వెండితెర నవమి సంబరాలు గార్బా స్టెప్పుల ఆనందాలు

నవరాత్రుల దసరా అంటేనే సంబరాల సరదా! పండగ కోలాహలం.. పడుచుల సందళ్లు.. తొమ్మిది రోజులూ హడావుడే!  ఉత్తరాదిలో అయితే దాండియా ఆటలు.. గార్బా స్టెప్పులు అదనం...  ఈ వేడుకల్ని కెమెరాలో బంధించి.. నాయికానాయకులతో ఆడిపాడించిన సినిమాలెన్నో... ప్రత్యేకంగా గార్బా నేర్చుకొని తెరపై కాలు కదిపారు కొందరు నాయకానాయికలు.

Updated : 04 Oct 2022 02:01 IST

నవరాత్రుల దసరా అంటేనే సంబరాల సరదా! పండగ కోలాహలం.. పడుచుల సందళ్లు.. తొమ్మిది రోజులూ హడావుడే!  ఉత్తరాదిలో అయితే దాండియా ఆటలు.. గార్బా స్టెప్పులు అదనం...  ఈ వేడుకల్ని కెమెరాలో బంధించి.. నాయికానాయకులతో ఆడిపాడించిన సినిమాలెన్నో... ప్రత్యేకంగా గార్బా నేర్చుకొని తెరపై కాలు కదిపారు కొందరు నాయకానాయికలు. మరి ఆ సందడి ఎలా సాగిందో నవరాత్రుల వేళ ఓసారి చూద్దాం.

ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లోనూ రణ్‌వీర్‌సింగ్‌- దీపికా పదుకొణెలు ఉత్తమ జోడీ అనే సంగతి తెలిసిందే. ‘గోలియోం కీ రాస్‌లీలా రామ్‌-లీలా’ చిత్రంలో నవరాత్రి నేపథ్యంలో ‘లాహు మూహ్‌ లగ్‌ గయా...’ అనే పాట ఉంటుంది. అందులో వారిద్దరూ వేసిన స్టెప్పులకు ఎవరికైనా పూనకం వస్తుంది. దీపికా కెపైక్కించే చూపులు, ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ.. అనుగుణంగా చేసిన నృత్యానికి ప్రేక్షకులూ కాలు కదుపుతారు.

* సంజయ్‌లీలా భన్సాలీ ప్రతి సినిమాలో సంప్రదాయం, పండగ సంబరం ఉట్టిపడేలా ఒక్కటైనా సాంగ్‌ ఉంటుంది. అందులో కథానాయిలు తమ నృత్య ప్రతిభ నిరూపించుకునేలా సన్నివేశాల్ని జోడిస్తుంటారు. ‘గంగూభాయ్‌ కాఠియావాడీ’లోనూ అలాంటి చమక్కులాంటి పాట ఒకటుంది. ఇది దసరా సందర్భంలో వస్తుంది. ‘ఢోలీడా...’ అంటూ సాగే ఈ పాటలో అలియా డ్యాన్స్‌తో దుమ్ము దులిపింది. పాల నురగలాంటి చీరకట్టులో స్టెప్పులేస్తూ..  లిరిక్‌కి అనుగుణంగా ముఖంలో తను పలికించిన   హావభావాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

* ‘కై పో చే’లోని ‘శుభారంభ్‌...’ గీతంలో రాజ్‌కుమార్‌ రావు, అమ్రితాల ప్రదర్శన చూశాక ప్రేక్షకులు తాము గుజరాత్‌లో ఉన్నట్టుగా ఫీలవుతుంటారు. కథా సన్నివేశానికి తగ్గట్టు భారీ సెట్‌ వేశారు. దేవీ నవరాత్రుల నేపథ్యంలో ఉంటుందీ పాట. ఇద్దరూ మనసు పెట్టి చేస్తూ గార్బా స్టెప్పులతో అలరించారు. ఇందులో ప్రత్యేకంగా వచ్చే డప్పుల మోతకి శ్రోతల హృదయాలు నాట్యమాడాల్సిందే. పాట ముగిసేలోగా నాయకానాయికలు ప్రేమలో పడిపోతే మనం పాట, గార్బా నృత్యంతో ప్రేమలో పడతాం.

* ‘కహోనా ప్యార్‌ హై’తో జట్టు కట్టిన హృతిక్‌రోషన్‌, అమీషా పటేల్‌ తొలి చిత్రంతోనే మాయ చేశారు. ఇందులో ‘ఓ.. రే గోరీ’ పాటలో గార్బా, దాండియా నృత్యాలను కలిపి కొట్టి అభిమానులను అలరించారు. అమీషా పండగ వేళ ధరించే సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ లయబద్ధంగా ఆడుతుంది. నలుపు రంగు డ్రెస్‌లో హృతిక్‌ ఆకట్టుకున్నాడు.

* ‘లవ్‌యాత్రీ’లో కుర్ర జంట ఆయుష్‌ శర్మ- వరీనా హుస్సేన్‌లు ప్రేక్షకుల్ని పండగనాటి పాత రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు. ‘ధోలీడా’ అంటూ సాగే ఆ పాటలో పండగ వేడుకలన్నీ కళ్లముందు కదలాడతాయి. ఇక వాళ్ల హృదయాల్లోంచి వచ్చిన నృత్య భంగిమలు ప్రేక్షకుల్ని థియేటర్లలో కుదురుగా కూర్చుండనీయలేదు. గార్బా వేస్తూ.. ఒకరిపై మరొకరు చురకత్తి చూపులు సంధించుకుంటుంటే.. ప్రేక్షకులు ఆ వలపు వలలో చిక్కుకొని గిలగిలలాడారు.

* గార్బా కర్రలతో వలపు మోత మోగిస్తూ మహీరా ఆడిపాడుతుంటే.. షారూక్‌ లయబద్ధంగా కదులుతుంటాడు. ఈ నృత్య రూపం ‘రాయీస్‌’లోని.. ‘ఉడీ ఉడీ జాయే..’ పాటలోనిది. ఈ జంట అభినయం, నాట్యానికి షారూక్‌కి ఎందరో గుజరాతీలు అప్పట్లో అభిమానులుగా మారిపోయారంటే నమ్మొచ్చు. ఇదీ దసరా నవరాత్రుల పండగ సన్నివేశం చుట్టే అల్లుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని