105 Minutes Review: రివ్యూ: 105 మినట్స్‌.. హన్సిక నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

నటి హన్సిక నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Updated : 26 Jan 2024 15:44 IST

చిత్రం: 105 మినట్స్‌; న‌టీన‌టులు: హ‌న్సిక; సంగీతం: సామ్ సిఎస్‌; ఛాయాగ్రహ‌ణం: కిషోర్ బోయిడ‌పు; నిర్మాత‌: బొమ్మక్ శివ; ద‌ర్శ‌క‌త్వం: రాజు దుస్సా; విడుద‌ల తేదీ: 26-01-2024

‘దేశ‌ముదురు’, ‘కందిరీగ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన న‌టి హ‌న్సిక. ప్ర‌స్తుతం నాయికా ప్రాధాన్య సినిమాల‌తో జోరు చూపిస్తున్న‌ ఆమె.. ‘105 మినట్స్‌’ (105 Minutes Review)తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇదో ప్ర‌యోగాత్మ‌క చిత్రం. ఆమె ఏక‌పాత్రాభిన‌యం చేయ‌డం విశేషం. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? హ‌న్సిక‌కు విజ‌యాన్ని అందించిందా?(105 Minutes Review).

క‌థేంటంటే: జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికెళ్తుంటే త‌న‌నేదో అదృశ్య శ‌క్తి వెంటాడుతున్న‌ట్లు.. తనను హ‌త్య చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు లోన‌వుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. అంత‌కు ముందు వెంటాడిన ఆ అదృశ్య శ‌క్తి.. త‌న‌ను ఇంట్లోనే ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం మొద‌లు పెడుతుంది. ప్రాణాల‌ను అర చేతిలో పెట్టుకుని ఆ ఇంటి నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంది జాను. కానీ, ఇంట్లో ఉన్న శ‌క్తి త‌న‌ను అడ్డుకుంటుంది. త‌న మ‌ర‌ణానికి జానునే కార‌ణ‌మ‌ని.. తాను పెట్టే చిత్రహింసను అనుభ‌వించాల్సిందే అంటూ భీక‌ర స్వ‌రంతో భ‌య‌పెడుతుంటుంది. మ‌రి ఆ ఇంటి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ (105 Minutes Review).

ఎలా ఉందంటే: ఒకే పాత్ర చుట్టూ తిరిగే క‌థ ఇది. దాదాపు ఒకే ఇంట్లో సాగుతుంది. ఇలాంటి సినిమాతో ప్రేక్ష‌కుల్ని రెండున్న‌ర గంట‌లు థియేట‌ర్ల‌లో కూర్చోబెట్టడం ఓ సాహసమే. ఇలాంటి కాన్సెప్ట్ రాసుకున్న ద‌ర్శ‌కుడికి.. దాన్ని న‌మ్మి చేసేందుకు ముందుకొచ్చిన ఆర్టిస్ట్‌, నిర్మాత‌కు చాలా ధైర్యం కావాలి. ఈ విష‌యంలో హ‌న్సిక‌తో పాటు ద‌ర్శ‌క నిర్మాత‌లిద్ద‌ర్నీ అభినందించాల్సిందే. అయితే, ఎలాంటి ప్ర‌యోగ‌మైనా స‌రే దాన్ని ఆస‌క్తిక‌రంగా తెర‌పై ఆవిష్క‌రించ‌లేక‌పోతే ప్రయోజనం ఉండదు. బ‌ల‌మైన క‌థ‌, దాని చుట్టూ ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాలు ఉంటేనే.. ప్రేక్ష‌కుల్ని రెండున్న‌ర గంట‌లు సీట్ల‌కు అతుక్కునేలా చేయ‌గ‌లుగుతారు. ఈ చిత్ర విష‌యంలో ఈ రెండూ క‌నిపించ‌వు (105 Minutes Review). సినిమా ఆస‌క్తిక‌రంగానే మొదలైనా.. ఆ త‌ర్వాత నుంచి క‌థ ముందుకు సాగదు. ఓ వ్య‌క్తి స్వ‌రం జానును ప‌దే ప‌దే భ‌య‌పెట్ట‌డం.. ఆమె త‌న సంకెళ్లు తెంచుకుని  త‌ప్పించుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో తీవ్రంగా గాయ‌ప‌డ‌టం.. ఇక ఆ త‌ర్వాత నుంచి ఆ ఇంట్లోనే బాధతో విల‌విల‌లాడుతూ తిర‌గ‌డం.. విరామం వ‌ర‌కు ఇదే సాగ‌తీత క‌నిపిస్తుంది. దీనికి తోడు హ‌న్సిక ఆద్యంతం బాధ‌తో కేక‌లు వేస్తూ.. ఏడుస్తూనే క‌నిపించ‌డం.. ప్రేక్ష‌కుల్ని చిత్ర‌హింస‌కు గురి చేస్తున్న‌ట్లుగా ఉంటుంది. అస‌లు జానును ఆ ఆత్మ ఎందుకు వేధిస్తోంది? అది ఏమి చెప్పాల‌నుకుంటోంది? అన్న‌దానిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ద్వితీయార్ధంలోనైనా స్ప‌ష్ట‌త ఇస్తారేమోన‌ని ఎదురుచూస్తే అక్క‌డా భంగ‌పాటే ఎదుర‌వుతుంది. ఇక సినిమాను ముగించిన తీరు స‌హ‌నానికి మ‌రో పెద్ద ప‌రీక్షే. ఆశ్చ‌ర్యప‌రిచే అంశం ఏంటంటే.. అస‌లు క‌థ ఇప్పుడే మొద‌లైందంటూ ముగింపులో చేసే సీక్వెల్ ప్ర‌క‌ట‌న (105 Minutes Review).

ఎవ‌రెలా చేశారంటే: జాను పాత్ర‌లో హ‌న్సిక జీవించింది. కానీ, సినిమాలో బ‌ల‌మైన క‌థ లేన‌ప్పుడు.. అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచినా వృథా ప్ర‌యాసే అవుతుంది. దీనికి తోడు సినిమాలో ఆమె పాత్ర ఆద్యంతం ఒకే ఎమోష‌న్‌తో భారంగా సాగుతుంది. అది ప్రేక్ష‌కుల్ని మ‌రింత ఇబ్బంది పెడుతుంది (105 Minutes Review). ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం మంచిదైనా.. స‌రైన క‌థ‌, క‌థ‌నాలు లేకుండా రంగంలోకి దిగ‌డం వ‌ల్ల ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. సాంకేతికంగా నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌థేమీ లేకున్నా ఆ సంగీత‌మే దీంట్లో ఏదో ఉందేమో అన్న అనుభూతిని అందిస్తుంది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి (105 Minutes Review).

  • బ‌లాలు:
  • + హ‌న్సిక న‌ట‌న‌
  • నేప‌థ్య సంగీతం
  • బ‌ల‌హీన‌త‌లు:
  • - క‌థ‌.. స్ర్కీన్‌ప్లే
  • - సాగ‌తీత స‌న్నివేశాలు
  • - ముగింపు
  • చివ‌రిగా: 105 మినట్స్‌.. ఆద్యంతం స‌హ‌నానికి ఓ ప‌రీక్షే..!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని