Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇలా.. విక్రమ్‌ అలా!

పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ..

Updated : 23 Mar 2024 10:48 IST

కొన్ని కథలు, అందులోని పాత్రలకు నటీనటులు బాగా కనెక్ట్‌ అవుతారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఆయా క్యారెక్టర్లలో ఒదిగి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు శారీరకంగా, మానసికంగా తమని తాము మలుచుకుంటారు. బరువు పెరిగేందుకు, తగ్గేందుకూ వెనుకాడరు. ఇటీవల ఆ సవాళ్లు స్వీకరించిన నటులెవరు? ఆ కొత్త సినిమాలేంటి?

72 గంటల పాటు మంచినీళ్లే

విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కించిన చిత్రం ‘ఆడుజీవితం’ (Aadujeevitham). బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వలసవెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవితాధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో బానిస జీవితాన్ని అనుభవించే వలస కూలీగా ఒదిగిపోయేందుకు పృథ్వీరాజ్‌ ఎక్కువగా ఉపవాసం ఉండేవారు. కొన్నిసార్లు 72 గంటల పాటు మంచినీళ్లు, కొద్దిగా బ్లాక్‌ కాఫీ మాత్రమే తాగేవారు. శారీరకంగా మార్పు రావాలంటే కేవలం ఆహారం మానేస్తే సరిపోదని, అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలనే ఛాలెంజ్‌ని స్వీకరించి, 31 కేజీల బరువు తగ్గారు. ఈ స్క్రిప్టు, క్యారెక్టర్‌ బాగా నచ్చడంతో పృథ్వీరాజ్‌ ఫోకస్‌ అంతా కొన్నాళ్లపాటు ఈ సినిమాపైనే పెట్టారు. ఈ క్రమంలో ‘సైరా’లోని కీలక పాత్రలో నటించాలని, ‘లూసిఫర్‌’ను తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించాలని ప్రముఖ నటుడు చిరంజీవి ఆఫర్‌ ఇవ్వగా ఆయన తిరస్కరించారు. ‘ఆడుజీవితం’ 2018లో చిత్రీకరణ ప్రారంభమైనా కొవిడ్‌ ఇతరత్రా కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అమలాపాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మార్చి 28న (తెలుగులోనూ) ప్రేక్షకుల ముందుకురానుంది. ‘ది గోట్ లైఫ్‌’ (The Goat Life) పేరుతో ఇంగ్లిష్‌లో విడుదల కానుంది. డైరెక్టర్‌ ఈ స్టోరీతో 16 ఏళ్లు ప్రయాణం చేయడం గమనార్హం.


విక్రమ్ మరో ప్రయోగం..

ప్రయోగాత్మక పాత్రకు పెట్టింది పేరు విక్రమ్‌ (Vikram). విభిన్న పార్శ్వాలున్న పాత్రల్లో అలవోకగా నటించే ఆయన ‘ఐ’ (మనోహరుడు) కోసం శారీరకంగా బాగా కష్టపడ్డారు. అందులో బాడీ బిల్డర్‌గా సెట్‌ అయ్యేందుకు బరువు పెరిగి, అరుదైన వ్యాధితో బాధపడే వ్యక్తిగా కనిపించేందుకు బరువు తగ్గి ఔరా అనిపించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు ‘తంగలాన్‌’ (Thangalaan) కోసం అలాంటి సాహసం చేశారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా.రంజిత్‌ రూపొందించిన ఈ సినిమాలో విక్రమ్‌ ఓ తెగ నాయకుడిగా నటించారు. ఆ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడి కార్మికులు ఎలా జీవిస్తారో స్వయంగా తెలుసుకుని, పరిస్థితులను ఆకళింపు చేసుకునేవారు. పాత్ర డిమాండ్‌ మేరకు కొన్ని కిలోల బరువు తగ్గారు. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ పాన్‌ ఇండియా చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశాలున్నాయి.


రోజుకు 17 గంటల శ్రమించి..

నటిగా పదేళ్లపైగా అనుభవం ఉన్న కృతి సనన్‌ (Kriti Sanon) ఇటీవల నిర్మాతగా మారారు. ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్‌’ పతాకంపై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘దో పత్తీ’ (Do Patti). ప్రముఖ నటి కాజోల్‌ (Kajol), కృతి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రొడ్యూసర్‌గా తనకు ఫస్ట్‌ మూవీ కాబట్టి స్ర్కిప్టు మొదలుకుని నటన, సంగీతం.. ఇలా అన్ని విభాగాల్లో భాగమైనట్లు కృతి ఓ సందర్భంలో తెలిపారు. ఎక్కడా రాజీపడకుండా అనుకున్న విధంగా సినిమాని పూర్తి చేయాలని నిర్ణయించుకుని, ఆ మేరకు రోజుకు 17 గంటలు పని చేశానని చెప్పారు. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ మూవీ నేరుగా ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో త్వరలో విడుదల కానుంది. మరోవైపు, కృతి, టబు, కరీనా కపూర్‌ కలిసి నటించిన ‘క్రూ’ (Crew) సినిమా 29న బాక్సాఫీసు ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని