kohrra review: వెబ్‌ సిరీస్‌ రివ్యూ: కొహరా.. ఎన్నారై గొంతు కోసి చంపింది ఎవరు?

kohrra review: నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘కొహరా’ ఎలా ఉందంటే?

Updated : 22 Jul 2023 17:59 IST

kohrra review; వెబ్‌సిరీస్‌: కొహరా; నటీనటులు: సువీందర్‌ విక్కీ, బరున్‌ సోబ్తి, రేచల్‌ షెల్లీ, అమరీందర్‌ పాల్‌ సింగ్‌, విశాల్‌ హండా, ఇవాంటీ నోవక్‌ తదితరులు; సంగీతం: నరేన్‌ చంద్‌వర్కర్‌, బెనిడిక్ట్‌ టేలర్‌; కథ: గుంజిత్‌ చోప్రా, సుదీప్‌ శర్మ, డిగ్గీ సిసోదియా; దర్శకత్వం: రణ్‌దీప్‌ జా; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

టీవల కాలంలో నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్న జానర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌. ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లను కూడా చూసేస్తున్నారు. ఓటీటీ వేదికలు సైతం అనువాదాలను అందిస్తున్నాయి. అలా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇటీవల స్ట్రీమింగ్‌కు వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌, పోలీస్‌ ప్రొసీడల్‌ సిరీస్‌ ‘కొహరా’. మరి ఈ సిరీస్‌ కథేంటి? విచారణ ఎలా సాగింది?

కథేంటంటే: మరికొన్ని రోజుల్లో పెళ్లి అవుతుందనగా స్టీవ్‌ థిల్లాన్‌ అనే ఎన్నారై కుమారుడు  పాల్‌ థిల్లాన్‌ హత్యకు గురవుతాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతని గొంతుకోసి ఊరి చివర ఉన్న పొలాల్లో పడేస్తారు. మరోవైపు పాల్‌ థిల్లాన్‌ స్నేహితుడు లియామ్‌ (నోవాక్‌) కూడా కనిపించకుండా పోతాడు. దీంతో ఈ కేసు విచారించేందుకు రంగంలోకి దిగుతారు స్థానిక పోలీసులైన  బల్బీర్‌ సింగ్‌ (సువీందర్‌ విక్కీ), అమరపాల్‌ గరుండి (బరున్‌ సోబ్తీ). ఇంతకీ పాల్‌ థిల్లాన్‌ను హత్య చేసింది ఎవరు? కనిపించకుండాపోయిన లియామ్‌ ఏమైపోయాడు? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే:  హంతకుడు ఎవరు?  క్రైమ్‌ థ్రిల్లర్స్‌, పోలీస్‌ ప్రొసీడల్‌ కథల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఈ ఒక్క పాయింట్‌ చుట్టూనే తిరుగుతాయి. కేసు విచారణలో భాగంగా ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్తే నేరానికి పాల్పడిన వ్యక్తి ఎవరన్నది తెలుస్తుంది. ఇలాంటి కథలు ప్రేక్షకుడికి భలే మజాని ఇస్తాయి. అలాంటి అనుభూతినే ఇస్తుంది ‘కొహరా’ వెబ్‌సిరీస్‌. చివరి ఎపిసోడ్‌ వరకూ ప్రేక్షకుడిలో ఆ ఆసక్తిని పెంచడంలో దర్శక-రచయితలు విజయం సాధించారు. కానీ, ఒక్కటే సమస్య నిడివి. పోలీస్‌ ప్రొసీడల్స్‌ పేరుతో సాగే విచారణకు పాత్రల సబ్‌ప్లాట్స్‌ జోడించడంతో వేగంగా సాగాల్సిన కథాగమనం చాలా నెమ్మదిగా సాగుతుంది. పాల్‌ థిల్లాన్‌ను గొంతు కోసి హత్య చేసిన సంఘటనతో సిరీస్‌ను ప్రారంభించిన దర్శకుడు ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో చిక్కుముడిని విప్పుతూ వెళ్లాడు. ఈ క్రమంలోనే మానవ సంబంధాలు.. డ్రగ్స్‌.. సఖ్యతలేని కుటుంబ బంధాలు.. ఆస్తికోసం, గుర్తింపు కోసం పాకులాడే మనుషుల మనస్తత్వాలు.. అక్రమ సంబంధాలు, పిల్లలపై తల్లిదండ్రుల ఆధిపత్యం ఇలా సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను చర్చించే ప్రయత్నం చేశారు.  దీంతో బిగిసడలని ఉత్కంఠతో సాగాల్సిన సిరీస్‌ కాస్తా, నెమ్మదిగా సాగుతుంది. ఆయా సన్నివేశాలు నిడివి పెంచడటానికి ఉపయోగపడ్డాయి తప్ప కథపై పెద్దగా ప్రభావం చూపించలేదు.

దర్శకుడు ‘కొహరా’ను రెండు దృష్టి కోణాల నుంచి మనకు ప్రజెంట్‌ చేశాడు. ఒకటి పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ కాగా, రెండోది కథలోని పాత్రల లోటు పాట్లు. ప్రతి పాత్రకు, బలాలు, బలహీనతలను ఆపాదిస్తూ తీర్చిదిద్దిన విధానం మాత్రం మెప్పిస్తుంది. ఏ మనిషీ అన్నింటిలోనూ పర్‌ఫెక్ట్‌ కాదని, చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే, ‘ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో తెలియదు’ అంటూ ఒక పాత్ర చెబుతుంది. సిరీస్‌ మొత్తం అంతర్లీనంగా ఇదే థీమ్‌తో సాగుతుంది. సబ్‌ ప్లాట్స్‌ వచ్చినప్పుడు కథ నెమ్మదిగా సాగినా,  బల్బీర్‌, గరుండిలు సాగించే ఇన్వెస్టిగేషన్‌ సన్నివేశాలు చకచకా సాగిపోతాయి. హత్య కేసు ఛేదించేందుకు ఒక్కో క్లూను పట్టుకుంటూ వెళ్లే సన్నివేశాలు ఆసక్తిగా సాగుతాయి. పాల్‌ థిల్లాన్‌ను ఎవరు హత్య చేశారు? లియామ్‌ ఏమయ్యాడు? వంటి వాటికి సమాధానం చెప్పే చివరి రెండు ఎపిసోడ్స్‌ మాత్రం చాలా ఉత్కంఠగా సాగుతాయి. అన్ని చిక్కుముడులను విప్పే చివరి  ఎపిసోడ్‌, క్లైమాక్స్‌ ట్విస్ట్‌ సిరీస్‌కే హైలైట్‌.  క్రైమ్‌ థ్రిల్లర్‌ను ఇష్టపడేవారికి ‘కొహరా’ నచ్చుతుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

ఎవరెలా చేశారంటే: పోలీస్‌ అధికారులు బల్బీర్‌ సింగ్‌, అమర్‌ పాల్‌ గరుండి పాత్రల్లో సువీందర్‌ విక్కీ, బరున్‌ సోబ్తీలు చాలా బాగా నటించారు. బల్బీర్‌గా కనిపించిన సువీందర్‌ విక్కీది బరువైన పాత్ర. ఆయన పాత్రలో చాలా పార్శ్వాలు ఉంటాయి. ఒకవైపు పోలీస్‌ ఆఫీసర్‌గా, మరోవైపు భర్త నుంచి విడిపోయిన కుమార్తెకు తండ్రిగా ఆయన నటన బాగుంది. కుమార్తె మనసు అర్థం చేసుకుని, మనసు మార్చుకునే తండ్రిగా నటించే సన్నివేశంలో ఆయన నటన హైలైట్‌. బరున్‌ సోబ్తీ పాత్ర ఇన్వెస్టిగేషన్‌లో ఆద్యంతం హుషారుగా సాగుతుంది.  అక్కడక్కడా నవ్వులు పంచుతుంది. మిగిలిన వాళ్లు తమ పరిధిమేరకు నటించారు. సాంకేతికంగా సిరీస్‌ బాగానే ఉంది. సంగీతం, సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ను పూర్తిగా వదిలేశారు. ఒక్కో ఎపిసోడ్‌ సుమారు 45 నిమిషాలపైనే ఉంటుంది. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌ చాలా చోట్ల సహనానికి పరీక్ష పెడతాయి.  రచయితల్లో ఒకరైన సుదీప్‌ శర్మపై ‘పాతాళ్‌ లోక్‌’ ప్రభావం దీనిపైనా ఉంది. ఒక ఆసక్తికర క్రైమ్‌ థ్రిల్లర్‌ను అందించడంతో దర్శకుడు రణదీప్‌ జా పర్వాలేదనిపించారు. నిడివిపై దృష్టి పెట్టి ఉంటే, ‘కొహరా’ మరో స్థాయిలో ఉండేది.

  • బలాలు
  • + కథ
  • + సువీందర్‌ విక్కీ, బరున్‌ సోబ్తీ
  • + క్లైమాక్స్‌ ట్విస్ట్‌
  • బలహీనతలు
  • - ఎడిటింగ్‌
  • - సుదీర్ఘంగా సాగే ఎపిసోడ్స్‌
  • చివరిగా: నిడివి ఎక్కువైనా మెప్పించే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఈ ‘కొహరా’
  • గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని