Published : 30 Jun 2022 02:12 IST

Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్‌ సెల్వన్‌ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్‌ అదేనా?

ఇంటర్నెట్ డెస్క్‌: దేశ వ్యాప్తంగా ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa) సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కథానాయకుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) మేనరిజం, ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా చివరి ఇరవై నిమిషాల్లో ‘భన్వర్‌ సింగ్‌ షెకావత్‌’గా ఎంట్రీ ఇచ్చిన ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) నటననూ అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు.

ఈ సినిమా క్లైమాక్స్‌లో అర్జున్‌, ఫహద్‌ల మధ్య ‘వార్‌ డిక్లేర్‌’ చేస్తూ, సీక్వెల్‌ ‘పుష్ప: ది రూల్‌’పై అంచనాలను భారీగా పెంచేశారు దర్శకుడు సుకుమార్. ఈ అంచనాలను అందుకునేందుకు సుకుమార్‌ ఆ స్క్రిప్టుపై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. అందులో భాగంగానే ‘పుష్ప 2’లో ఫహద్‌ ఫాజిల్‌తోపాటు మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi)ని రంగంలోకి దించబోతున్నారట! ‘పుష్ప’రాజ్‌ దూకుడుకి అడ్డుకట్ట వేయాలంటే కథకు అనుకూలంగా మరో భారీ విలన్‌ అవసరం ఉన్న నేపథ్యంలోనే విజయ్‌ సేతుపతిని దర్శకుడు సంప్రదించినట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే విజయ్‌ సేతుపతి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో విలన్‌గా ప్రేక్షకుల్ని విశేషంగా మెప్పించడం, కోలీవుడ్‌లో ఆయనకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్‌ ఈ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే ‘పుష్ప-2’పై అంచనాలు మరింత పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 ప్రథమార్థంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

అల్లు అర్జున్‌ లుక్‌పై ట్రోల్స్‌!

అల్లు అర్జున్‌ ఫొటో ఒకటి ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఇందులో ఆయన నీలం రంగు టీ షర్ట్‌తో, చలువ కళ్లద్దాలు ధరించి స్టైలిష్‌గా కనిపించారు. ఈ పిక్‌ ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, అదే ఇప్పుడు ట్రోల్స్‌కు గురవుతోంది. ఈ ఫొటోలో అల్లు అర్జున్‌ కాస్త బొద్దుగా కనిపించడంతో పలువురు నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఫిట్‌నెస్‌కి మారుపేరుగా నిలిచే నటుల్లో ఒకరైన బన్నీ కొంచెం లావుగా కనబడటంతో ఉత్తరాది వారు ట్రోల్స్‌ చేస్తున్నారు. వడాపావ్‌ లుక్‌, శ్రీలంక బౌలర్‌ మలింగలా ఉన్నారు అంటూ రకరకాల పేర్లతో అల్లు అర్జున్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఇంతకుముందు ప్రభాస్‌ లుక్‌పైనా ఇలాంటి ట్రోల్సే రావడం గమనార్హం. మరోవైపు, అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’లోని పాత్ర కోసమే ఇలా సన్నద్ధమవుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts