Gaddar: ప్రజా గాయక.. సెలవిక..!

కాలికి గజ్జెకట్టి.. ప్రజాక్షేత్రంలో పాటల తూటాలు కురిపించిన ప్రజా గాయకుడు గద్దర్‌ సినిమా రంగంపైనా తనదైన ముద్ర వేశారు.

Updated : 07 Aug 2023 06:29 IST

కాలికి గజ్జెకట్టి.. ప్రజాక్షేత్రంలో పాటల తూటాలు కురిపించిన ప్రజా గాయకుడు గద్దర్‌ సినిమా రంగంపైనా తనదైన ముద్ర వేశారు. ‘బండెనక బండి కట్టి...’ (మాభూమి), ‘భద్రం కొడుకో...’ (రంగులకల), ‘ఆగదు ఆగదు... ఈ ఆకలి పోరు ఆగదు...’ (అడవి బిడ్డలు), ‘భారతదేశం భాగ్యసీమరా.. సకల సంపదలకి కొదువలేదురా.. (దండకారణ్యం) ‘మల్లెతీగకు పందిరివోలె మసక సీకటిలో వెన్నెలవోలె.. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... (ఒరేయ్‌ రిక్షా), పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా (జై బోలో తెలంగాణ).. ఇలా ఎన్నో పాటలతో రచయితగా, గాయకుడిగా, నటుడిగా మారి సినిమాల్ని ప్రభావితం చేశారు. ప్రజా సమస్యలు, ఉద్యమాలు, సామాన్యుడి పోరాటం తదితర ఇతివృత్తాలతో తెరకెక్కిన చాలా సినిమాల్లో గద్దర్‌ పాట వినిపించింది. బి.నర్సింగరావు, ఆర్‌.నారాయణమూర్తి, ఎన్‌.శంకర్‌ తదితర దర్శకుల సినిమాల్లో గద్దర్‌ పాటలు ఘనంగా వినిపించాయి.

ఆర్‌.నారాయణమూర్తి దర్శకనిర్మాణంలో రూపొందిన ‘ఒరేయ్‌ రిక్షా’ సినిమాలోని అన్ని పాటల్నీ గద్దర్‌ రాయడం విశేషం. ఆ సినిమాలోని ‘మల్లెతీగకు పందిరివోలె...’ పాటకి ఉత్తమ గేయ రచయితగా గద్దర్‌కీ, ఉత్తమ గాయకుడిగా వందేమాతరం శ్రీనివాస్‌లకు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు లభించాయి. ‘జై బోలో తెలంగాణ’లోని ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా...’ పాటకి కూడా ఉత్తమ గాయకుడిగా నంది అందు కున్నారు. కానీ విప్లవ ఉద్యమంలో ఉన్నవారు ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలకీ, బహుమతులకి దూరంగా ఉండాలనే నియమంతో వాటిని తిరస్కరించారు. చివరిగా ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమాలో నటించడంతోపాటు, పాటలు కూడా రాశారు. గద్దర్‌ ఇక లేరని తెలిసి చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.


  • సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటలు, పాటలతో దశాబ్దాలపాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరనే వార్త తీవ్ర విషాదం నింపింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతెత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దరన్నకి లాల్‌సలాం’’.

చిరంజీవి, కథానాయకుడు


  • తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్‌ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. గద్దర్‌ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్‌ గుర్తుకొస్తారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన లేని లోటుని ఎవ్వరూ తీర్చలేరు’’.

బాలకృష్ణ, కథానాయకుడు


  • గద్దర్‌ ప్రజా వాగ్గేయకారుడు. తాడిత, పీడిత ప్రజల సాహితీవేత్త. 1976లో తొలిసారి హైదరాబాద్‌ ప్రజానాట్యమండలి మహాసభల్లో గద్దర్‌ను కలిశాను. ఆయన పాటలు నన్నెంతో ఉత్తేజ పరిచాయి. నాలాంటి గాయకులకు, సాంస్కృతిక కళాకారులకు ఆయన స్ఫూర్తి ప్రదాత. పాల్‌ రాక్సన్‌ ఆఫ్రికా ప్రజాగాయకుల పాటలు తనను ఎంతో ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు. మైకేల్‌ జాక్సన్‌ది మట్టిమనుషుల్లో ఉండే కంఠమైనందునే అందరినీ ఆకట్టుకుందనీ, కళాకారుల్లోనూ అలాంటి ప్రత్యేకతలు ఉండాలనేవారు. ఆయన మరణం ప్రజా సాహిత్యానికి తీరని లోటు.

గాయకుడు, సంగీత  దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌


  • ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక పాల్‌ రాబ్సన్‌, ఒక గద్దర్‌... ప్రజా వాగ్గేయకారుల్లో మరో శకం ముగిసింది. ప్రజా యుద్ధనౌక గొంతు మూగబోయిందని తెలిసి కన్నీళ్లొచ్చాయి. ఆ మహాకవి మృతి యావత్‌ దేశానికి తీరని లోటు. భారతదేశంలోని పీడిత ప్రజల ఆక్రందన, ఆవేదన, ఆవేశాన్ని తన పాటతో పలికించారు. ఆయనకీ, ఆయన పాటకీ మరణం లేదు. ఆయనకూ, నాకూ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉండేది. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై...’ పాటతో నన్ను ఎంతోమంది మహిళల హృదయాలకి చేరువ చేసిన ఆ మహానుభావుడి రుణం తీర్చుకోలేనిది. చనిపోయేవరకూ ఆయన ప్రజల పక్షానే నిలబడ్డారు. చివరిగా ‘యూనివర్సిటీ’ కోసం మేం కలిశాం. అందులో పాట రాసి, పాడిన ఆయన సినిమానీ చూసి గొప్పగా ఉందని మెచ్చుకున్నారు. ఆయన ప్రజాపక్షాన ఉంటూనే అమరులయ్యారు.

ఆర్‌.నారాయణమూర్తి, దర్శకనిర్మాత, నటుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని