SIR: మనతో చాలా రోజులు ప్రయాణం చేసే చిత్రం... ‘సార్‌’

‘‘జయాపజయాలతో సంబంధం లేకుండా పనిచేస్తుంటారు ధనుష్‌. అలా పనిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేసేవాళ్లని ఎవ్వరూ ఆపలేరు. ధనుష్‌(Dhanush)ని కూడా ఎవ్వరూ ఆపలేరు’’ అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram).

Updated : 16 Feb 2023 08:24 IST

‘‘జయాపజయాలతో సంబంధం లేకుండా పనిచేస్తుంటారు ధనుష్‌ (Dhanush). అలా పనిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేసేవాళ్లని ఎవ్వరూ ఆపలేరు. ధనుష్‌ని కూడా ఎవ్వరూ ఆపలేరు’’ అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram).  బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘సార్‌’ (SIR) ప్రీ రిలీజ్‌ వేడుకకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధనుష్‌, సంయుక్త (Samyuktha) జంటగా నటించిన చిత్రమిది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. వేడుకకి హాజరైన మరో అతిథి, సంగీత దర్శకుడు తమన్‌ బిగ్‌ టికెట్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘గురువు, గోవిందుడు ఎదురైతే...  గోవిందుడు వీడు అని చెప్పిన నా గురువుకే మొదటి నమస్కారం అని చెప్పారు కబీర్‌. ఈ మాట గురించి సిరివెన్నెల సీతారామశాస్త్రి సర్‌ పుస్తకంలో కూడా రాశారు. అలాంటి గురువుల గురించి సినిమా తీసిన వెంకీని అభినందిస్తున్నా. విద్య, వైద్యం అనేవి మౌలిక సదుపాయాలు, డబ్బున్నవాళ్లు, లేనివాళ్లనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనేది ప్రపంచం నేర్పుతున్న పాఠం. కానీ ఎప్పటికప్పుడు వాటిని జనాలకి దూరం చేయాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. మనిషి జీవన శైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. అంత గొప్ప ఆయుధాన్ని కేవలం డబ్బు లేదనే కారణంతో దూరం చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న వేశాడు వెంకీ. ఈ కథని ఒప్పుకున్నందుకు ధనుష్‌కి కృతజ్ఞతల’’న్నారు. ధనుష్‌ మాట్లాడుతూ ‘‘సార్‌’ బలమైన భావోద్వేగాలతో కూడిన ఓ సింపుల్‌ సినిమా. సందేశం, వినోదం ఉంటాయి’’ అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘‘సినిమాల పరంగా నాలో స్ఫూర్తిని నింపిన గురువులు మణిరత్నం,  త్రివిక్రమ్‌. త్రివిక్రమ్‌ సినిమాలు చూశాకే నేను పెన్‌ పట్టుకున్నా. ఆయన నిర్మిస్తున్న సినిమాకి నేను దర్శకత్వం చేయడం కంటే ఏం కావాలి? ధనుష్‌కి యాక్షన్‌, కట్‌ చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సముద్రఖని, రామజోగయ్య శాస్త్రి, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని