Crew Movie Review: రివ్యూ: క్రూ.. టబు, కరీనా, కృతి సనన్‌ నటించిన హెయిస్ట్‌ మూవీ ఎలా ఉంది?

Crew Movie Review: బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందిన ‘క్రూ’ మూవీ మెప్పించిందా?

Published : 27 May 2024 13:25 IST

Crew Movie Review; చిత్రం: క్రూ; నటీనటులు: టబు, కరీనాకపూర్‌ ఖాన్‌, కృతి సనన్‌, దిల్జిత్‌ దొసాంజే, కపిల్‌ శర్మ, రాజేశ్‌ శర్మ, స్వాస్థ ఛటర్జీ, ఇవాన్‌ రోడ్రిగస్‌ తదితరులు; రచన: నిధి మెహ్రా, మెహుల్‌ సూరి; దర్శకత్వం: రాజేశ్‌ ఏ కృష్ణన్‌;  స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

కథానాయిక ప్రాధానమున్న చిత్రాలు వెండితెరకు కొత్తమీ కాదు. వాస్తవ సంఘటలకు కాస్త ఫన్‌ జోడించి రూపొందించిన బాలీవుడ్‌ చిత్రం క్రూ. ఇటీవల థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా  ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? (Crew Movie Review) స్టార్‌ నటులు చేసిన హంగామా ఏంటి?

కథేంటంటే: గీతూ సేథి (టబు), జాస్మిన్‌ కోహ్లి (కరీనా కపూర్‌ ఖాన్‌), దివ్య రాణా (కృతి సనన్‌) కోహినూర్‌ ఎయిర్‌లైన్స్‌లో సిబ్బంది. సంస్థ యజమాని విజయ్‌ వాల్యా (స్వాస్థ్‌ ఛటర్జీ) చర్యల వల్ల సదరు ఎయిర్‌లైన్స్‌ దివాళా తీసే స్థితికి వస్తుంది. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ క్రమంలో మధ్యతరగతి కుటుంబ కష్టాలతో సతమతవుతున్న గీతూ, జాస్మిన్‌, దివ్యలు ఇండియా నుంచి విదేశాలకు బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసేందుకు ఒప్పుకొంటారు. కొన్ని రోజుల పాటు అంతా సవ్యంగానే సాగుతుంది. సడెన్‌గా ఒకరోజు కోహినూర్‌ ఎయిర్‌లైన్స్‌ దివాళా తీసినట్లు ప్రకటిస్తుంది. ఈ ముగ్గురు మహిళలతో సహా ఉద్యోగులందరూ రోడ్డున పడతారు. ఇంతకీ కోహినూర్‌ ఎయిర్‌లైన్స్‌ దివాళా తీసినట్లు ప్రకటించడానికి కారణం ఏంటి? సంస్థ యజమాని విజయ్‌ వాల్యా ఎందుకు విదేశాలకు పారిపోయాడు. తమ జీవితాలను రోడ్డున పడేసిన అతడిని గీతూ, జాస్మిన్‌, దివ్యలు ఎలా పట్టుకుని భారత్‌కు  తీసుకొచ్చారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: వేల కోట్లు అప్పులు చేసి, వాటిని చెల్లించకుండా అందినకాడికి అంతా సర్దుకుని విదేశాలకు పారిపోయిన ఎందరో వ్యాపారవేత్తల గురించి నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాం. కొన్ని రోజుల పాటు విచారణ పేరుతో హడావుడి తప్ప, వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు పెద్దగా కనిపించవు. పైగా దోచుకున్న సొమ్ముతో వారు విదేశాల్లో ఎంచక్కా విలాసవంతమైన జీవితం అనుభవిస్తుంటారు. మరోవైపు వారినే నమ్ముకుని చివరకు సంస్థ దివాళా తీయడంతో రోడ్డున పడిన వాళ్లు ఎందరో. అలా కష్టాలపాలైన ముగ్గురు మహిళలు కడుపు మండి, దోచుకున్న డబ్బుతో సహా నిందితులను భారత్‌కు ఎలా తీసుకొచ్చారన్న విషయాన్ని ఆద్యంతం అలరించేలా, నవ్వులు పంచుతూ తీర్చిదిద్దడంలో దర్శకుడు రాజేశ్‌ కృష్ణన్‌ విజయం సాధించారు. గీతూ, జాస్మిన్‌, దివ్య పాత్రలు, వారి కుటుంబ నేపథ్యంతో కథను ప్రారంభించిన దర్శకుడు త్వరగానే అసలు పాయింట్‌కు వచ్చేశాడు.

భారత్ నుంచి వివిధ రూపాల్లో బంగారం స్మగ్లింగ్‌కు చేయడం, కస్టమ్స్‌కు దొరక్కుండా వారి ఎత్తులకు పైఎత్తులు ముగ్గురు మహిళలు చేసే హంగామా సందడి సందడిగా ఉంటుంది. విరామ సమయానికి విజయ్‌ వాల్యా దివాళా తీసి విదేశాలకు పారిపోవడం, బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ నుంచి తృటిలో ముగ్గురు మహిళలు తప్పించుకోవడం తదితర సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి.  విదేశాలకు పారిపోయిన వాల్యా నుంచి బంగారాన్ని తిరిగి తీసుకురావాలని గీతూ, జాస్మిన్‌, దివ్య ప్లాన్‌ వేయడంతో ద్వితీయార్ధం ఆసక్తికరంగా మొదలవుతుంది. అక్కడి నుంచి వాళ్లు వేసే ప్రతి అడుగు నవ్వులు పంచుతూనే అలరిస్తుంది. దుబాయ్‌ వెళ్లిన తర్వాత వాల్యా నివశించే హోటల్‌లో ఈ ముగ్గురు దిగడం, అక్కడ పని మనుషులుగా అవతారం ఎత్తి వారు పడే కష్టాలు తెగ నవ్విస్తాయి. పతాక సన్నివేశాల్లో ఓ ఆసక్తికర ట్విస్ట్‌తో విజయ్‌ వాల్యాను పట్టుకునే సన్నివేశాలు అలరిస్తాయి.

ఎవరెలా చేశారంటే: గీతూ, జాస్మిన్‌, దివ్య పాత్రల్లో టబు, కరీనా, కృతి సనన్‌ ఒదిగిపోయి నటించారు. మధ్యతరగతి మహిళలకు ఉండే సగటు కోరికలు, చిన్న చిన్న ఆనందాల కోసం వారు పడే తాపత్రయం ఇలా వారి నటన ఆద్యంతం అలరిస్తుంది. దిల్జిత్‌ దొసాంజే, కపిల్‌ శర్మ తమ పరిధి మేరకు నటించారు. అందరికీ తెలిసిన వాస్తవ సంఘటను ఆధారంగా తీసుకుని, నిధి మెహ్రా, మెహుల్‌ సూరి రాసిన కథను అంతే హాస్య భరితంగా పూర్తి ఎంటర్‌టైనర్‌గా రాజేశ్‌ కృష్ణన్‌ తీశారు. ప్రభుత్వాన్ని, పోలీసులను మోసగించి విదేశాలకు పారిపోయిన ఓ ఆర్థిక నేరస్థుడిని కేవలం ముగ్గురు సాధారణ మహిళలు తిరిగి ఇండియాకు తీసుకురావడం లాజిక్‌కు దూరమైనా కథకు, హాస్యం జోడించి తీర్చిదిద్దడం వల్ల ప్రేక్షకులకు అవేవీ పట్టించుకోకుండా సినిమాను ఆస్వాదించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు విజయం సాధించాడు.

కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఎక్కడా అసభ్యత లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. నిడివి కూడా తక్కువే.

  • బలాలు
  • + టబు, కరీనా, కృతి సనన్‌
  • + కామెడీ
  • + దర్శకత్వం
  • బలహీనతలు
  • - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • చివరిగా: క్రూ.. మంచి ఎంటర్‌టైనర్‌
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని