Sembi Review: రివ్యూ: సెంబి

Sembi Review: కోవై సరళ కీలక పాత్రలో నటించిన ‘సెంబి’ ఎలా ఉందంటే?

Updated : 06 Feb 2023 16:41 IST

Sembi Review; చిత్రం: సెంబి; నటీనటులు: కోవై సరళ, అశ్విన్‌ కుమార్‌, తంబి రామయ్య, నంజలి సంపత్‌, పాలా కరుపయ్య తదితరులు; సంగీతం: నివాస్‌ కె.ప్రసన్న; సినిమాటోగ్రఫీ: ఎం.జీవాన్‌; ఎడిటింగ్‌: భువన్‌; నిర్మాత: ఆర్‌.రవీంద్రన్‌, అజ్మల్‌ఖాన్‌, రేయా; రచన, దర్శకత్వం: ప్రభు సాల్మన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికలు పలు భాషల్లో డబ్‌ చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అలా ఇటీవల ఓటీటీలో వచ్చిన తమిళ చిత్రమే ‘సెంబి’. హాస్యనటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కోవై సరళ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘సెంబి’ కథేంటి? (Sembi Review) ప్రభు సాల్మన్‌ ఎలా తెరకెక్కించారు.

కథేంటంటే: వీరతల్లి (కోవై సరళ) వృద్ధురాలు. కుమార్తె, అల్లుడు అగ్నిప్రమాదంలో చనిపోతే, మనవరాలు సెంబి బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. అడవిలో ఉండే తేనేను సేకరించి అమ్మడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తుంటుంది. చదువుకుని ఎప్పటికైనా డాక్టర్‌ కావాలన్నది సెంబి ఆశ. ఒకరోజు అడవిలో తేనెను సేకరించి, దుకాణంలో ఇచ్చి రమ్మని మనవరాలికి చెబుతుంది. అమ్మమ్మ ఇచ్చిన తేనెను తీసుకుని వెళ్తుండగా, ముగ్గురు యువకులు సెంబిపై సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. ఆ ముగ్గురు యువకుల్లో ఒకడు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి కుమారుడు కావడంతో పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్‌ అధికారి వీరమ్మ, సెంబిలను హత మార్చడానికి ప్రయత్నిస్తే ఎలా తప్పించుకున్నారు? తన మనవరాలికి న్యాయం జరగడం కోసం వీరమ్మ ఏం చేసింది? (Sembi Review) ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆమెకు ఎలా సాయపడ్డారు? చివరకు నిందితులకు శిక్ష పడిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: లైంగిక వేధింపులు, అత్యాచారం ఇతివృత్తంతో ఇప్పటికే అనేక చిత్రాలు వెండితెరను పలకరించాయి. వాటితో పోలిస్తే కాస్త భిన్నమైన చిత్రమిది. తన మనవరాలికి జరిగిన అన్యాయంపై ఓ వృద్ధురాలు చేసే పోరాటాన్ని ఉత్కంఠగా, భావోద్వేగభరితంగా తెరకెక్కించడంలో దర్శకుడు ప్రభుసాల్మన్‌ విజయం సాధించారు. వీరతల్లి, సెంబీ పాత్రల పరిచయంతో కథను మొదలు పెట్టిన దర్శకుడు నేరుగా అసలు పాయింట్‌కు వచ్చేశాడు. అడవిలో సెంబిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడటం,  ఆ చిన్నారికి జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆస్పత్రిలో వీరతల్లి పడే మనోవేదన సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని  కంటపడి పెట్టిస్తుంది. కేసును తప్పుదోవ పట్టించిన పోలీసు అధికారిపై వీరతల్లి దాడి చేయడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. (Sembi Review) అత్యాచార ఘటనను వదిలేసి వీరతల్లి, ఆమె మనవరాలిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారి నుంచి ఎలా తప్పించుకుంటుందా? అన్న ఉత్కంఠ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది.

ఇక్కడి నుంచే కథ మొత్తం బస్సులోనే సాగుతుంది. ఆయా సన్నివేశాలను చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అత్యాచార ఘటనపై బస్సులో ఉన్న ప్రయాణికులు స్పందించే తీరుతో నేటి లోకం పోకడను ఎత్తి చూపాడు దర్శకుడు. అసలు వదంతులు ఎలా వ్యాప్తిస్తాయి? వాటిని ఎలా ప్రచారం చేస్తారు? వాటికి అదనపు వివరణలు తోడై అసలు విషయం ఎలా పక్కదారి పడుతుంది? తదితర విషయాలను ఉదాహరణలతో చెప్పిన తీరు బాగుంది. పోలీసులు, అత్యాచార నిందితులు పంపే రౌడీల నుంచి వీరతల్లి, సెంబీలను బస్సులోని వారు ఎలా కాపాడారన్న సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. (Sembi Review) అలాగే, సెంబిపై అత్యాచారం జరగిందడానికి ఉన్న ఆధారాలను సేకరించే తీరూ మెప్పిస్తుంది. ‘మనిషికి మరో మనిషే సాయం చేస్తాడు’ అన్న సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు.  పతాక సన్నివేశాలు అలరిస్తాయి. ఓటీటీలో ఏదైనా ఆసక్తికర సినిమా చూడాలంటే, ‘సెంబి’ ఫస్ట్‌ ఛాయిస్‌గా పెట్టుకోవచ్చు.

ఎవరెలా చేశారంటే: హాస్యనటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు కోవై సరళ సుపరిచితురాలు. గతంలో ఆమె నటించిన అనేక చిత్రాల్లో తనదైన నటన, డైలాగ్‌ డెలివరీతో నవ్వులు పంచారు. కానీ, తొలిసారి ‘సెంబీ’లో తన నటనతో ప్రేక్షకుడితో కంటతడి పెట్టించారు. వృద్ధురాలు వీరతల్లి పాత్రలో ఇప్పటివరకూ చూడని కోవై సరళను చూస్తారు. మనవరాలికి జరిగిన అన్యాయం తెలిసి, ఆమె పడే మనోవేదన సన్నివేశంలో కోవై నటన కట్టిపడేస్తుంది. ఇప్పటివరకూ ఆమె నటించిన చిత్రాలన్నీ ఒకెత్తయితే, వీరతల్లిగా ఆమె నటన టాప్‌ ఆఫ్‌ ది టాప్‌. సెంబి పాత్రలో నటించిన చిన్నారి కూడా చాలా బాగా నటించింది. లాయర్‌గా నటించిన అశ్విన్‌ కుమార్‌, బస్సు ఓనర్‌గా  తంబి రామయ్యల నటన అలరిస్తుంది. ఎం.జీవన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. కొడైకెనాల్‌, ఊటీ అందాలను చక్కగా చూపించారు. ద్వితీయార్ధం మొత్తం బస్సులోనే సాగుతుంది.(Sembi Review) ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. భువన్‌ ఎడిటింగ్‌ ఓకే. అక్కడక్కడా సన్నివేశాలకు కత్తెర వేయవచ్చు. నివాస్‌ కె.ప్రసన్న నేపథ్య సంగీతం బాగుంది. పాటలన్నీ కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్రభుసాల్మన్‌ రాసుకున్న కథ, తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. బాలికలపై జరిగే అత్యాచార ఘటన, పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన తీరును మెచ్చుకోవచ్చు. (Sembi Review)  నేటి రాజకీయ పరిస్థితులను కూడా సెటైరికల్‌గా ప్రశ్నించాడు. ఓ రాజకీయ నాయకుడు తనకు ఓటు వేస్తే సెంబిని డాక్టర్‌ను చేస్తానని వీరతల్లికి చెబుతాడు. అప్పుడు సెంబి ‘అమ్మమ్మ నువ్వు ఆ మావయ్యకే ఓటు వెయ్‌’ అని చెబితే, ‘నేను ఎవరికి ఓటు వేసినా నువ్వు డాక్టర్‌ కాలేవు. బాగా చదువుకుంటేనే అవుతావు. వాళ్లు అలాగే చెబుతారు’ అంటూ నేటి రాజకీయ నాయకుల హామీలపై చదువురాని గిరిజన వృద్ధురాలికి ఎలాంటి అవగాహన ఉందో చక్కగా చూపించారు.

బలాలు: + కోవై సరళ నటన; + దర్శకత్వం; + ద్వితీయార్ధం

బలహీనతలు: - పాటలు; - అక్కడక్కడా కాస్త సాగదీతగా అనిపించే సన్నివేశాలు

చివరిగా: ‘సెంబి’.. మీరెప్పుడూ చూడని కోవై సరళను చూస్తారు! (Sembi Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని