Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ

ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 10 Mar 2024 12:28 IST

మిస్‌ వరల్డ్‌- 2024 (Miss World)గా నిలిచిన క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszkova) ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. 111 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీపడి ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్నారు. ముంబయిలో జరిగిన 71వ ఎడిషన్‌ మిస్‌ వరల్డ్‌ కాంపిటిషన్‌లో గెలుపొందిన ఆమె గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ‘మనిషే కాదు మనసూ అందమే’ అని అనిపించే క్రిస్టినా గురించి పలు విశేషాలివీ..

  • చెక్‌ రిపబ్లిక్‌ దేశంలోని ట్రినెక్‌ నగరంలో జన్మించారు. కొన్నాళ్లకు వీరి కుటుంబం ఆ దేశ రాజధాని ప్రాగ్‌కు షిఫ్ట్‌ అయింది. డ్యుయల్‌ డిగ్రీలో.. లా, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. మోడలింగ్‌పై ఆసక్తి ఉండడంతో అటుగా అడుగులు వేశారు.
  • 2022లో.. లండన్‌లోని ‘ఎలైట్‌ మోడల్‌ మేనేజ్‌మెంట్‌’లో చేరి, మెళకువలు నేర్చుకున్నారు. అదే ఏడాదిలో నిర్వహించిన ‘మిస్‌ చెక్‌ రిపబ్లిక్‌’ పోటీల్లో పాల్గొని, తొలి ప్రయత్నంలోనే కిరీటం దక్కించుకున్నారు.

  • సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండే ఆమె ‘క్రిస్టినా పిస్కో ఫౌండేషన్‌’ స్థాపించారు. దాని ద్వారా ఎంతోమందికి సేవ చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులకు విద్య దూరం కాకూడదని భావించిన క్రిస్టినా టాంజానియాలో ఓ పాఠశాలను నెలకొల్పారు. ‘నా జీవితంలో గర్వించదగ్గ విషయం ఏదైనా ఉందంటే అది స్కూల్‌ని ప్రారంభించడమే’ అని చెప్పే ఈ బ్యూటీ స్వచ్ఛందంగా విద్యాబుద్ధులు నేర్పడం విశేషం.
  • 24 ఏళ్ల ఈ ప్రపంచ సుందరి ఎత్తు 180 సెం.మీ.. ఇంగ్లిష్‌, జర్మన్‌, పోలిష్‌ (పోలాండ్‌), స్లోవక్‌ (చెక్‌ రిపబ్లిక్‌, స్లోవకియా)లో అనర్గళంగా మాట్లాడగలరు. మ్యూజిక్‌, ఆర్ట్‌పై ప్యాషన్‌. ఫ్లూట్‌, వయొలిన్ ప్లే చేయడమంటే మహా ఇష్టం.

  • ‘‘పలు కారణాల వల్ల ఇప్పటికీ ఎంతోమంది చిన్నారులు పాఠశాలలకు వెళ్లడం లేదు. అలాంటి వారిని చేరదీసి, విలువైన విద్యను అందించడమే నా లక్ష్యం’’ అంటూ ఫైనల్‌ రౌండ్‌లో ప్రసంగించి క్రిస్టినా మంచి మనసు చాటుకున్నారు. 
  • ‘‘విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఎడ్యుకేషన్‌కు దూరంగా ఉంటున్న బాలల గురించి మాట్లాడటానికే నేనింత వరకూ వచ్చా. నేను ఈ అందాల పోటీల్లో గెలిచినా గెలవకపోయినా ఆ చిన్నారుల ఉన్నతికి శ్రమిస్తూనే ఉంటా’’ అని పేర్కొన్నారు. క్రిస్టినా మాటలకు ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగింది.
  • విజేతగా తనను ప్రకటించిన అనంతరం క్రిస్టినా మాట్లాడుతూ.. ప్రపంచ సుందరి కిరీటం సాధించాలనే తన కల నిజమైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌పై  చెక్‌ రిపబ్లిక్‌కు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గౌరవమన్నారు. చెక్‌ రిపబ్లిక్‌ నుంచి ప్రపంచ సుందరి కిరీటం అందుకున్న రెండో మహిళగా క్రిస్టినా నిలిచారు. అంతకు ముందు టటానా కుచరోవా అందుకున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని