబం నుంచి చూస్తే నేనే మొదటి ఆడపిల్లను. దీంతో వాళ్లమ్మ పుట్టిందనుకొని ఆ పేరు పెట్టారు. అలా నా పేరు అనసూయ అయింది.

అనసూయ పేరు కలిసొచ్చిందా? పవిత్ర పెడతే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా?

అనసూయ: చాలాసార్లు అనుకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్కూల్లో చాలా మంది కావాలని గట్టిగా ‘అనసూయ...’ అంటూ పిలిచేవారు. అప్పటి నుంచి ఎవరైనా ‘అను’ అని పిలిస్తేనే పలికేదాన్ని. ఎన్‌సీసీలో చేరిన తర్వాత ‘అనసూయ’పేరు వెనుక ఉన్న కథ తెలిసి సిగ్గుపడ్డా. ఆ తర్వాత ఎవరు ఎలా పిలిచినా పట్టించుకునేదానిని కాదు.

టీవీ ఇండస్ట్రీకి రాకముందు అనసూయ ఎవరు? ఏ ఊరు? ఏం చదువుకున్నావు?

అనసూయ: నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్‌. హెచ్‌ఆర్‌ మేజర్‌ తీసుకున్నా. ఒక విజువల్‌ ఎఫెక్ట్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా కూడా చేశా. అంతకన్నా ముందు బ్యాంకులో టెలికాలర్‌గా చేశా. రూ.5వేలు జీతం.

మీ ఆయన భరద్వాజ్‌ పరిచయం ఎలా?

అనసూయ: సుశాంక్‌ భరద్వాజ్‌ను ఎన్‌సీసీలో కలిశా. అదొక పెద్ద స్టోరీలెండి. ఎవరికైనా చెబితే, ‘ఎన్‌సీసీలో ట్రైనింగ్‌కు వెళ్లకుండా లవ్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారా’ అని అంటారని ఎవరికీ చెప్పను.

మీ లవ్‌స్టోరీ ఇంట్లో తెలిసి తొలుత ఒప్పుకోలేదట!

అనసూయ: అవునండీ. సుశాంక్‌ కూడా ‘పెళ్లి చేసుకుందామా?’ అని అన్నాడు. వెంటనే ఈ విషయాన్ని అమ్మకు చెప్పా. వాళ్లు ఒప్పుకోలేదు. ‘వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం’ అని నేను అంటే, ‘మన కుటుంబాల్లో గౌరవం ఉండదు’ అని సుశాంక్‌ భరద్వాజ్‌ ఆపారు. 9 సంవత్సరాల తర్వాత ఒప్పుకొన్నారు. పెళ్లి కూడా అయిష్టంగానే జరిగింది. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత అందరం ఒక్కటయ్యాం.

టెలివిజన్‌ రంగానికి రావాలని ఎందుకు అనిపించింది?

అనసూయ: స్కూల్లో ఉన్నప్పుడు  నేను ఎత్తుగా ఉండటంతో ‘నువ్వు మోడల్‌ అవ్వొచ్చు కదా’ అనేవారు. పిక్సలాయిడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నప్పుడు చాలా మంది దర్శకులు వచ్చేవారు. వారిలో సుకుమార్‌గారు కూడా ఉన్నారు. అప్పట్లోనే ‘ఆర్య’ మూవీలో అడిగారు. ప్రతి తెలుగు ఇంట్లో సినిమా ఇండస్ట్రీ అంటే ఒక భయం ఉంటుంది. నాకు కూడా ఉండేదేమో. పైగా నాకు అప్పటికే నిశ్చితార్థం అయిపోయింది. చాలా సినిమా ఆఫర్లు వచ్చినా కూడా ‘వద్దు’ అని చెప్పేదాన్ని. చివరకు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత న్యూస్‌ రీడర్‌గా చేరాను.

సోషల్‌ మీడియాలో మీ మీద ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంటుంది?
అనసూయ: ‘అత్తారింటికి దారేది’ సినిమా వచ్చినప్పటి నుంచి ఈ ట్రోలింగ్‌ మొదలైంది. అప్పుడు ట్విటర్‌కు కొత్త. ‘ఆ పాటలో నేను లేను. గుంపులో గోవిందంలా లేకపోవడం మంచిది అయింది’ అని ట్వీట్‌ చేశా. అంతే, ట్రోలింగ్‌ మొదలైంది. ఒక ఆర్టిస్ట్‌గా ఫోకస్‌ మొత్తం మనపై ఉండాలనుకోవడం తప్పు కాదు కదా! నేను ఒక్కదాన్ని అయితే చేసేదాన్నేమో. పైగా నేను ఆరునెలల గర్భవతిని. బహుశా ఆ పాట చేయకపోవడానికి అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. ట్రోలింగ్‌ విషయానికొస్తే, కొందరు నెటిజన్లకు ‘తెలుగింటి అమ్మాయిలు అంటే లోకువ’ అని ఒకప్పుడు బాధేసేది. వివరణలు ఇచ్చుకుంటూ ఉండేదాన్ని. చాలా డిప్రెషన్‌కు వెళ్లేదాన్ని. అప్పుడు నా కుటుంబం నాకు అండగా నిలబడింది.

డెలివరీ తర్వాత ఏ మహిళ అయినా, శరీరకంగా, మానసికంగా వీక్‌ అయిపోతారు. కానీ, నా శ్రేయోభిలాషుల వల్ల నేను త్వరగా కోలుకున్నా. ఇప్పటికీ కొందరు ఉన్నారు. నేను ఎలా ఉండాలో వాళ్లే నిర్ణయిస్తారు. ‘నేను నొప్పులు పడి.. నేను కని.. నేను పెంచుకుంటున్నా. కష్టమంతా నాది’. కానీ, వాళ్లు ‘నువ్వు తల్లివి.. అలా ఉండలేవా’ అంటుంటారు. ఇక ఎవరినీ ఉపేక్షించాలనుకోలేదు. అందుకే రెబల్‌గా మారా. ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా కొంచెం తగ్గాను. నా దగ్గర ఎంతోమంది మీద ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. ఒక్కరినీ వదిలేది లేదు. ఇలా ట్రోల్స్‌ చేసేవారిని కీబోర్డ్‌ వారియర్స్‌ అంటాను. ఎదురుగా నిలబడితే ఒక్క మాట కూడా మాట్లాడలేరు. అమ్మవారిని దైవంగా కొలిచే ఈ దేశంలో ఒక మహిళపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. నా పిల్లలను, నా భర్తను కూడా ఇందులోకి లాగుతారు.

మీ అమ్మగారి నుంచి మీకు సపోర్ట్‌ ఎలా ఉండేది?

అనసూయ: నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆమే కారణం. నేను షూటింగ్‌కు, మా ఆయన జాబ్‌కు వెళ్లిపోతే, నా పిల్లలను అమ్మ జాగ్రత్తగా చూసుకునేది. ఒకవేళ నా పిల్లలకు పిల్లలు పుట్టాలనుకున్నప్పుడు ‘నా వల్ల కాదు.. మీరు చూసుకునే వీలుంటే కనండి’ అని చెప్పేస్తా. మా కోసం అమ్మ చాలా కష్టపడ్డారు. ఇంటి అద్దె కట్టుకునేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చేది. స్కూల్‌ ఫీజు కట్టకపోతే నిలబడిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మ.. పక్కింటి వాళ్ల చీరలకు ఫాల్స్‌ కుట్టి, నాకు చెల్లెళ్లకు దుస్తులు, స్కూల్‌ ఫీజులు కట్టేది. నా జీవితంలో చిన్నప్పటి నుంచి తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. 50 పైసలు కలిసి వస్తుందని, రెండు స్టాప్‌లు నడిచి వెళ్లి బస్సు ఎక్కేదాన్ని. నా పొగరు.. బలుపు.. ధైర్యం.. అన్నీ అమ్మనుంచే వచ్చి ఉంటాయి. ఎలా బతకాలో కూడా ఆమె నుంచి నేర్చుకున్నా.

మీ మొదటి సినిమా ఏది?

అనసూయ: మొదటగా ఒప్పుకొన్నది ‘క్షణం’ విడుదలైంది మాత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’.

‘కథనం’ ఫ్లాప్‌ తర్వాత 15రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట!

అనసూయ: నేనెప్పుడూ ఒక సినిమా నా భుజాలపై మోసుకెళ్లాలని అనుకోలేదు. ఎవరూ ఫ్లాప్‌ సినిమా తీద్దామని మొదలు పెట్టరు కదా! ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తపిస్తాం. అందుకే నాకు బాధగా అనిపించింది. చాలా మంది కష్టపడ్డారు.

‘రంగమ్మత్త’ పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది?

అనసూయ: డబ్బుల కోసం ఆ సినిమా చేయలేదు. టీవీ నుంచే నాకు బోలెడంత వస్తుంది. లేకపోతే మా ఆయన ఇస్తాడు. టీవీలో నా ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. టెలివిజన్‌ నా ఇల్లు. నేను సినిమాల్లో ఎందుకు నటిస్తున్నానంటే.. నన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్లు.. ఎక్స్‌పోజింగ్‌తో నెట్టుకొస్తున్నానని కామెంట్‌ చేసేవాళ్ల నోళ్లు మూయించడానికే సినిమాలు చేస్తున్నా. సినిమాల్లో వేరే అనసూయను చూడాలి. ‘రంగమ్మత్త’ కోసం నాకంటే ముందు 20మందిని ఆడిషన్‌ చేశారట. ఆ అవకాశం నాకు వచ్చింది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో రంగమ్మత్త ది బెస్ట్‌.

ఎవరైనా ఒకరికి థ్యాంక్స్‌.. మరొకరికి వార్నింగ్‌ ఇవ్వాలంటే ఎవరెవరికి ఇస్తావు?

అనసూయ: నాకు అవకాశం ఇచ్చిన ప్రతి దర్శకుడికి, నిర్మాతకు థ్యాంక్స్‌.. వాళ్ల వల్లే చాలామంది తెలుగు అమ్మాయిలు ఇంకా కలలు కనగలుగుతున్నారు. ముఖ్యంగా అడవి శేష్‌కు కృతజ్ఞతలు. ఇక ఎవరైనా యూట్యూబ్‌లో కింద కామెంట్‌ చేస్తే ఎవరినీ వదలను. ఈ జన్మలోనే మీ కర్మ మీరు అనుభవిస్తారు. ప్రేమను పంచండి.

మంచి రెమ్యునరేషన్‌.. ముఖ్యమైన పాత్ర దేనికి మీ ఓటు?

అనసూయ: ముఖ్యమైన పాత్రకే నా ఓటు..

టీవీ/సినిమా దేనికి ప్రాధాన్యం?

అనసూయ: ఏనీ టైమ్‌ టీవీ

మీరు సంగీతం నేర్చుకున్నారా?

అనసూయ: ఆరు నెలలు కర్ణాటక సంగీతం, రెండు సంవత్సరాలు హిందుస్థానీ నేర్చుకున్నా. నేను గాయని కావాలని అమ్మ కోరిక.

వచ్చే జన్మలో ఏ జంతువులా పుట్టాలనుకుంటున్నారు?

అనసూయ: ఏనుగు. అదే నా స్ఫూర్తి జంతువు. ఈ ప్రపంచంలో తల్లి ఏనుగు పిల్లలపై చూపే ప్రేమ అపారం. అదే సమయంలో తన పార్టనర్‌ చనిపోతే తినకుండా ఆ ఏనుగు కూడా తనువు చాలిస్తుందట.

మీ ఆయన పేరు మీ ఫోన్‌లో ఏమని ఉంటుంది?

అనసూయ: నిక్కు.

మీ ఆయన ఫోన్‌ ఆయనకు తెలియకుండా ఎప్పుడైనా చెక్‌ చేశారా?

అనసూయ: రోజూ రాత్రి పూట చెక్‌ చేస్తా. నా జన్మతః వచ్చిన అధికారం అది. ఏదో సరదాగా మా పిల్లలు ఫొటోలు తీశారేమో చూస్తుంటా.

మీ ఫోన్‌ ఎప్పుడైనా మీ ఆయన చెక్‌ చేస్తారా?

అనసూయ: చేస్తారేమో తెలియదు. అయినా, అన్ని విషయాలు ఆయనకు చెబుతా.

మీ హైట్‌కు, పర్సనాలిటీకి మీరొక పేరు పెట్టుకోవాలంటే ఏం పెట్టుకుంటారు?

అనసూయ: ఖేలన్‌. అంటే బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం ఎంతో ముఖ్యమని అర్థం. నా చేతిపై టాటూ అదే.

నాన్న: పాపాజీ

అమ్మ: నా అస్తిత్వం

భర్త: సర్వస్వం

అత్త: స్వేచ్ఛ

టీవీ: పేరునిచ్చిన తల్లి

సినిమా: నాన్న

జబర్దస్త్‌: మరో కుటుంబం

రోజా: ఫైర్‌ బ్రాండ్‌, డైనమిక్‌

రామ్‌చరణ్‌: నా సిట్టిబాబు

ఎన్టీఆర్‌: తారక్‌లా తెలుగు మాట్లాడాలని ఉంటుంది.

సుకుమార్‌: నా సేవియర్‌

సుమ: అమ్మ తర్వాత ఎవరైనా ఉంటే సుమక్కే.

ఆలీ: మీరొక గార్డియన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని