Panchathantram Review: రివ్యూ: పంచతంత్రం
బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన ‘పంచతంత్రం’ ఎలా ఉందంటే..?
Panchathantram Review చిత్రం: పంచతంత్రం; నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ, తదితరులు; కూర్పు: గ్యారీ బీహెచ్; ఛాయాగ్రహణం: రాజ్ కె.నల్లి; పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీత దర్శకులు: ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్; నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు; సంస్థ: టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్; రచన, దర్శకత్వం: హర్ష పులిపాక; విడుదల: 9-12-2022
కొన్ని కథల్ని కలిపి సినిమాలు చేయడం ఓ పద్ధతి. దాన్ని సినిమా భాషలో ఆంథాలజీ అని పిలుస్తుంటారు. ఇది ఈ మధ్య ఓ ట్రెండ్‌గా మారింది. ఓటీటీ మాధ్యమాల్లో ఈ తరహా ప్రయత్నాలు తరచూ జరుగుతుంటాయి. వెండితెరపై మాత్రం అప్పుడప్పడూ వస్తుంటాయి. తెలుగులోనూ ‘పంచతంత్రం’ పేరుతో ఓ ఆంథాలజీని రూపొందించారు. బ్రహ్మానందం, స్వాతి తదితర ప్రధాన నటీనటులు ఇందులో భాగం కావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.
కథేంటంటే: కెరీర్‌ని ఇరవై యేళ్ల వయసులోనే కాదు.. అరవైల్లోనూ మొదలు పెట్టొచ్చనే ఆలోచన ఉన్న వ్యక్తి వేద వ్యాస్ మూర్తి (బ్రహ్మానందం). కూతురు రోషిణి (స్వాతి)తో కలిసి జీవిస్తుంటాడు. రిటైర్మెంట్ తర్వాత స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీలకు వెళతాడు. ఎంత పోటీ ఉన్నా సరే, తన అనుభవాన్నంతా రంగరించి కథలు చెప్పడం మొదలుపెడతాడు. మరి ఆ పోటీల్లో నెగ్గారా? ఆ కథల్లో విహారి (నరేష్ అగస్త్య) - సుభాష్ (రాహుల్ విజయ్), లేఖ (శివాత్మిక రాజశేఖర్), రామనాథం (సముద్రఖని), ఆయన భార్య మైత్రి (దివ్యవాణి), శేఖర్ (వికాస్), ఆయన భార్య దేవి (దివ్య శ్రీపాద), చిత్ర అలియాస్ లియా (స్వాతి) జీవితాలు ఏం చెప్పాయో తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే: అన్నీ మన కథలే అనిపించే ఐదు కథల సమాహారం ఈ చిత్రం. నిన్ను కన్నవాళ్లతో నీకు, నీ జీవిత భాగస్వామితో నీకు, నీ ప్రపంచంతో నీకు, నువ్వు కన్నవాళ్లతో నీకు, నీతో నీకుండే కథలే అని ట్రైలర్‌లో చెప్పినట్టుగా ఎక్కడో ఒక చోట ఎవరి జీవితాల్ని వాళ్లకు గుర్తు చేసే సాగే కథలే ఇందులో ఉంటాయి. వేదవ్యాస్ ప్రపంచం పరిచయం అయ్యాక విహారి కథతో పంచతంత్రం కథలు మొదలవుతాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆ యువకుడి సంఘర్షణని ఈ కథతో ఆవిష్కరించారు. ఆరంభ సన్నివేశాలు నత్తనడక సాగుతున్నట్టు అనిపించినా, మిగతా కథల విషయంలో మాత్రం వేగం కనిపించడంతోపాటు భావోద్వేగాలు కూడా బాగా పండాయి. సుభాష్, లేఖ పెళ్లి చూపుల కథ అందంగా, మనసుల్ని హత్తుకునేలా సాగుతుంది. క్రీడలతో పెళ్లి చూపులని ముడిపెడుతూ రాసుకున్న సంభాషణలతోపాటు, సుభాష్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. తన బిడ్డల భవిష్యత్తు గురించి కన్నవాళ్లు ఎలా మానసికంగా సతమతమవుతుంటారో, వాళ్ల జీవితాల్ని అది ఎంతగా ప్రభావితం చేస్తుంటుందో మూడో కథతో చెప్పే ప్రయత్నం చేశారు. వాసన వాసన అంటూ నడిచే కొన్ని సన్నివేశాలు రిపీటెడ్‌గా అనిపించినా ఈ కథ థ్రిల్‌తోపాటు, భావోద్వేగాల్నీ పంచుతుంది. విరామ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. నాలుగో కథలో ఆవిష్కరించిన శేఖర్, దేవిల ప్రపంచం మరింత హృద్యంగా అనిపిస్తుంది. కష్టాలు ఎన్నైనా రానీ.. వాటిని పంచుకోవాలి కానీ, బంధాల్ని తుంచుకోకూడదనే విషయాన్ని అందంగా, మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాలతో ఆవిష్కరించారు. ఐదో కథ చిత్ర అలియాస్ లియా జీవితం నేపథ్యంలో సాగుతుంది. వేదవ్యాస్ నా కూతురు లాంటి కూతురు కథ అంటూ ఈ కథని చెప్పడం మొదలుపెడతాడు. ఈ కథలో చిన్నపాప, ఉత్తేజ్ పాత్ర కీలకం. భావోద్వేగాలు, డ్రామా, రొమాంటిక్ నేపథ్యం.. ఇలా అన్నీ కలగలిశాయి. తొలి కథ మినహా మిగిలిన ప్రతి కథా ఓ ప్రత్యేకమైన అనుభూతి, అనుభవాన్నీ పంచుతుంది. రుచి, వాసన, దృశ్యం, ధ్వని, స్పర్శతో ముడిపెడుతూ తీసిన ఈ ఐదు కథల్ని వేదవ్యాస్ జీవితంతోనూ ముడిపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే: బ్రహ్మానందం అనగానే నవ్వుల్ని గుర్తు చేసుకుంటారు ప్రేక్షకులు. కానీ ఇందులోని పాత్ర అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. వేదవ్యాస్ పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. స్వాతి రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తుంది. చిత్ర పాత్రపై ఆమె తనదైన ప్రభావం చూపించారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ జోడీ నటన, వారి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దివ్య శ్రీపాద - వికాస్, సముద్రఖని - దివ్యవాణి జోడీ, ఉత్తేజ్ నటన ఆకట్టుకుంటుంది. నరేష్ అగస్త్య, శ్రీవిద్య, ఆదర్శ్ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంగీతం, కెమెరా విభాగాల పనితీరు ఆకట్టుకుంటుంది. దర్శకుడు హర్ష పులిపాక పంచతంత్రం కథల్ని ఎంత పరిణతితో రాసుకున్నారో, రాసుకున్న ఆ కథల్ని అంతే స్పష్టంగా తెరపైకి తీసుకొచ్చారు. కాకపోతే కొన్ని కథల్లో డ్రామా సరిపోలేదు. మరీ సున్నితత్వంతో కూడిన ఆయా కథల్లో భావోద్వేగాల మోతాదు చాలలేదనిపిస్తుంది. ఇలాంటి చిత్రాల్ని నిర్మించాలంటే అభిరుచి కావాలి. నిర్మాతల అభిరుచి మెచ్చుకోదగ్గది.
బలాలు
1. హృద్యంగా సాగే కొన్ని కథలు, 2.భావోద్వేగాలు, 3. నటీనటులు
బలహీనతలు
1.సాగదీతగా కొన్ని సన్నివేశాలు, 2.తొలి కథ
చివరిగా: అనుభూతులను పంచే ‘పంచతంత్రం’ కథలు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha: ఏఎస్సై కాల్పుల ఘటన.. ఒడిశా ఆరోగ్య మంత్రి కన్నుమూత
-
World News
Pakistan: పౌరులకు పాకిస్థాన్ షాక్.. పెట్రోల్‌పై ఒకేసారి రూ.35 పెంపు!
-
Sports News
U 19 World Cup: అండర్ - 19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా టీమ్ఇండియా
-
General News
Ts News: గుజరాత్లో పంచాయతీ సర్వీస్ పరీక్ష పేపర్ లీక్.. హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్టు
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Babar: విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్