Dhamaka Review: రివ్యూ: ధమాకా

రవితేజ హీరోగా దర్శకుడు త్రినాథరావు తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

Published : 23 Dec 2022 14:58 IST

Dhamaka Review తారాగణం: రవితేజ, శ్రీలీల, రావు ర‌మేష్‌, ఆది, జ‌య‌రామ్‌, అలీ, స‌చిన్ ఖేడేక‌ర్, ప‌విత్ర‌, తుల‌సి, చిరాగ్ జైన్ త‌దిత‌రులు; కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఛాయాగ్ర‌హ‌ణం: కార్తీక్ ఘట్టమనేని; పోరాట ఘ‌ట్టాలు: రామ్-లక్ష్మణ్; ప్రొడక్షన్ డిజైన్‌: శ్రీనాగేంద్ర తంగాల; నిర్మాణం: టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, స‌హ‌ నిర్మాత‌: వివేక్ కూచిభొట్ల‌; దర్శకత్వం: త్రినాథరావు నక్కిన; బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్; విడుద‌ల‌: 23 డిసెంబ‌ర్ 2022.

క‌రోనా త‌ర్వాత ‘క్రాక్‌’ సినిమాతో థియేట‌ర్ల‌ని క‌ళ‌క‌ళ‌లాడించారు ర‌వితేజ‌. ఆయ‌న సినిమా అంటే మాస్ ప్రేక్ష‌కుల్లో ఎన్నో అంచ‌నాలు. అయితే, ‘క్రాక్‌’ త‌ర్వాత  చెప్పదగ్గ సినిమా రాలేదు. ఆయ‌న మార్క్ ఎంట‌ర్‌టైన‌ర్ కనిపించక చాలా రోజులైంది. ఈసారి రెండు పాత్ర‌ల‌తో కూడిన వినోదాత్మ‌క క‌థ‌ని ఎంచుకుని ‘ధ‌మాకా’ చేశారు. ప్ర‌చార చిత్రాలతో ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించిన ఈ చిత్రం ఎలా ఉందో  తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

క‌థేంటంటే? పీపుల్ మార్ట్ అధిప‌తి అయిన చ‌క్ర‌వ‌ర్తి (స‌చిన్ ఖేడేక‌ర్‌) త‌న‌యుడు ఆనంద్ చ‌క్ర‌వ‌ర్తి (ర‌వితేజ‌). చ‌క్ర‌వ‌ర్తి మ‌రో రెండు నెల‌ల్లో చ‌నిపోతున్నాడ‌ని తెలుసుకున్న ‘జేపీ ఆర్బిట్’ అధిప‌తి జేపీ (జ‌య‌రాం) పీపుల్ మార్ట్ కంపెనీని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నుకుంటాడు. అందుకు అడ్డుగా ఉన్న ఆనంద్‌ని అంతం చేయాల‌నుకుంటాడు. జేపీలాంటి వ్య‌క్తుల‌కి బుద్ధి చెప్ప‌డానికి స్వామి (ర‌వితేజ‌)నే స‌రైనోడని భావించిన చ‌క్ర‌వ‌ర్తి అతణ్ని రంగంలోకి దింపుతాడు. ఇంత‌కీ స్వామి ఎవ‌రు? అత‌నికీ చ‌క్ర‌వ‌ర్తికీ సంబంధం ఏమిటి? స్వామి, ఆనంద్ ఒకలా ఉండ‌టానికి కార‌ణం ఏమిటి? ఇద్ద‌రూ ఒక్క‌రే అనుకుని ఇద్ద‌రినీ ప్రేమించిన ప్ర‌ణ‌వి (శ్రీలీల‌) ఎలాంటి పాట్లు పడిందనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే? ఇది తెలుగు తెర‌పై ద‌శాబ్దాలుగా చూస్తున్న క‌థే. పాత్ర‌ల్ని డిజైన్ చేసిన విధానం కూడా అదే. కార్పొరేట్ నేప‌థ్యంతోపాటు కొన్ని వాణిజ్య అంశాలను జోడించి కొత్త హంగులు అద్దే ప్ర‌య‌త్నం ఒక్క‌టే ఇందులో కొత్తద‌నం. క‌థానాయ‌కుడిని రెండు పాత్ర‌ల్లో ప‌రిచ‌యం చేయ‌డం.. కార్పొరేట్ కుయుక్తులతో సినిమా మొద‌ల‌వుతుంది. క‌థానాయిక‌ని రౌడీగ్యాంగ్ ఏడిపించ‌డం.. అక్కడికి హీరో వ‌చ్చి గ్యాంగ్‌కు ధ‌మ్కీ ఇవ్వ‌డం, ఆ త‌ర్వాత ఫైట్‌, పాట‌.. ఇలా అల‌వాటైన టెంప్లేట్‌తోనే సినిమా సాగుతుంది. క‌థ‌, క‌థ‌నాలు ఏ ద‌శ‌లోనూ ఆస‌క్తిని రేకెత్తించ‌వు. ఒకే రూపంలో ఉన్న స్వామి, ఆనంద్ ఎవ‌ర‌నేదొక్క‌టే తేలాల్సిన విష‌యంగా అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్ స‌మ‌యానికి అది కూడా తేలిపోవ‌డంతో మిగ‌తా సినిమా మ‌ళ్లీ మామూలే. వాణిజ్య హంగుల జోడింపు విష‌యంలో మాత్రం చిత్ర‌ బృందం ప‌క్కాగా క‌స‌ర‌త్తులు చేసింది.

మంచి పాట‌లు, హుషారెత్తించే డ్యాన్స్‌లు, ఫైట్లు, హీరోయిన్ అందం, అక్క‌డ‌క్క‌డా పండిన కామెడీ...  మిగ‌తా మైన‌స్‌ల‌ని భ‌రించేలా చేస్తాయి. ఒక‌రు రాజులాగా.. మ‌రొక‌రు బంటులాగా క‌నిపించే క‌థానాయ‌కులు ఎవ‌ర‌నే విషయాన్ని రివీల్ చేసిన తీరు, ఆ పాత్ర‌ల బ్యాక్‌స్టోరీ కొత్త‌గా అనిపించినా అందులో లాజిక్ ఉండ‌దు. పాత క‌థ‌ల్ని సైతం ఊహ‌కంద‌ని మ‌లుపుల‌తో తెర‌పైకి తీసుకొస్తున్న స‌మ‌య‌మిది. కానీ, ఈ సినిమా కేవ‌లం వాణిజ్యాంశాల‌పైనే ఆధార‌ప‌డిన‌ట్టు అనిపిస్తుంది. పీపుల్ మార్ట్ అధిప‌తి చ‌క్ర‌వ‌ర్తి త‌న ఉద్యోగులకి షేర్లు ఇచ్చి త‌న కంపెనీలో భాగ‌స్వాములుగా మార్చ‌డంతోనే దాదాపుగా క‌థ ముగుస్తుంది. అక్క‌డి నుంచి మిగ‌తా స‌న్నివేశాల‌న్నీ సాగ‌దీత‌లా అనిపిస్తాయి. ప్ర‌తినాయ‌కుడి పాత్రకి సూట్ వేసి క్రూర‌త్వం చూపించారు త‌ప్ప‌ ఏమాత్రం తెలివి తేట‌లు క‌నిపించ‌వు. దాంతో ఆ పాత్ర సినిమాపై ప్ర‌భావం చూపించ‌లేదు. రావు ర‌మేష్ - హైప‌ర్ ఆది కాంబో అక్క‌డ‌క్క‌డా న‌వ్వించింది.

ఎవ‌రెలా చేశారంటే? ర‌వితేజ హుషారైన న‌ట‌న సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఆయ‌న రెండు పాత్ర‌ల్లో చూపించిన వైవిధ్యం ఆక‌ట్టుకుంటుంది. శ్రీలీల అందం, ఆమె డాన్స్ సినిమాకి మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ప్ర‌తి పాట‌లోనూ ఆమె త‌న‌దైన ప్ర‌భావం చూపించింది. పాట‌లే త‌ప్ప‌.. ఆమె పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. రావు ర‌మేష్ - హైప‌ర్ ఆది జోడి పాత సినిమాల్లోని రావు గోపాల‌రావు - అల్లు రామ‌లింగ‌య్య జోడీని గుర్తు చేస్తుంది. జ‌యరాం పోషించిన ప్ర‌తినాయ‌క పాత్ర‌లో బ‌లం లేదు. టేబుల్‌పై వ‌స్తువుల‌తో గొంతుల‌పై పొడ‌వ‌డం త‌ప్ప ఆ పాత్ర చేసిందేమీ లేదు. స‌చిన్ ఖేడేక‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, తుల‌సి, ప‌విత్ర లోకేశ్  త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. అలీ, ప్ర‌వీణ్ త‌దిత‌ర హాస్య‌టులున్నా వాళ్ల పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది.  ఛాయాగ్రాహ‌కుడు కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని విజువ‌ల్స్, భీమ్స్ పాట‌లు సినిమాకి బ‌లం. ‘వాట్స్ హ్యాపెనింగ్‌’, ‘దండ క‌డియాల్‌’, ‘జింతాక్’ పాట‌లు, చిత్రీక‌ర‌ణ‌, డాన్స్ అల‌రిస్తాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ ర‌చ‌న‌లో క‌థ‌, క‌థ‌నం కంటే మాట‌లు ప్ర‌భావం చూపిస్తాయి. ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ర‌వితేజ మాస్ ఇమేజ్‌పైనే దృష్టిపెట్టి, అందుకు త‌గ్గ వాణిజ్యాంశాల్ని ప‌క్కాగా మేళ‌వించి తెర‌పైకి తీసుకొచ్చారు.

బ‌లాలు: + ర‌వితేజ న‌ట‌న, + శ్రీలీల అందం, డాన్స్‌ + పాట‌లు, + కొన్ని కామెడీ స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు: - కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నం, - ద్వితీయార్థంలో సాగ‌దీత‌

చివ‌రిగా: ధ‌మాకా... అంతా పాత స‌రుకే

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని