killer soup review: రివ్యూ: కిల్లర్‌ సూప్‌.. మనోజ్‌ బాజ్‌పాయ్‌ నటించిన క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

killer soup review: మనోజ్‌ బాజ్‌పాయ్‌, కొంకణాసేన్‌ శర్మ కీలక పాత్రల్లో అభిషేక్‌ చౌబే రూపొందించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

Updated : 12 Jan 2024 15:33 IST

killer soup review | వెబ్‌సిరీస్‌: కిల్లర్‌ సూప్‌; నటీనటులు: మనోజ్‌ బాజ్‌పాయ్‌, కొంకణా సేన్‌ శర్మ, నాజర్‌, సాయాజీ శిందే, లాల్‌ తదితరులు; సంగీతం: సందేశ్‌రావు; ఎడిటింగ్‌: శాన్యుక్త కాజా; సినిమాటోగ్రఫీ: అనూజ్‌ రాకేశ్‌, ధావన్‌; నిర్మాత: చేతన్‌ కౌశిక్‌, హనీ తెహ్రాన్‌; రచన: ఉనైజా మర్చెంట్‌, హర్షద్‌ నలవాడ, అనంత్‌ త్రిపాఠి; దర్శకత్వం: అభిషేక్‌ చౌబే; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

ప్రముఖ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌, కొంకణా సేన్‌శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘కిల్లర్‌ సూప్‌’. ప్రచార చిత్రాలతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది? యువ ప్రేక్షకులను మెప్పిస్తుందా?

కథేంటంటే: స్వాతి (కొంకణాసేన్‌ శర్మ)కి రెస్టారంట్‌ పెట్టాలని ఆశ. అందుకోసం ఓ వంట మనిషి దగ్గర చేరుతుంది. ఆమె భర్త ప్రభాకర్‌ శెట్టి అలియాస్‌ ప్రభు (మనోజ్‌ బాజ్‌పాయ్‌)కు అపార్ట్‌మెంట్‌లు కట్టాలని, వ్యాపారం చేయాలని తపన. కానీ, ఏ పని మొదలు పెట్టినా అది మసైపోతుంటుంది. పైగా అవినీతి పరుడు. అన్న అరవింద్‌ శెట్టి (సాయాజీ శిందే) సాయంతో మొదలు పెట్టిన వ్యాపారాల్లో నష్టాలు రావడంతో మూసేస్తాడు. ఈ క్రమంలో ఓ రిసార్ట్‌ బిజినెస్‌ ప్రారంభిస్తానని, అందులో పెట్టుబడులు పెట్టాలని అన్న అరవింద్‌ను కోరగా.. అతడు తిరస్కరిస్తాడు. మరోవైపు ప్రభాకర్‌కు మసాజ్‌లు చేసే.. అచ్చం అతడిలానే ఉండే  ఉమేశ్‌ పిళ్లైతో స్వాతి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అనుకోని పరిస్థితుల్లో ప్రభు హత్యకు గురవుతాడు. దీంతో ఉమేశ్‌ను ప్రభు స్థానంలోకి తీసుకొస్తుంది స్వాతి. ఉమేశ్‌ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయి?(killer soup review in telugu) ప్రభు హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు స్వాతి, ఉమేశ్‌లు ఏం చేశారు? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు? 

ఎలా ఉందంటే: క్రైమ్‌, కామెడీ కలిపి సినిమాలు తీయడం వెండితెరకు కొత్తమే కాదు. ఇటీవల వెబ్‌సిరీస్‌ల విషయంలోనూ కొందరు క్రియేటర్స్‌ ఈ పంథాను అనుసరిస్తున్నారు. అయితే, సినిమాతో పోలిస్తే, సుదీర్ఘంగా సాగే సిరీస్‌లు అనవసర సన్నివేశాలతో సాగదీత వ్యవహారంలా అనిపిస్తున్నాయి. ‘కిల్లర్‌ సూప్‌’ అలాంటి కోవకు చెందినదే అయినా, కాస్త ఎంగేజింగ్‌గా తీర్చిదిద్దడంలో దర్శకుడు అభిషేక్‌ చౌబే విజయం సాధించారు. (killer soup review in telugu) నాలుగైదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఓ హత్య కేసు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రియుడితో కలిసి బతికేందుకు కట్టుకున్న భర్తను చంపేసింది ఓ భార్య. ప్రియుడిని తన భర్త స్థానంలో తీసుకురావడానికి అతడి ముఖంపై కెమికల్‌ పోసి ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియుడు చికెన్‌సూప్‌ తాగడంతో అనుమానం వచ్చిన అత్తమామలు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొదలైన విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ‘కిల్లర్‌ సూప్‌’ కథ ఇదే.

స్వాతి, ప్రభాకర్‌ శెట్టి, అరవింద్‌ శెట్టి, ఉమేశ్‌ పిళ్లై ఇలా కీలక పాత్రలు.. వాటి మోటివ్‌లను పరిచయం చేస్తూ సిరీస్‌ మొదలు పెట్టిన దర్శకుడు నెమ్మదిగా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. వివాహమై 20ఏళ్లు అయినా భార్య చేసే సూప్‌ కూడా నచ్చని భర్త.. ఎప్పుడెప్పుడు భర్తకు వచ్చే డబ్బులను కాజేసి, ప్రియుడితో గడపాలని ఉవ్విళ్లూరే భార్య.. తమ్ముడి సామర్థ్యంపై ఏమాత్రం నమ్మకం లేని అన్న.. తన వద్దకు మసాజ్‌కు వచ్చే వ్యక్తి భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకునే వ్యక్తి.. ఇలా ప్రతి పాత్రనూ డీటెలియింగ్‌గా పరిచయం చేశారు. స్వాతి అక్రమ సంబంధం ఫొటోలు బయట పడిన తర్వాత కానీ, కథలో వేగం పుంజుకోదు. అప్పటి నుంచి పలు కొత్త పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి. ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌, మరోవైపు ఈ హత్య గురించి తెలిసిన వాళ్లు అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో చనిపోవడం.. ఇలా కథ మొత్తం ఒక పాత్రతో ఇంకొక పాత్రను ముడిపెట్టి రాసుకున్న విధానం బాగుంది. కొత్త పాత్రలు సిరీస్‌లో అంతర్భాగంగా వస్తున్నా.. ప్రతిదాని వెనుక అనేక ఉప కథలు, ట్విస్ట్‌లు నవ్వులు పంచుతూనే ఆసక్తిని కలిగిస్తాయి. అవి మిస్సయితే సిరీస్‌ అర్థం కాదు. (killer soup review in telugu) సన్నివేశాలు, ఆ పాత్రలు ప్రవర్తించే తీరు ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచుతాయి. ‘బొంబాయి’ మూవీలోని ‘ఉరికే చిలుక’ హిందీ వెర్షన్‌ పాట సందర్భోచితంగా వాడుకున్న విధానం బాగుంది. దాదాపు ఏడు గంటలకుపైగా సాగే సిరీస్‌లో ఇబ్బంది పెట్టే అంశాలు ఏవైనా ఉన్నాయంటే.. అవి నిడివి, నెమ్మదిగా సాగే కథనం.

ఎవరెలా చేశారంటే?: విలక్షణ నటుడిగా మనోజ్‌ బాజ్‌పాయ్‌కు పేరుంది. వెండితెర నుంచి వెబ్‌సిరీస్‌లకు వచ్చిన నటుల్లో ఆయనది టాప్‌ ప్లేస్‌. ఇందులో ఆయన ప్రభు, ఉమేశ్‌గా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా ఉమేశ్‌ పిళ్లై పాత్రలో ఆయన నటన, డిక్షన్‌ చాలా బాగుంది. ఈ సిరీస్‌లో తన నటనతో అందరినీ కట్టిపడేసింది కొంకణా సేన్‌ శర్మ. (killer soup review in telugu) రెస్టారంట్ పెట్టి సాధికారికంగా బతకాలనే సగటు మహిళగా, భర్త స్థానంలో ప్రియుడిని తీసుకొచ్చి అందరినీ మోసగించే వ్యక్తిగా రెండు పాత్రల్లోనూ వైవిధ్యం చూపించింది. సాయాజీ శిందే, నాజర్‌, లాల్‌ తదితరులు తమ పరిధి మేరకు నటించారు.  ఎడిటింగ్‌ పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా థ్రిల్లింగ్‌గా ఉండేది. 

ఫ్యామిలీతో చూడొచ్చా: ముద్దు, శృంగార సన్నివేశాలు ఉన్నాయి. అసభ్య పదాలు బాగా దొర్లాయి. ఈ సంక్రాంతి సెలవుల్లో ఏదైనా ఆసక్తికర వెబ్‌సిరీస్‌ చూడాలనుకుంటే ఓసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సిరీస్‌ అయితే కాదు.

  • బలాలు
  • + మనోజ్‌ బాజ్‌పాయ్‌, కొంకణా సేన్‌ శర్మ నటన
  • + ప్లాట్‌ పాయింట్‌, ట్విస్ట్‌లు
  • + దర్శకత్వం, సాంకేతిక విభాగం పనితీరు
  • బలహీనతలు
  • - నిడివి
  • - అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
  • చివరిగా: ‘కిల్లర్‌ సూప్‌’.. జస్ట్‌ టేస్టీ అంతే! (killer soup review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని