Cinema News: మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ

రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Updated : 19 Apr 2024 11:47 IST

రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉమాదేవి, శరత్‌ చంద్ర నిర్మాతలు. మే నెలలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథానాయకుడు శ్రీవిష్ణు గురువారం  టీజర్‌ని విడుదల చేశారు. ఇద్దరు కొడుకులు, ఓ కూతురున్న ఓ కుటుంబ కథతో రూపొందిన చిత్రమిది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ మధ్య తరగతి కుటుంబంలో జరిగిన కొన్ని సంఘర్షణలతో రూపు దిద్దుకున్న కథ ఇది.  ప్రేమ నేపథ్యంతోపాటు, మనసుకు హత్తుకునే కుటుంబ భావోద్వేగాలు  ప్రధానబలం. మే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మా టీజర్‌ని విడుదల చేసిన కథానాయకుడు శ్రీవిష్ణుకి అభినందనలు. కుటుంబ కథతో తెరకెక్కిన ఈ చిత్రం, కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంద’’న్నారు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శివచందు, యశస్విని, మొయిన్‌, మోహిత్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సిద్ధార్థ స్వయంభు.


‘డార్లింగ్‌’ నభా?

మధ్యలో కొంచెం విరామం ఇచ్చిన నభా నటేశ్‌ మళ్లీ జోరు పెంచింది.నిఖిల్‌తో ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్న ఈమె, మరికొన్ని సినిమాలతోనూ బిజీగా గడుపుతోంది. ‘బలగం’ ఫేమ్‌  ప్రియదర్శితో కలిసి ఓ ప్రేమకథలో నటిస్తోంది. డార్లింగ్‌ అనే మాటకీ, ఈ కథకీ సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే కథానాయకుడు ప్రభాస్‌ని అనుకరిస్తూ ఓ వీడియో చేసింది నభా. ప్రభాస్‌ తన సన్నిహితుల్ని డార్లింగ్‌ అని సంబోధిస్తుంటారు. ఆ మాట ఆయన ఊతపదం కూడా. ‘డార్లింగ్‌’ అనే పేరుతో సినిమా కూడా చేశారు. ప్రియదర్శి, నభా కలిసి చేస్తున్న సినిమాకి ‘డార్లింగ్‌’ అనే పేరు పెట్టే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ప్రియదర్శి, నభా నటేశ్‌ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన చర్చ సాగింది.


ప్రియమైన దొంగ

అభినవ్‌ గోమఠం టైటిల్‌ పాత్రలో బీఎస్‌ సర్వాంగ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘మై డియర్‌ దొంగ’. గోజల మహేశ్వర్‌ రెడ్డి నిర్మాత. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ఓటీటీ వేదిక ఆహాలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నటుడు ప్రియదర్శి ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా  అభినవ్‌ గోమఠం మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం చూశాను. ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ స్క్రిప్ట్‌ను శాలినీనే సిద్ధం చేసుకుంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ఈ కథని తొలుత మేము వెబ్‌సిరీస్‌లా చేద్దాం అనుకున్నాం. కానీ, ఇది సినిమాగా బాగుంటుందని అర్థమై ఆ ప్రయత్నం చేశాం’’ అంది నటి, రచయిత శాలిని. ఈ కార్యక్రమంలో మహేశ్వర్‌ రెడ్డి, అజయ్‌ అరసాడ, నిఖిల్‌, దివ్య శ్రీపాద తదితరులు పాల్గొన్నారు.


కలల సైకలాజికల్‌ చిత్రం

ప్రశాంత్‌ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్‌ రాంరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్‌ ప్రధాన పాత్రధారులుగా... సందీప్‌ కాకుల స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘డ్రీం క్యాచర్‌’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల వేడుక హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘కలల నేపథ్యంలో సాగే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. మా కథలో ఎవరు ఎలాంటి కలలు కన్నారు? అవి ఎలా సాకారం అయ్యాయనేది తెరపైనే చూడాలి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోహన్‌ శెట్టి, ఛాయాగ్రహణం: ప్రణీత్‌ గౌతమ్‌ నంద, కూర్పు: ప్రీతం గాయత్రి.


సిగ్గులల్ల సీతలెక్క సక్కగున్నాదే..

రాకేశ్‌ వర్రె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘జితేందర్‌ రెడ్డి’. విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మాత. వైశాలిరాజ్‌, రియా సుమన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మే 3న రానున్న ఈ సినిమాలోని ‘లచ్చుమక్క అర్చనక్క పిల్ల సూడండే... సిగ్గులల్ల సీతలెక్క సక్కగున్నాదే...’ అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. గోపీసుందర్‌ స్వరపరిచిన ఈ గీతానికి రాంబాబు గోసాల సాహిత్యం అందించగా, మంగ్లీ ఆలపించారు. పెళ్లి నేపథ్యంలో సాగే పాట ఇది. నిర్మాత మాట్లాడుతూ ‘‘1980 కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సహజత్వం, మలుపులతో కూడిన ఈ చిత్రం ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉంటుంద’’న్నారు. ఛత్రపతి శేఖర్‌, సుబ్బరాజు , రవి ప్రకాశ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని