Guns and Gulaabs Review: రివ్యూ: గన్స్‌ అండ్‌ గులాబ్స్‌

Guns and Gulaabs Review in Telugu: రాజ్‌కుమార్‌ రావు, దుల్కర్‌ సల్మాన్‌, గుల్షన్‌ దేవయ్య కీలక పాత్రల్లో రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

Updated : 19 Aug 2023 14:29 IST

Guns and Gulaabs Review Telugu: వెబ్‌సిరీస్‌: గన్స్‌ అండ్‌ గులాబ్స్‌; నటీనటులు: రాజ్‌కుమార్‌ రావ్‌, దుల్కర్‌ సల్మాన్‌, గుల్షన్‌ దేవయ్య, ఆదర్శ్‌ గౌరవ్‌, సతీష్‌ కౌశిక్‌, పూజా గోర్‌, శ్రేయా ధన్వంతరి, విపిన్‌ శర్మ తదితరులు; సంగీతం: అమన్‌ పంత్‌; సినిమాటోగ్రఫీ: పంకజ్‌ కుమార్‌; ఎడిటింగ్‌: సుమీత్‌ కొటియాన్‌; రచన: సుమిత్‌ అరోరా, సుమన్‌ కుమార్‌; దర్శకత్వం: కృష్ణ డీకే, రాజ్‌ నిడిమోరు; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

రుస సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు రాజ్‌ అండ్‌ డీకే. వారి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీమ్యాన్‌, ఫర్జీ వంటి సిరీస్‌లు మెప్పించాయి. ఈ క్రమంలో మరో వైవిధ్యమైన కథను ఎంచుకుని ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. (Guns and Gulaabs Review in Telugu) మరి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ఎలా ఉంది.

కథేంటంటే: టిప్పు (రాజ్‌కుమార్‌రావ్‌) గులాబ్‌ గంజ్‌లో బైక్‌ మెకానిక్‌. స్మగ్లర్‌ అయిన అతని తండ్రి ఒకరోజు హత్యకు గురవుతాడు. అనుకోని పరిస్థితుల్లో టిప్పు కూడా రెండు హత్యలు చేస్తాడు. దీంతో తండ్రిలా తానూ మారిపోతానేమోనని భయపడి ఆ ఊరి నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. అర్జున్‌ వర్మ (దుల్కర్‌ సల్మాన్‌) చట్టాన్ని ఉన్నది ఉన్నట్లు అమలు చేసే పోలీస్‌ అధికారి. కొత్తగా ట్రాన్స్‌ఫర్‌ అయి, గులాబ్‌ గంజ్‌కు వస్తాడు. నల్ల మందు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని చూస్తుంటాడు. గాంచి (సతీష్‌ కౌశిక్‌) స్థానికంగా ధనవంతుడు. అంతేకాదు, నల్లమందు అక్రమ రవాణా చేస్తుంటాడు. అతని కొడుకు జుగ్ను (ఆదర్శ్‌ గౌరవ్‌). ఎప్పటికైనా తండ్రి స్థానంలోకి రావాలని ఉవ్విళ్లూరుతుంటాడు. నెల రోజుల్లో పెద్ద మొత్తంలో నల్లమందు ఇస్తానని గాంచి కొందరు వ్యక్తులతో డీల్‌ చేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఒకరోజు గాంచి ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలవుతాడు. దీంతో నల్లమందు అక్రమ రవాణా చేయాల్సిన డీల్‌ను జుగ్ను ఎలా హ్యాండిల్‌ చేశాడు? (Guns and Gulaabs Review) ఈ క్రమంలో పోలీస్‌ ఆఫీసర్‌ అర్జున్‌ వర్మ నుంచి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఊరి నుంచి వెళ్లిపోవాలనుకున్న టిప్పు ఎందుకు తిరిగి వచ్చాడు? 4 కట్‌ ఆత్మారాం (గుల్షన్‌ దేవయ్య) ఎవరు? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: గ్యాంగ్‌స్టర్‌, స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఇప్పటివరకూ వెండితెరపై చాలా కథలు అలరించాయి. కథ, హీరో ఇమేజ్‌ను బట్టి వాటి టేకింగ్‌ ఎగ్జిక్యూషన్‌ ఉంటాయి. ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ విషయానికొచ్చే సరికి, అదే గ్యాంగ్‌స్టర్‌ కథ 90వ దశకంలో జరిగితే ఎలా ఉంటుందో రాజ్‌, డీకే చూపించే ప్రయత్నం చేశారు. కథ తెలిసినదే అయినా, దాన్ని ఎంత ఆసక్తికరంగా మలిచామన్న దానిపై సినిమా/సిరీస్‌ విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో సిరీస్‌ దర్శకులు కొంత వరకూ సఫలమయ్యారు. పగ, ప్రతీకారం, ఆధిపత్య పోరు, పేరు ప్రఖ్యాతులు ప్రతి మనిషి వీటి చుట్టూనే తిరుగుతాడు. ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’లో కూడా ప్రతి పాత్ర వీటిని సాధించడం కోసమే పరితపిస్తుంటుంది. ఏ పాత్ర ఏంటి? కథలో ఎటు వైపు వారి పయనం ఉంటుందన్న పరిచయంతో మొదటి ఎపిసోడ్‌ను తీర్చిదిద్దారు. (Guns and Gulaabs Review in Telugu) అక్కడి నుంచి పాత్రల మధ్య సంఘర్షణ మొదలై పరుగులు పెట్టాల్సిన కథనం నెమ్మదిగా సాగుతుంది. ఏడు ఎపిసోడ్స్‌ కలిగిన ఈ సిరీస్‌ (ఒక్కో ఎపిసోడ్‌ సుమారు గంట)కు ప్రధాన ప్రతిబంధకం నిడివి. పాత్రలు, వాటి సంభాషణలు అలరిస్తున్నా, కథనం నెమ్మదిగా సాగడం చూసే ప్రేక్షకుడికి పెద్దగా ఆసక్తి అనిపించదు. అయితే, దర్శకులు చేసిన ఒక మంచి పని ఏంటంటే, రాజ్‌కుమార్‌ రావ్‌, దుల్కర్‌ సల్మాన్‌, గుల్షన్‌ దేవయ్య, ఆదర్శ్‌ గౌరవ్‌ వంటి నటులను తీసుకోవడం. సిరీస్‌ ఇంత పెద్ద నిడివి అన్న విషయాన్ని బయటపడకుండా కథలో లీనమయ్యేలా చేయడంలో కొంతమేర విజయం సాధించారు.

మూడు ఎపిసోడ్స్‌ ముగిసే సమయానికి సిరీస్‌లోని కీలక పాత్రలన్నీ ఒక సెంటర్‌ పాయింట్‌ దగ్గరకు వచ్చి ఆగుతాయి. దీంతో తర్వాత ఏం జరుగుతుందున్న ఆసక్తిని పెంచారు దర్శకులు.  అందుకోసం రాసుకున్న సన్నివేశాలు పాత్రల ఎగ్జిక్యూషన్‌ సరదాగా ఉంటూనే కాస్త ఉత్కంఠతోనూ సాగుతాయి. ఇక్కడి నుంచి సిరీస్‌ ఆసక్తిగా సాగుతుందేమోనని అనిపించినా, ఒక రొటీన్‌ బ్లాక్‌ కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తీసుకెళ్లారు. తన స్నేహితుడిని చంపిన వారిని అంతం చేసేందుకు టిప్పు చేసే ప్రయత్నాలు, తండ్రి స్థానంలోకి వచ్చేందుకు జుగ్ను పడే పాట్లు, నల్లమందు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అర్జున్‌ చేసే పోరాటం ఇలా ప్రతిదీ ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగుతుంది. (Guns and Gulaabs Review in Telugu) ఐదు, ఆరు ఎపిసోడ్స్‌లో అక్కడక్కడా మాత్రమే మెరుపులు కనిపిస్తాయి. చివరి ఎపిసోడ్‌ మరీ గంటకు పైగా సాగుతుంది. ఒక సాధారణ క్లైమాక్స్‌తో సిరీస్‌ను ముగించారు. కాకపోతే ఆఖర్లో ఒక ట్విస్ట్‌ ఇచ్చి ‘సీజన్‌-2’కు బాటలు వేశారు. ఈ వీకెండ్‌లో ఒక డిఫరెంట్‌ గ్యాంగ్‌స్టర్‌ సిరీస్‌ చూడాలనుకుంటే ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ ప్రయత్నించవచ్చు. ఓటీటీ కంటెట్‌ కావడంతో అక్కడక్కడా కొన్ని అసభ్య పదాలు వస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది.

ఎవరెలా చేశారంటే: టిప్పుగా రాజ్‌కుమార్‌రావ్‌ సహజంగా నటించారు. ఆయన నటన, హావభావాలు మెప్పిస్తాయి. అర్జున్‌గా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో దుల్కర్‌ సీరియస్‌గా నటించారు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్తేమీ కాదు, గుల్షన్‌ దేవయ్య పాత్ర కాస్త డిఫరెంట్‌గా ఉంది. ఆయన హెయిర్‌స్టైల్‌ 90వ దశకం నాటి సంజయ్‌దత్‌ను గుర్తు చేస్తుంది. జుగ్ను పాత్రలో  ఆదర్శ్‌ గౌరవ్‌ ఓకే. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సిరీస్‌ బాగుంది. (Guns and Gulaabs Review in Telugu) 90ల నాటి కాలాన్ని తీసుకురావడంలో చాలా కష్టపడ్డారు. ఫ్లేమ్స్‌ ఆడటం, క్యాసెట్స్‌లో పాటలు వినడం, ఎస్టీడీ బూత్‌ల నుంచి ఫోన్‌లు చేయడం ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధ పెట్టి తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఈసిరీస్‌కు ప్రధాన అడ్డంకి నిడివి. కథ ఎంగేజింగ్‌గా చూపించినప్పుడు నిడివి ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులు చూస్తారు. కానీ, తెలిసిన కథను సాగదీస్తే ఎన్ని ఇతర మెరుపులు ఉన్నా ఆసక్తి తగ్గిపోతుంది. (Guns and Gulaabs Review in Telugu) రెండున్నర, మూడు గంటల సినిమాగా మలచాల్సిన కథను ఏడు గంటల సాగదీశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫ్యామిలీమ్యాన్‌, ఫర్జీ సిరీస్‌లతో మెప్పించిన రాజ్‌ అండ్‌ డీకే నుంచి వచ్చిన మరో సిరీస్‌ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కానీ, ఆ అంచనాలను కొంత వరకే అందుకున్నారు. మంచి నటీనటులు ఉన్నా, బలమైన ఎమోషన్స్‌ను తీసుకురావడంలో శ్రద్ధ పెట్టలేదు. 

  • బలాలు
  • + నటీనటులు
  • + 90 దశకం నాటి నేపథ్యం
  • + కామెడీ
  • బలహీనతలు
  • - నిడివి
  • - నెమ్మదిగా సాగే కథనం
  • - పాత్రల మధ్య బలమైన సంఘర్షణ లేకపోవడం
  • చివరిగా: ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ సినిమా కథను సా....గదీసి సిరీస్‌ చేశారు!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని