Beast: మాసీ కమర్షియల్‌ ‘బీస్ట్‌’

విజయ్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బీస్ట్‌’. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయిక. దీన్ని తెలుగులో నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు.

Updated : 09 Apr 2022 09:10 IST

విజయ్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బీస్ట్‌’. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయిక. దీన్ని తెలుగులో నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘‘తమిళ ఇండస్ట్రీలో నా ప్రయాణం మొదలైంది. నాకు ‘బీస్ట్‌’లాంటి పెద్ద అవకాశమిచ్చిన సన్‌ పిక్చర్స్‌ సంస్థకు థ్యాంక్స్‌. ఇది పూర్తి మాసీ కమర్షియల్‌ చిత్రం. నెల్సన్‌ దిలీప్‌ మార్క్‌తో ఆసక్తికరంగా సాగుతుంది. ఆయన తెరకెక్కించిన ‘కొలమావు కోకిల’ చూశా. డార్క్‌ కామెడీని తెరకెక్కించడంలో ఆయనకు ప్రత్యేకమైన మార్క్‌ ఉంది. ఈ చిత్రం ద్వారా ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. అనిరుధ్‌ తన సంగీతంతో ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. విజయ్‌తో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతి’’ అంది. ‘‘విభిన్నమైన కథలు ఎంచుకుంటూ.. వాటిని కమర్షియల్‌గా తీయడమన్నది అందరి వల్ల కాదు. నెల్సన్‌ దిలీప్‌కే సాధ్యమిది. ‘బీస్ట్‌’ ట్రైలర్‌ చూశాక.. అది మరోసారి నిరూపితమైంది అనిపించింది. అరబిక్‌ ట్యూన్‌ తీసుకొని ఓ మాస్‌ పాట చేశారు అనిరుధ్‌. ఇప్పుడా పాటకు ప్రపంచం మొత్తం డ్యాన్సులు చేస్తోంది. పూజా పాన్‌ ఇండియా హీరోయిన్‌. ప్రేక్షకులకు ఏం ఇవ్వాలా అని ఆలోచిస్తూ.. ప్రతి సినిమాకీ ఏదోకటి కొత్తగా చేయాలని తపన పడుతుంటారు విజయ్‌. ఇప్పుడాయన ‘బీస్ట్‌’ అనే ఓ విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. దర్శకుడు నెల్సన్‌ మాట్లాడుతూ.. ‘‘నా గత చిత్రం ‘డాక్టర్‌’కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడీ సినిమాకీ అలాంటి ఆదరణే దక్కుతుందని ఆశిస్తున్నా’’నన్నారు. ‘‘ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే ఇది స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలా అనిపిస్తోంది. ‘అరబిక్‌ కుతు’ పాటతో ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని పాన్‌ యూనివర్స్‌ సినిమాగా మార్చేశార’’న్నారు సంగీత దర్శకుడు అనిరుధ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని