తొలి సినిమా ఫ్లాప్‌.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్‌ కెరీర్‌ To పొలిటికల్‌ ఎంట్రీ.. విజయ్‌ లైఫ్‌ జర్నీ ఇదే!

Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్‌ జర్నీ ఎలా సాగింది?

Updated : 02 Feb 2024 15:57 IST

‘దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ సరిగ్గా 90 రోజుల క్రితం నటుడు విజయ్‌ (Vijay) తన అభిమానులను ఉద్దేశించి అన్న మాటలివి. ‘లియో’ విజయోత్సవ సభలో వేల సంఖ్యలో తరలి వచ్చిన అభిమానగణాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నాపై ఇంత అభిమానం చూపుతున్న మీకు ఏదైనా తప్పకుండా చేయాలనుంది. చేస్తా. మీ కాలికి చెప్పులా ఉండటానికి కూడా వెనకాడను. ఇప్పుడేం జరిగినా పట్టించుకోకుండా అందరూ ఓపిక పట్టండి. విజయాన్ని అందుకోవచ్చు అన్నారు.

అలాగే ఓ పిట్టకథ కూడా చెప్పారు. ‘ఇద్దరు వేటగాళ్లు అడవిలోకి వెళ్లారు. ఒకడు తన వద్ద ఉన్న బాణంతో కుందేలును గురి చూసి కొట్టి పట్టుకున్నాడు. ఇంకొకడు ఏనుగును లక్ష్యంగా చేసుకుని తన వద్ద ఉన్న ఆయుధాన్ని విసిరాడు. గురి తప్పింది. ఉత్త చేతులతో ఇంటికి తిరిగొచ్చాడు. నా దృష్టిలో కుందేలును పట్టుకున్న వ్యక్తి విజయం సాధించినట్టు కాదు. ఏనుగులాంటి పెద్ద లక్ష్యాన్ని ఛేదించాలని అనుకున్న వ్యక్తే గొప్పవాడు. అతను ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పొందుతాడంటూ’ కథ వినిపించాడు. ఈ కథతో ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన లక్ష్యం రాజకీయం అనే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడమే. అనుకున్నట్టుగానే తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ అంటూ ప్రకటించారు. 2026లో తమిళనాట శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదపబోతున్నారు. భారత రాజకీయాల్లో సినీ నటులు క్రియాశీలక పాత్ర పోషించడం కొత్తేమీ కాకపోయినా, 49ఏళ్ల విజయ్‌ కాస్త ముందుగానే ప్రజా జీవనంలోకి అడుగుపెట్టడం గమనార్హం.

కష్టాలను చూసిన కుటుంబమే

విజయ్‌ తల్లి శోభ గాయని, తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ దర్శకుడు. తొలినాళ్లలో కనీసం బాత్రూమ్‌ కూడా లేని చిన్న గదిలో విజయ్ తల్లిదండ్రులు నివాసం ఉండేవారు. అతడి తల్లి కచేరీలకు వెళ్లి డబ్బులు తెచ్చిస్తే పూట గడిచే పరిస్థితి.  విజయ్‌కి ఏడేళ్లు వచ్చేవరకు ఆర్థికంగా ఇలా సతమతమవుతూనే ఉండేది ఆ కుటుంబం. ఆ తర్వాతే దంపతులిద్దరూ విజయ్‌కాంత్‌తో ‘చట్టం ఒరు ఇరుట్టరై’ సినిమా తీశారు. తెలుగులో చిరంజీవి హీరోగా ‘చట్టానికి కళ్లులేవు’ ఇతర భాషల్లోనూ దాన్ని రీమేక్‌ చేశారు. అన్నిచోట్లా అది బంపర్‌హిట్టు సాధించడంతో ఆ కుటుంబం నిలదొక్కుకుంది.

డాక్టర్‌ను చేద్దామనుకుంటే..

తల్లిదండ్రులకు సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నా, విజయ్‌కు అవకాశాలేమీ సులభంగా రాలేదు. చిన్నప్పుడు చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్‌ డాక్టర్‌ అవుదామని అనుకున్నాడు. తండ్రి కూడా ఆ దిశగా  ప్రోత్సహించాడు. సరిగ్గా ఇంటర్‌ చదువుతున్న సమయంలో విజయ్‌ దృష్టి సినిమాల వైపు మళ్లింది. అయితే, నటుడు లేదా దర్శకుడిని అవుతానని భీష్మించుకుని కూర్చొన్నాడు. ఈ విషయం విన్న విజయ్‌ తండ్రి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ‘నువ్వు దారి తప్పుతున్నావ్‌… ఇక బాగుపడవ్‌. నా కళ్లముందు ఉండొద్దు!’ అన్నాడు. అంతే… ఇల్లు విడిచి వచ్చేశాడు ‘అమ్మానాన్నా నేను వెళ్లిపోతున్నా… దయచేసి వెతక్కండి!’ అని లెటర్‌ రాసిపెట్టి వెళ్లిపోయాడు. ఎంత కోపం ఉన్నా… ఒక్కగానొక్క కొడుకు అలా వెళ్లిపోయాడనగానే తల్లిదండ్రులిద్దరూ తల్లడిల్లిపోయారు. రోజంతా వెతికారు. చంద్రశేఖర్‌కి అనుమానం వచ్చి, వాళ్లకి దగ్గర్లోని ఓ థియేటర్‌కి వెళ్లగా, విజయ్‌ అక్కడే కనిపించాడు.  ఉదయం నుంచి రాత్రి వరకూ ఆ థియేటర్‌లోనే ప్రదర్శిస్తున్న సినిమాను చూస్తూ అక్కడే ఉండిపోయాడని అర్థమైంది.

ఇంటికి తీసుకొచ్చి ‘నీకు సినిమా అవకాశం ఇప్పిస్తా కానీ… కనీసం ఏదైనా డిగ్రీ చెయ్‌!’ అని నచ్చచెప్పాడు. ఏదో డిగ్రీ ఎందుకని సినిమాల గురించి నేర్పించే ‘విజువల్‌ కమ్యూనికేషన్‌’లోనే చేరాడు విజయ్‌. అది పూర్తయిన వెంటనే, తన పోర్ట్‌ఫోలియో పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. మరోవైపు, అతనికి తెలియకుండా, తండ్రి చంద్రశేఖర్‌ కూడా తన ప్రయత్నాలు తాను చేయడం మొదలుపెట్టాడు. ‘నేను పక్కా కమర్షియల్‌ డైరెక్టర్‌ని. కానీ మావాణ్ణి నా తరహా సినిమాల్లో కాకుండా ఓ మంచి క్లాసిక్‌ సినిమా ద్వారా పరిచయం చేయాలనుకున్నాను’ అంటూ నాటి పేరున్న దర్శకులందరికీ విజయ్‌ ఫొటో చూపించి ‘నేను కొంత డబ్బు పెడతానండీ… మీరు సినిమా తీయండి!’ అనేవారట. ‘సారీ! మీవాడు హీరో ఏంటండీ, అసలు నటుడిగానే పనికిరాడు… బండమొహం వాడిది!’ అని మొహంమీదే చెప్పేశారట.

తొలి సినిమానే ఫ్లాప్‌...

ఎంత మంది దర్శకులను కలిసినా, ఎన్ని నిర్మాణ సంస్థల గడప తొక్కినా ఒక్కరు కూడా ఛాన్స్‌ ఇవ్వలేదు. దీంతో తండ్రీకొడుకులిద్దరూ  ఏదైతే అదవుతుందని ఓ పెద్ద సాహసానికి దిగారు. అప్పు తెచ్చి రూ.60 లక్షలతో విజయ్‌ని హీరోగా పెట్టి ‘నాళయ తీర్పు’ అనే సినిమా తీశారు. పన్నెండేళ్ల ఎం.ఎం.శ్రీలేఖని సంగీత దర్శకురాలిగా పరిచయం చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించిన ఆ చిత్రంలోని పాటలు సూపర్‌ హిట్టయ్యాయి కానీ… సినిమా పెద్ద ఫ్లాపయింది.  పత్రికలన్నీ విజయ్‌ నటనని చీల్చిచెండాడాయి. ‘తండ్రి దర్శకుడైనంత మాత్రాన హీరోగా వచ్చేయాలా?’ అంటూ ఏకిపారేశాయి. సరిగ్గా క్రిస్మస్‌ రోజు ఆ రివ్యూలు వచ్చాయి. ఆ రాతల్ని చూసి కొత్త బట్టలన్నీ విసిరేసి భోరుమని ఏడుస్తూ కూర్చున్నాడు విజయ్‌. దాదాపు రెండు నెలలపాటు ఫ్రెండ్స్‌నీ కలవలేదు.  అయితే, ఆ స్నేహితులే విజయ్‌కు అండగా నిలబడ్డారు. ‘పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలిరా విజయ్‌! ఇవే పత్రికలు రేపు నీ గురించి ఆహా.. ఓహో అని రాసేలా చేయాలి..!’ అని కసిని పెంచారు.  ఈసారి ఇల్లు తనఖాపెట్టి మరి ఓ సినిమా తీయడం మొదలుపెట్టారు.

ఆదుకున్న ‘కెప్టెన్‌’

తన తండ్రి తీసిన సినిమాతో స్టార్‌ అయిన కెప్టెన్‌ విజయ్‌కాంత్‌.. పైసా కూడా తీసుకోకుండా అతిథి పాత్ర చేయడానికి ఒప్పుకొన్నారు. అలా సెందూరపాండి(తెలుగులో బొబ్బిలి రాయుడు) అనే సినిమా తీశారు. బి,సి, సెంటర్స్‌లో ఆ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది.  (vijay life journey) మొదటి సినిమాతో కోల్పోయిన ఆస్తులు తిరిగొచ్చేశాయి. ప్రతిసారీ విజయ్‌కాంతో, రజనీకాంతో వచ్చి ఆదుకోరు కదా! తనని మాత్రమే చూసి, ప్రేక్షకులెలా థియేటర్‌లకి రావాలి?’ అన్న ప్రశ్న విజయ్‌లో మొదలైంది. దానికి సమాధానంగానే డాన్స్‌పైన కసరత్తు మొదలుపెట్టాడు. కరాటే నేర్చుకున్నాడు. పగలూ, రాత్రీ ఇంకే ధ్యాసా లేకుండా సాధన చేశాడు.  ఆ తర్వాత సరికొత్త విజయ్‌గా ‘రసిగన్‌’ అనే సినిమా చేశాడు.

ఒకప్పుడు బండమొహంగాడు అన్న ప్రేక్షకులే ‘అరె… వీడు డ్యాన్సు భలే చేస్తున్నాడ్రా, ఫైట్సు అదరగొడుతున్నాడ్రా!’ అనడం మొదలుపెట్టారు. ఆ సినిమా ‘సిల్వర్‌ జూబ్లీ’ చేసుకుని, సూపర్‌హిట్ల పరంపరకి ప్రారంభంగా మారింది. రెండేళ్లపాటు వరస మాస్‌ సినిమాల తర్వాత ‘పూవే ఉనక్కాగ’(తెలుగులో శుభాకాంక్షలు) చిత్రంతో క్లాస్‌ ప్రేక్షకుల్నీ కట్టిపడేశాడు. మరో మూడేళ్ల తర్వాత మలయాళ దర్శకుడు ఫాజిల్‌ తీసిన ‘కాదలుక్కు మరియాదై’తో స్టార్‌ స్టేటస్‌ అందుకున్నాడు. ఇక వరసగా ‘ఖుషీ’, గిల్లీ (తెలుగులో ఒక్కడు), పోక్కిరి (తెలుగు రీమేక్‌) వంటివి తమిళనాడు లోనే కాదు కేరళలోనూ అతన్ని స్టార్‌ని చేశాయి.

అభిమానితో పెళ్లి..

విజయ్‌ తన అభిమాని సంగీతనే పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జేసన్‌ యూట్యూబ్‌లో వీడియో జాకీగా కనిపిస్తుంటాడు. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు విజయ్‌. ఆ పాప బ్యాడ్మింటన్‌లో రాణిస్తోంది. ఇదిలా ఉంటే ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’(విజయ్‌ ప్రజా సంఘం) పేరుతో గత 15 ఏళ్లుగా విద్య, వైద్యరంగాల్లో సేవలందిస్తున్నాడు.

ఐదేళ్లు నో హిట్‌..!

రంగుల ప్రపంచం అన్నిసార్లు వెలుగులనే పంచదు. చీకట్లనూ చూడాల్సి వస్తుంది. ఏ స్థాయి హీరోకైనా సరే వరసగా ఒకట్రెండు ఫ్లాపులొస్తేనే తట్టుకోవడం కష్టం. చిత్ర పరిశ్రమ ఎవరికైనా పరుగు పందెం లాంటిది. ఏమాత్రం వేగం తగ్గినా కొత్త వాళ్లు ముందుకు వెళ్లిపోతారు. కొన్నాళ్లకు ప్రేక్షకులు కూడా మర్చిపోతారు. అలాంటి పరిస్థితులున్న నేపథ్యంలో విజయ్‌కి వరసగా ఐదేళ్లపాటు ఏడు సినిమాలు ఫెయిలయ్యాయి. కానీ అతడు కుంగిపోలేదు. కసిగా ఓ మంచి అవకాశం కోసం చూస్తూ వచ్చాడు. ఆ అవకాశం శంకర్‌ చిత్రం ‘స్నేహితుడు’ రూపంలో వచ్చింది.

ఆ తర్వాత వచ్చిన ‘తుపాకి’ తెలుగులోనూ హిట్టు కొట్టింది. ‘అదిరింది’, ‘సర్కార్‌’, ‘విజిల్‌’, ‘మాస్టర్‌’ వంటి సినిమాలు విజయ్‌ని ప్రేక్షకులకు మరింతగా చేరువ చేశాయి.  ఆ తర్వాత ‘బీస్ట్‌’, ‘వారిసు’ పర్వాలేదనిపించగా, ‘లియో’ ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ మూవీ చేస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ క్రమంలో ఆయన ‘తమిళగ వెట్రి కళగం’ (Tamilaga Vettri Kazhagam) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి, మరోసారి వార్తల్లో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని