Avatar 2 Review: రివ్యూ: అవతార్ ‌- ది వే ఆఫ్‌ వాటర్‌

Avatar 2 Review: జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అవతార్ 2’ (Avatar: The Way of Water)  సినిమా ఎలా ఉందంటే?

Updated : 16 Dec 2022 13:12 IST

Avatar 2 Review; చిత్రం: అవతార్‌ - ది వే ఆఫ్‌ వాటర్‌; తారాగణం: సామ్‌ వర్తింగ్టన్‌, జో సల్దానా, స్టీఫెన్‌లాంగ్‌, సిగర్నీ వీవర్‌, కేట్‌ విన్‌స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్ తదితరులు; సినిమాటోగ్రఫీ: రస్సెల్‌ కర్పెంటర్‌; ఎడిటింగ్‌: స్టీఫెన్‌ ఈ. రివ్కిన్‌, డేవిడ్‌ బ్రెన్నర్‌, జాన్‌ రెఫౌవా; సంగీతం: సైమన్ ఫ్రాంగ్లెన్‌; నిర్మాణ సంస్థ: లైట్‌స్ట్రోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్‌; నిర్మాతలు: జేమ్స్‌ కామెరూన్‌, జోన్ లాండౌ; కథ, కథనం, దర్శకత్వం: జేమ్స్‌ కామెరూన్‌; విడుదల తేదీ: 16-12-2022

యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అవతార్‌2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ విజువల్‌ వండర్‌గా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. దీనికి సీక్వెల్‌ ప్రకటించగానే ఈసారి కామెరూన్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారా? అని అందరూ ఎదురు చూశారు. తొలి భాగంలో ‘పండోరా’ అందాలను అద్బుతంగా ఆవిష్కరించిన కామెరూన్‌.. ఇప్పుడు నీటి అడుగున అందాలు, భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేందుకు సన్నద్ధమయ్యారు. (Avatar 2 Review) మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అవతార్2’ ఎలా ఉంది? కామెరూన్‌ ఎలా తెరకెక్కించారు? విజువల్స్‌ పరంగా సినిమా ఎలా ఉంది?

క‌థేంటంటే?

తొలి చిత్రంలో భూమి నుంచి పండోరా గ్ర‌హానికి వెళ్లిన జేక్ (సామ్ వ‌ర్తింగ్టన్‌) అక్క‌డే ఓ తెగ‌కి చెందిన నేతిరి (జో స‌ల్దానా)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నేతిరి తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న జేక్ ఆ తెగ‌కి నాయ‌కుడ‌వుతాడు. ప‌దేళ్ల కాలంలో లోక్, నేటియం, టూక్ అనే ముగ్గురు పిల్ల‌ల్ని క‌న్న జేక్‌, నేతిరి దంపతులు...  ద‌త్త పుత్రిక కిరీ, స్పైడ‌ర్ అనే మ‌రో బాలుడితో  క‌లిసి హాయిగా జీవిస్తుంటారు. ఇంత‌లో భూ ప్ర‌పంచం అంత‌రించిపోతుంద‌ని, ఎలాగైనా పండోరాని ఆక్ర‌మించి అక్క‌డున్న నావీ తెగ‌ని అంతం చేయాల‌ని మ‌నుషులు మ‌రోసారి సాయుధ‌బ‌ల‌గాల‌తో దండెత్తుతారు. జేక్ త‌న కుటుంబాన్ని ర‌క్షించుకోవ‌డం కోసం ఈసారి మెట్క‌యినా ప్రాంతానికి వెళ‌తాడు.

అక్క‌డి ప్ర‌జ‌ల‌కి స‌ముద్ర‌మే ప్ర‌పంచం. మ‌న‌లో స‌ముద్రం, మ‌న చుట్టూ స‌ముద్రం, ఇచ్చేది స‌ముద్ర‌మే.. తీసుకునేది స‌ముద్ర‌మే అని న‌మ్ముతూ నీటిలోనే బ‌తుకుతుంటారు. మెట్కయినా రాజు టోనోవ‌రి స‌హ‌కారంతో జేక్ కుటుంబం సైతం స‌ముద్రంతో అనుబంధం పెంచుకుంటుంది. కష్టమైనా అక్క‌డ జీవించ‌డం నేర్చుకుంటుంది. ఎలాగైనా జేక్‌ని అతడి కుటుంబాన్ని మ‌ట్టు బెట్టాల‌ని భూమి నుంచి వ‌చ్చిన ప్ర‌ధాన శ‌త్రువు మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్‌), అత‌డి బృందంతో పోరాటం ఎలా సాగించారనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే?

తొలి భాగం పండోరా గ్ర‌హంలోని సుంద‌ర‌మైన అట‌వీ, జీవ‌రాశుల ప్ర‌పంచం చుట్టూనే సాగుతుంది.  ఈసారి క‌థ‌ని ‘ది వే ఆఫ్ వాట‌ర్’ అంటూ నీటి ప్ర‌పంచంలోకి తీసుకెళ్లాడు జేమ్స్ కామెరూన్‌. మ‌నం పుట్ట‌క‌ముందు, మ‌నం పోయాక స‌ముద్ర‌మే మ‌న నివాసం అంటూ తాత్విక‌త‌ని జోడిస్తూ ద‌ర్శ‌కుడు కామెరూన్ మ‌రో దృశ్య‌కావ్యాన్ని తెర‌పై ఆవిష్క‌రించారు.  జేక్ అత‌డి కుటుంబం మెట్క‌యినా ప్రాంతానికి వెళ్లేంత‌వ‌ర‌కు తొలి సినిమానే గుర్తుకొచ్చినా.. అక్క‌డికి చేరుకున్నాక మాత్రం పూర్తిగా  ప్రేక్ష‌కుల్ని ఆ ప్ర‌పంచంలో లీనం చేస్తుంది. త‌న ఊహాశ‌క్తికి హ‌ద్దేలేద‌ని చాటి చెబుతూ, స‌ముద్ర గర్భంలో మ‌రో అంద‌మైన ప్ర‌పంచం ఉందంటూ న‌మ్మించాడు జేమ్స్ కామెరూన్‌.

అక్క‌డి జీవితాలు, జ‌ల‌చ‌రాలు, వాటితో అనుబందాన్ని ఆవిష్క‌రించే స‌న్నివేశాలు మ‌న‌సుల్ని హ‌త్తుకుంటాయి.  తొలి భాగం సినిమాలో క‌థ ఎంత‌గా ఆస‌క్తిని రేకెత్తిస్తుందో.. ఇందులోని సుంద‌ర‌మైన స‌న్నివేశాలు అంత‌కుమించి ఆకట్టుకుంటాయి. ఈసారి క‌థ కంటే కూడా విజువ‌ల్స్‌పైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టారు ద‌ర్శ‌కుడు. తెలివిగా క‌థ‌ని ఈసారి స‌ముద్ర నేప‌థ్యంలో న‌డ‌పి మ‌రో కొత్త ప్ర‌పంచాన్ని క‌ళ్ల‌కు క‌ట్టాడు.  అలాగ‌ని క‌థ కోసం ద‌ర్శ‌కుడు త‌క్కువ క‌స‌ర‌త్తులేమీ చేయ‌లేదు. కుటుంబాన్ని సంర‌క్షించ‌డంలో తండ్రి పాత్ర క‌ర్త‌వ్యాన్ని, భావోద్వేగాల్ని అందంగా ఆవిష్క‌రించారు. క‌థ‌లో అక్క‌డ‌క్క‌డా  భార‌తీయత, మ‌న న‌మ్మ‌కాలు, విలువ‌లు ఉట్టిప‌డుతుంటాయి.

భార‌తీయ సినిమాలు కొన్ని గుర్తుకొస్తుంటాయి. కొన్ని పోరాట ఘ‌ట్టాలు సాధార‌ణ హాలీవుడ్ సినిమాల త‌ర‌హాలో సాగడం, సినిమా సాగ‌దీత‌గా అనిపించినా  నీటి ప్ర‌పంచం ఆవిష్క‌ర‌ణ‌లో ఏ స‌న్నివేశానికి ఆ స‌న్నివేశం ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేస్తుంటుంది. జేక్స్ త‌న‌యుడు తిమింగ‌లంతో పోరాటం చేసే స‌న్నివేశం, పాయ‌కాన్ అనే స‌ముద్ర‌జీవితో స్నేహం, అది జేక్స్‌కి సాయం చేయ‌డం వంటివి సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. స్పైడ‌ర్, అత‌డి తండ్రి నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా మ‌న‌సుల్ని క‌దిలిస్తాయి. నౌక నేప‌థ్యంలో సాగే ప‌తాక స‌న్నివేశాలు కొన్నిసార్లు ‘టైటానిక్‌’ని గుర్తు చేస్తాయి. టైటానిక్ భామ కేట్ విన్‌స్లెట్ ఈ సినిమాలో టోనోవ‌రీ భార్య‌గా క‌నిపించ‌డం విశేషం.

ఎవ‌రెలా చేశారంటే?

మోష‌న్ కాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందిన సినిమా ఇది. సామ్ వ‌ర్తింగ్టన్‌ క‌థానాయ‌కుడిగా క‌నిపిస్తాడు. తండ్రిగా, నాయ‌కుడిగా అత‌డు చ‌క్క‌టి భావోద్వేగాల్ని ప‌లికించాడు. పోరాట స‌న్నివేశాల్లోనూ అలరించాడు. స్టీఫెన్ లాంగ్ భూమి నుంచి వ‌చ్చిన శ‌త్రువుగా, పండోరా గ్ర‌హం రాక్ష‌స‌సైన్యంగా భావించే సమూహానికి అధిప‌తిగా క‌నిపిస్తాడు. జో స‌ల్దానా, సిగోర్నీ వీవ‌ర్‌, జోయ‌ల్, క్లిఫ్‌తోపాటు, కేట్ విన్‌స్లెట్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. 

సాంకేతిక విభాగాల్లో ప్ర‌తి విభాగం అద్భుత‌మైన ప‌నితీరు క‌న‌బ‌రిచింది. సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణంతోపాటు, విజువ‌ల్ ఎఫెక్ట్స్  విభాగాలు సినిమాపై ప్ర‌త్యేక‌మైన ప్ర‌భావం చూపించాయి. ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ త‌న బృందంతో క‌లిసి తీర్చిదిద్దిన స్క్రీన్‌ప్లే, మ‌లిచిన పాత్ర‌లు ఒకెత్తయితే.. ఆయ‌న త‌న‌దైన ఊహాశ‌క్తితో తెర‌పై సృష్టించిన పండోరా గ్ర‌హం మ‌రో అద్భుతం. నీటి ప్ర‌పంచాన్ని ఇంత అందంగా మ‌రెవ్వ‌రూ ఆవిష్క‌రించలేరేమో అనేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు.  నిర్మాణం మ‌రో స్థాయిలో ఉంది.

బ‌లాలు

👍 అబ్బుర‌ప‌రిచే స‌న్నివేశాలు 👍 క‌థ‌లో భావోద్వేగాలు 👍సాంకేతిక మాయాజాలం 👍స‌ముద్ర నేప‌థ్యం

బ‌ల‌హీన‌త‌లు

👎నిడివి 👎క‌థ‌లో మ‌లుపులు లేక‌పోవ‌డం

చివ‌రిగా: ‘అవ‌తార్2’... నీటి ప్ర‌పంచంలో మాయాజాలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని