Kangana Ranaut: ఈ శుక్రవారం రూ.200 కోట్లు బూడిదైనట్లే!

సినిమాలతోనే కాదు, అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut).

Published : 21 Feb 2022 01:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమాలతోనే కాదు, అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut). తాజాగా ఇన్‌స్టా వేదికగా ఆమె చేసిన కామెంట్లు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ మారాయి. ఈ శుక్రవారం విడుదలయ్యే ఓ సినిమా అట్టర్‌ఫ్లాప్‌ అవుతుందని, రూ.200కోట్లు బూడిదేనంటూ వ్యాఖ్యానించారు. ఇంతకీ కంగనా ఎవరి గురించి? ఏమన్నారంటే?

‘‘మూవీ మాఫియా డాడీకి ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ వద్ద రూ.200 కోట్లు బూడిదైనట్టే. ఎందుకంటే అందంగా ఉంటానని భ్రమించే తెలివి తక్కువ అమ్మాయి బాగా నటిస్తుందని ఆయన నిరూపించాలనుకుంటున్నారు. ఆ సినిమాకు అతి పెద్ద లోపం నటీనటుల ఎంపికే. ఈ వారం దక్షిణాది, హాలీవుడ్‌ చిత్రాలతో స్క్రీన్స్‌ అన్నీ నిండిపోతాయి. బాలీవుడ్‌లో మూవీ మాఫియాదే పవర్‌. మాఫియా డాడీ ఒంటి చేత్తో బాలీవుడ్‌లో పని విధానాన్ని, సంస్కృతిని నాశనం చేశారు. అంతేకాదు, ఎమోషనల్‌గా పలువురు నటులు, దర్శకులను మభ్యపెడతారు. ఈ సినిమా విడుదలతో మరో ఉదాహరణ మీరు తప్పకుండా చూస్తారు. ప్రజలు ఆయనను ప్రోత్సహించడం ఇకనైనా ఆపేయాలి. ఆ మాఫియా డాడీ చేసే పనుల వల్ల ఈ శుక్రవారం ఒక పెద్ద హీరో, గొప్ప దర్శకుడు బాధితులుగా మిగులుతారు’’ అని కంగనా తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ప్రస్తుతం కంగనా పోస్ట్‌లు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

మరోవైపు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గుంగుబాయి కథియావాడి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్‌ దేవ్‌గణ్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని