‘దారుణాలు చేసినా నిర్మాతలు మద్దతిచ్చారు’

ఐటీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నానని బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా అన్నారు. 2018లో ‘మీటూ’ ఉద్యమాన్ని భారత్‌లో మొదలు పెట్టిన నటి ఆమె. పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో ప్రముఖ నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడని ఆమె చెప్పడం సంచలనం సృష్టించింది. దీని తర్వాత చాలా మంది...

Published : 15 Nov 2020 12:33 IST

ఐటీ జాబ్‌ చేయబోతున్నా.. నానా పటేకర్‌తో పోరాడే టైమ్‌ లేదు

నటి తనుశ్రీ దత్తా

ముంబయి: ఐటీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నానని బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా అన్నారు. 2018లో ‘మీటూ’ ఉద్యమాన్ని భారత్‌లో మొదలు పెట్టిన నటి ఆమె. పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో ప్రముఖ నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడని ఆమె చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీని తర్వాత చాలా మంది నటీనటులు చిత్ర పరిశ్రమలో తమకు వేధింపులు ఎదురయ్యాయని ప్రముఖుల పేర్లు బయటపెట్టారు.

అప్పట్లో తనుశ్రీ ఆరోపణల నేపథ్యంలో నానా పటేకర్‌ ‘హౌస్‌ఫుల్‌ 4’తోపాటు మరికొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నారు. ముంబయి పోలీసులు 2019 జూన్‌లో పటేకర్‌పై కేసు నమోదు చేశారు. అయితే తనుశ్రీ చేసిన వేధింపుల ఆరోపణల్ని పటేకర్‌ ఖండించారు. తనకు హాని కలిగించాలని, ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె ప్రయత్నిస్తోందని చెప్పారు. ఆ తర్వాత సంవత్సరానికి పటేకర్‌ మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించారు. తను ఎంతగా పోరాడినా న్యాయం జరగలేదని తనుశ్రీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక పటేకర్‌కు వ్యతిరేకంగా పోరాడే సమయం తనకు లేదని తనుశ్రీ తాజా ఇంటర్వ్యూలో అన్నారు. ఆయన తిరిగి బాలీవుడ్‌లో రాణించడం గురించి మాట్లాడుతూ.. ‘పటేకర్‌ నన్ను వేధించి, అవమానించి, బాధించి, బెదిరించడంతోపాటు మా కుటుంబ సభ్యులపై రౌడీలతో దాడి చేయించాడు. నా సినీ కెరీర్‌ను నాశనం చేశాడు. ఇన్ని దారుణాలకు పాల్పడిన ఆయనకు బాలీవుడ్‌ నిర్మాతలు మద్దతుగా నిలిచారు. కమ్‌బ్యాక్‌కు ఘనంగా వెల్‌కమ్‌ చెప్పారు. నా తప్పు లేకపోయినా నన్ను బాలీవుడ్‌కు దూరం చేశారు. ఇప్పుడు ప్రజలు ‘సుశాంత్‌కు న్యాయం జరగాలి?’ అని అడుగుతున్నారు. మరి నాకు న్యాయం జరిగిందా?’.

‘ఈ వ్యవస్థతో పోరాడి నేను విసిగిపోయాను. ఇది చెడ్డ వ్యక్తులను రక్షించడమే కాకుండా.. వారికి మద్దతునిస్తూ, తిరిగి అవకాశాలు ఇస్తోంది. నేను మాత్రం జీవితంలో విరామం లేకుండా పోరాడుతూనే ఉన్నా. ఇప్పుడు నాకు పోరాడే సమయం లేదు. కరోనా వైరస్‌ వల్ల అమెరికాలో షోలు, ఈవెంట్స్‌ జరగడం లేదు. అందుకే ఐటీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నా. ఉదయం 9కి మొదలై.. సాయంత్రం 5కు పూర్తయ్యే ఐటీ ఉద్యోగం చేయబోతున్నా’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని