Khufiya Review: రివ్యూ: ఖూఫియా.. టబు నటించిన స్పై థ్రిల్లర్‌ సినిమా ఎలా ఉందంటే?

టబు, వామికా గబ్బీ, అశిష్‌ విద్యార్థి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఖూఫియా’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే?

Updated : 07 Oct 2023 09:33 IST

చిత్రం: ఖూఫియా; నటీనటులు: టబు, ఆశిష్‌ విద్యార్థి, అలీ ఫజల్‌, వామికా గబ్బీ, అతుల్‌ కులకర్ణి, అజ్మేరీ హక్‌ బధోన్‌; ఎడిటింగ్‌: ఎ. శ్రీకర్‌ ప్రసాద్‌; సినిమాటోగ్రఫీ: ఫర్హద్‌ అహ్మద్‌; మ్యూజిక్‌: విశాల్‌ భరద్వాజ్‌; ప్రొడ్యూసర్స్‌: విశాల్‌ భరద్వాజ్‌, రేఖా భరద్వాజ్‌; డైరెక్షన్: విశాల్‌ భరద్వాజ్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: నెట్‌ఫ్లిక్స్‌.

ట్రెండ్‌కు తగ్గట్లు కొందరు దర్శక, నిర్మాతలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీల్లోనే విడుదల చేస్తున్నారు. అలా.. ఈ వారం వచ్చిన చిత్రాల్లో ‘ఖూఫియా’ (Khufiya) ఒకటి. అమర్‌ భూషణ్‌ రచించిన ‘ఎస్కేప్‌ టు నో వేర్‌’ నవల ఆధారంగా దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ తెరకెక్కించిన చిత్రమిది. టబు, ఆశిష్‌ విద్యార్థి, వామికా గబ్బీ, అలీ ఫజల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా కథేంటి? ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈ రివ్యూ చదివేయండి (Khufiya Review)..

కథేంటంటే: జీవ్‌ (ఆశిష్‌ విద్యార్థి), కృష్ణ మెహ్రా అలియాస్‌ కేఎం (టబు) రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) అధికారులు. దిల్లీలో ఉన్న ‘రా’ ప్రధాన కార్యాలయంలో డెస్క్‌ జాబ్‌ చేసే రవి మోహన్‌ (అలీ ఫాజిల్‌) అక్కడి సమాచారాన్ని ఉగ్ర సంస్థలకు చేరవేస్తున్నాడని జీవ్‌ అనుమానిస్తాడు. అతడిపై నిఘా పెట్టాలని కేఎంను ఆదేశిస్తాడు. పై అధికారి చెప్పిన మేరకు కేఎం ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ‘ఆపరేషన్‌ బ్రూటస్‌’ పేరుతో ఆ బృందం రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో కేఎం బృందానికి ఎదురైన సవాళ్లేంటి? జీవ్‌ అనుమానించినట్లు రవి దేశ ద్రోహేనా? రవి చర్యల వెనుక అతడి భార్య చారు (వామికా గబ్బీ) హస్తం ఉందా? ఓ కంపెనీలో ఆడిటింగ్‌ చేసే హీనా రెహమాన్‌ (అజ్మేరీ), కేఎంకు ఉన్న సంబంధమేంటి? హీనాను హత్య చేసిందెవరు? కృష్ణ మెహ్రా ఎందుకు కేఎంగా మారాల్సి వచ్చింది. ఆమె వ్యక్తిగత జీవితమేంటి? తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానం సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది (Khufiya Review in Telugu).

ఎలా ఉందంటే: రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ ఎలా పనిచేస్తుందో వివరించే కథ ఇది. ఇలాంటి స్పై థ్రిల్లర్‌ స్టోరీస్‌ విషయంలో ప్రేక్షకుడు ట్విస్ట్‌లు ఆశించడం సహజం. అలాంటి అంచనాలతో ఈ సినిమా చూస్తే నిరాశే ఎదురవుతుంది. ఒకట్రెండు చోట్ల తప్ప ఎక్కడా మలుపులు ఉండవు. ఆరంభ సన్నివేశాలతో సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా చేసిన దర్శకుడు తర్వాత దాన్ని కొనసాగించలేకపోయారు. ఓ పార్టీకి హాజరైన హీనా రెహమాన్‌ హత్యకు గురయ్యే సీన్‌తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆమెను చంపిన వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? వీరిద్దరి మధ్య ఉన్న సంబంధమేంటో తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రేక్షకుడికి కలుగుతుంది. ఆ సస్పెన్స్‌ను అలానే ఉంచుతూ ‘రా’ నేపథ్యాన్ని తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు. రవి మోహన్‌ను జీవ్‌ అనుమానించడం, ఆ సంగతి చెప్పగానే కేఎం రంగంలోకి దిగడం చకచకా జరిగిపోతాయి. కానీ, ‘స్పై’ సీక్వెన్సెస్‌ మాత్రం నెమ్మదిగా సాగుతాయి. రవి మోహన్‌ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి అక్కడి ప్రతి కదలికను గమనిస్తుంటుంది కేఎం బృందం. ఈ తరహా కాన్సెప్ట్‌లో ఉత్కంఠ భరిత సన్నివేశాలు అల్లుకునే అవకాశం ఉన్నా దర్శకుడు దాన్ని వినియోగించుకోలేదు. ఎంతసేపూ రవి భార్య డ్యాన్స్‌నే హైలైట్‌ చేశారు. పైగా అర్ధనగ్న ప్రదర్శన. ప్రథమార్ధం అంతా ఇలా రవి ఇంటి చుట్టూనే తిరుగుతుంది (Khufiya Review in Telugu).

రివ్యూ: రూల్స్‌ రంజన్‌.. కిరణ్ అబ్బవరం మూవీ హిట్టా..? ఫట్టా..?

హీనాను చంపిందెవరనే ప్రశ్నతోపాటు మరికొన్నింటికి ద్వితీయార్ధంలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫ్లాష్‌బ్యాక్‌లోని ఆయా పాత్రల నేపథ్యాలను చూపిస్తూనే ప్రెజెంట్‌ కథను నడిపించడంలో స్పష్టతలోపించి గందరగోళానికి దారి తీసినట్లైంది. ఇలా పూర్తిగా సీరియస్‌ మోడ్‌లోనే కాకుండా కాస్త డ్రామాని జోడించారు. ఈ క్రమంలో వచ్చే కేఎం ఫ్యామిలీ డ్రామా హృదయాన్ని హత్తుకుంటుంది. తాము ప్రదర్శనలిచ్చే కార్యక్రమాలకు తల్లీదండ్రులు హాజరుకాకపోతే పిల్లలు ఎంత బాధపడతారో కేఎం కుమారుడి పాత్ర ద్వారా చూపించిన తీరు కట్టిపడేస్తుంది. తర్వాత కథ అమెరికాకు షిఫ్ట్‌కావడం.. అక్కడా రవి మోహన్‌పై నిఘా పెట్టడం కామన్‌ పాయింట్‌. ఒకానొక సమయంలో చనిపోయిందనుకున్న చారు.. తిరిగి అమెరికాలో ఉంటున్న తన కుటుంబాన్ని కలుసుకోవడం, దాని వెనుక ఉన్న కేఎం స్కెచ్‌ థ్రిల్‌ పంచే అంశాలు. ఇక్కడా అడల్డ్‌ సీన్‌ని జొప్పించారు. పతాక సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి (Khufiya Review in Telugu). 

ఎవరెలా చేశారంటే: టబు, ఆశిష్‌ విద్యార్థి ఎప్పటిలాగే తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ముఖ్యంగా టబు.. కన్న కొడుకుకు ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నానని మనోవేదన అనుభవించే తల్లిగా, ‘రా’ ఆఫీసర్‌గా ఒదిగిపోయారు. వామికా గబ్బీ అందాలు ఆరబోయడంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. అలీ ఫజిల్‌ మెప్పిస్తాడు. అతుల్‌ కులకర్ణిది అతిథి పాత్ర. ఇతర పాత్రధారులు పరిధి మేరకు నటించారు (Khufiya Review).

సాంకేతికంగా ఎలా ఉందంటే: స్పై థ్రిల్లర్‌ చిత్రాలకు నేపథ్య సంగీతం ప్రధాన బలంగా ఉండాలి. ఈ సినిమా విషయంలో విశాల్‌ భరద్వాజ్‌ ఆ మ్యాజిక్‌ చేయలేకపోయారు. పాటల విషయంలోనూ అంతే. 2 గంటల 37 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎడిటింగ్‌ విషయంలో శ్రీకర్‌ ప్రసాద్‌ ఇంకా కసరత్తు చేయాల్సింది. సరిగ్గా ‘కట్‌’ చేయకపోవడంతో వెబ్‌సిరీస్‌ చూస్తున్న ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలుగుతుంది. ఫర్హద్‌ అహ్మద్‌ సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ఆసక్తికర నవలను ఎంపిక చేసుకుని దాన్ని తెరపైకి తీసుకురావాలనే విశాల్‌ భరద్వాజ్‌ ఆలోచన మెప్పించదగ్గదేగానీ టేకింగ్‌ పరంగా ఆయన విఫలమయ్యారు (Khufiya Review in Telugu).

కుటుంబంతో కలిసి చూడొచ్చా: చూడకపోవడమే బెటర్‌. చారు పాత్ర అర్ధనగ్న ప్రదర్శన, శృంగార సన్నివేశాలేకాదు ఇతర పాత్రల విషయంలో ‘ఎఫ్‌’ వర్డ్‌ తరచూ వినిపిస్తుందీ చిత్రంలో. ఫ్యామిలీ డ్రామాను కేఎం పాత్ర విషయంలో అంత ఎమోషనల్‌గా చూపించిన దర్శకుడు చారు పాత్ర విషయంలో మర్చిపోయినట్లున్నారు! (Khufiya Review).

  • బలాలు
  • + టబు పాత్ర
  • + ప్రారంభ సన్నివేశాలు
  • బలహీనతలు
  • - సాగదీత సన్నివేశాలు 
  • - గజిబిజి స్క్రీన్‌ప్లే
  • చివరిగా: కేఎం చేపట్టిన ‘ఆపరేషన్‌’ ఫెయిల్‌ (Khufiya Review)!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని