Akash Vaani Review: రివ్యూ: ఆకాశ్‌ వాణి.. కెవిన్‌, రెబా మోనికా జాన్‌ నటించిన సిరీస్‌ ఎలా ఉందంటే..?

కవిన్‌, రెబా జాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘ఆకాశ్‌ వాణి’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 27 Jan 2024 11:04 IST

వెబ్‌సిరీస్‌: ఆకాశ్‌ వాణి; తారాగణం: కెవిన్‌, రెబా మోనికా జాన్‌, శరత్‌ రవి, దీపక్‌ పరమేశ్‌, దీపరాజా, అభిత వెంకటరామన్‌ తదితరులు; సంగీతం: గుణ బాలసుబ్రమణియన్‌; ఛాయాగ్రహణం: సి. శాంతకుమార్‌; కూర్పు: ఆర్‌. కలైవనన్‌; దర్శకత్వం: ఎనాక్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఆహా.

కొన్ని వెబ్‌సిరీస్‌లు ఒకేసారి అన్ని భాషల్లో విడుదలవుతుంటే.. మరికొన్ని ముందు మాతృకలో రిలీజ్‌ అయి, తర్వాత ఇతర భాషల్లోకి డబ్‌ అవుతున్నాయి. ఈ రెండో జాబితాకు చెందిన తమిళ సిరీస్‌ ‘ఆకాశ్‌ వాణి’ (akash vaani) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కెవిన్‌ (Kavin), రెబా మోనికా జాన్‌ (Reba Monica John) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎనాక్‌ రూపొందించిన ఈ సిరీస్‌ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, దీని కథేంటి? ఎలా ఉందంటే? (akash vaani web series review in telugu)

ఇదీ కథ: ఒకే కాలేజీలో చదువుకునే ఆకాశ్‌ (కెవిన్‌), వాణి (రెబా మోనికా జాన్‌) ప్రేమలో పడతారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. చివరకు.. భర్తతో కలిసి జీవించలేనంటూ వాణి విడాకుల నోటీసులు పంపిస్తుంది. వాటిని చూసిన ఆకాశ్‌ షాక్‌ అవుతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అసలు ఏ కారణంతో వాణి.. ఆకాశ్‌కు దూరం కావాలనుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం సిరీస్‌ చూసి తెలుసుకోవాల్సిందే (akash vaani web series review).

ఎలా ఉందంటే: కాలేజీ చుట్టూ తిరిగే రొమాంటిక్‌ కామెడీ సిరీస్‌ ఇది. చదువు మినహా హీరో అన్నింటిలో చురుగ్గా ఉండడం, హీరోయిన్‌ను చూడగానే ప్రేమలో పడడం, ఆమె తొలుత ‘నో’ చెప్పడం.. తర్వాత ‘ఎస్’ అనడం, పెళ్లి చేసుకోవడం.. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలెన్నో. ఈ సిరీస్‌ సగ భాగం అదే టెంప్లేట్‌లో సాగుతుంది. కథ పాతదే అయినా చూపించే విధానం కొత్తగా ఉంటే ప్రేక్షకులను మెప్పించొచ్చు. ఇందులో ఆ మ్యాజిక్‌ జరగలేదు. అంతా రొటీన్‌ అనిపిస్తుంది. ఓ రచయిత్రి ద్వారా ఆకాశ్‌, వాణి ప్రేమకథను పరిచయం చేసిన తీరు మెప్పిస్తుంది. దాంతో, ఆ లవ్‌స్టోరీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంటుంది. దాన్ని కొనసాగించడంలో మాత్రం దర్శకుడు వెనుకబడ్డారు.

మొత్తం కథ ఏడు ఎపిసోడ్లలో సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్‌ 30 నిమిషాల్లోపే ఉండడం కాస్త రిలీఫ్. అయినా.. అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. హీరో, హీరోయిన్లతోపాటు వారి స్నేహితులు కాలేజీలో చేసే అల్లరి వినోదం పంచుతుంది. ముఖ్యంగా ఆత్మీయ సమ్మేళనం ఎపిసోడ్‌. ఫ్లాష్‌ బ్యాక్‌, ప్రస్తుతానికి సంబంధించిన సన్నివేశాలు మధ్య పెద్దగా తేడా కనిపించకపోవడంతో ఎప్పుడేం జరుగుతుందో స్పష్టత ఉండదు. ‘ప్రేమలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. పెళ్లి అయ్యాక  అసలు కథ మొదలవుతుంది’ అనే అంశాన్ని దర్శకుడు తనదైన శైలిలో చెప్పారు. కానీ, హీరోయిన్‌ విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని సిల్లీగా చూపించారు. ఆయా పాత్రల మధ్య ఎమోషన్స్‌ హైలైట్‌ చేయలేకపోయారు. క్లైమాక్స్‌ను సంతృప్తికరంగా మలిచారు.

ఎవరెలా చేశారంటే: ‘లిఫ్ట్‌’, ‘దాదా’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవిన్‌ నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఇది. ఆకాశ్‌ పాత్రలో ఆకట్టుకుంటారు. ‘సామజవరగమన’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన రెబా మోనికా జాన్‌ ఇందులోని వాణి పాత్రతో మెప్పిస్తారు. వీరి స్నేహితులుగా నటించిన శరత్‌ రవి, దీపక్‌ పరమేశ్‌, దీపరాజా తదితరులు నవ్వులు పంచుతారు. సాంకేతిక బృందం విషయానికొస్తే.. గుణ బాలసుబ్రమణియన్‌ అందించిన నేపథ్య సంగీతం అలరిస్తుంది. కథాగమనంలో వచ్చే పాటలు ఏమాత్రం ప్రభావం చూపించవు. శాంతకుమార్‌ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. కలైవనన్‌ కొన్ని ఎపిసోడ్లను ఇంకా ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది.  నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నాయి (akash vaani web series review).

కుటుంబంతో కలిసి చూడొచ్చా?: నిరభ్యంతరంగా చూడొచ్చు. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, అశ్లీల సన్నివేశాలు ఈ సిరీస్‌లో లేవు. అందరికీ తమ కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది.

  • బలాలు
  • + కామెడీ
  • + కెవిన్‌, రెబా నటన
  • బలహీనతలు
  • - కొత్తదనం లేని కథ
  • సాగదీత
  • చివరిగా: ఈ ‘ఆకాశ్‌ వాణి’ కొత్తగా ఏం చెప్పలేదు! (akash vaani web series review)
  • గమనిక: ఇది సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని