RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల రోజున డివైడ్‌ టాక్‌ వచ్చింది: రామ్‌చరణ్‌

ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన సదస్సుల్లో నటులు అక్షయ్‌కుమార్‌, రామ్‌చరణ్‌లు వ్యక్తిగత అనుభవాలతో పాటు, సినిమా విశేషాలను పంచుకున్నారు.

Published : 13 Nov 2022 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం హిందీతో పాటు, అన్ని చిత్ర పరిశ్రమలు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీయాలని, అలాంటి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులను థియేటర్‌కు రాకుండా ఎవరూ ఆపలేరని నటులు అక్షయ్‌ కుమార్‌, రామ్‌చరణ్ అన్నారు. ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న వారిద్దరూ వ్యక్తిగత విషయాలతో పాటు, ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపైనా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

హిందీ సినిమా మారాలి: అక్షయ్‌కుమార్‌

‘‘నేను దిల్లీని నా ఇల్లులా భావిస్తా. నా జర్నీ ఇక్కడే మొదలైంది. నేను సాధించాలనుకున్నది ఇక్కడే సాధించా. నేను యువకుడిగా ఉన్నప్పుడు బ్రూస్‌లీలా అవ్వాలనుకునేవాడిని. అందుకే రోజుకు ఐదారు గంటలు మార్షల్‌ ఆర్ట్స్‌ సాధన చేసేవాడిని. హిందీలో ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పించగల సినిమాలను తీయలేకపోతున్నాం. ఇది మా తప్పు. ప్రేక్షకులకు ఏం కావాలో తెలుసుకోలేపోతున్నాం. తీసే ప్రతి సినిమా ఆలోచించి తీయాలి. ఇంకా కొత్త విషయాలను నేర్చుకోవాలి. ప్రేక్షకులకు ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలి. వాళ్లు మాట్లాడుకునేలా చేయాలి. కరోనాతో వాళ్లకు ఉన్న ప్రాధ్యమాలు మారిపోయాయి. ఓటీటీ వచ్చేసింది. ఇండస్ట్రీ అంతా చర్చించుకుని వాళ్లకు ఏం కావాలో ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం సినిమాలపై ప్రేక్షకులు భారీగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. పరిమిత స్థాయిలో ఉన్న ఆదాయాన్ని చాలా తక్కువగా సినిమాపై ఖర్చు పెడుతున్నారు’’

‘‘అదే సమయంలో థియేటర్‌ వాళ్లకు సమస్యలు ఉన్నాయి. ప్రతి రంగంలోనూ 30 నుంచి 40శాతం డౌన్‌ఫాల్‌ ఉంది. ప్రేక్షకులు భారీ, ఎపిక్‌ చిత్రాలను కోరుకుంటున్నారు. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు థియేటర్‌లకు వస్తున్నారు. ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ కథా’లాంటి చిత్రాలను ఓటీటీలో వస్తే చూద్దాంలే అనుకుంటున్నారు. ఏదో ఒకరోజున మళ్లీ థియేటర్‌లోనే అందరూ సినిమా చూసే రోజు వస్తుంది. మా అబ్బాయిని ఇండస్ట్రీకి తీసుకొద్దామనుకున్నా. కానీ, వాడికి సినిమాలపై ఆసక్తి లేదు. ప్రతి ఒక్కరికీ జీవితంలో ప్రత్యేక విజన్‌ ఉండాలి. నాకు కెనడియన్‌ పౌరసత్వం ఉందంటే దానర్థం నేను భారతీయుడిని కాదని కాదు. నేను భారతీయుడినే’’ అని అక్షయ్‌ కుమార్‌ అన్నారు. 


నాన్నకు చెప్పటానికి చాలా భయపడ్డా: రామ్‌చరణ్‌

‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ కోసం చాలా కష్టపడినట్లు రామ్‌చరణ్‌ అన్నారు. విడుదలైన రోజు 20శాతం డివైడ్‌ టాక్ వచ్చిందని చెప్పారు. ‘‘నేను మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేద్దామనుకున్నా. కానీ, కుటుంబంలో అందరూ హీరోలే. నాకు ఇప్పటికీ గుర్తే.. నాన్నకు ఏదైనా అవార్డు వచ్చినా, మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌పై ఫొటో వచ్చినా వాటిని ఇంటికి తెచ్చేవారు కాదు. ఆఫీస్‌లోనే ఉంచేవారు. ఇంట్లోనూ ఎలాంటి సినిమా మ్యాగజైన్స్‌ చదవటాన్ని కూడా ప్రోత్సహించేవారు కాదు. నేను నటుడిని అవుదామనుకున్నప్పుడు, చెప్పటానికి చాలా భయపడ్డా. సినిమాకు దూరంగా మమ్మల్ని పెంచాలని చూశారు. కానీ, సినిమాయే మా నుంచి దూరంగా వెళ్లలేదు’’

‘‘ఆర్ఆర్‌ఆర్’కు ఇంత స్పందన వస్తుందని మేము ఊహించలేదు.  సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశాం. కొన్ని సార్లు మూడు వేలమందితో షూట్‌ చేసిన రోజులు కూడా ఉన్నాయి. రిలీజ్‌ రోజున 20శాతం డివైడ్‌ టాక్‌ వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితి మారింది. పాన్‌ ఇండియా ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పుడు అంతర్జాతీయంగానూ అలరిస్తోంది. సంప్రదాయ మార్కెట్‌ కలిగిన జపాన్‌లోనూ మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ విషయానికొస్తే, ఈ బిగ్‌ గేమ్‌లో అందరి పాత్రా ఉంది. మంచి సబ్జెక్ట్‌, కథ, ఉంటే ప్రేక్షకులను రాకుండా థియేటర్‌కు రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. కరోనా తర్వాత ‘సూర్యవంశీ’ ‘పుష్ప’, ‘కేజీయఫ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి సినిమాలు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాయి. అదే సమయంలో సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ధరలు ఉండాలి. శంకర్‌ సర్‌ డైరెక్షన్‌లో చేయటం నా అదృష్టం. ఆ సినిమా ఫస్ట్‌ లుక్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని రామ్‌చరణ్‌ అన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని