lust stories 2 review: ఆంథాలజీ: లస్ట్‌ స్టోరీస్‌2

lust stories 2 review: నాలుగు కథల సమాహారం ‘లస్ట్‌స్టోరీస్‌2’ ఎలా ఉంది?

Updated : 25 Jun 2024 16:13 IST

lust stories 2 review; ఆంథాలజీ: లస్ట్‌ స్టోరీస్‌2; నటీనటులు: మృణాల్‌ ఠాకూర్‌, తమన్నా, కాజోల్‌, విజయ్‌ వర్మ, తిలోత్తమ షోమీ, అంగద్‌ బేడి, కుముద్‌ మిశ్రా, అనుష్క కౌశిక్‌, నీనా గుప్త, అమృత సుభాస్‌, అంజుమన్‌ సక్సేనా; నిర్మాత: ఆషి దువా, రొనీ స్క్రూవాలా; దర్శకత్వం: ఆర్‌.బాల్కి, సుజయ్‌ ఘోష్‌, అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ, కొంకణ్‌ సేన్‌ శర్మ; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

2018లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన ఆంథాలజీ సిరీస్‌.. ‘లస్ట్‌ స్టోరీస్‌’ (lust stories). దానికి కొనసాగింపుగా తెరకెక్కిన తాజాగా వచ్చిన ఆంథాలజీ సిరీస్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’. తమన్నా, మృణాల్‌ ఠాకూర్‌, కాజోల్‌ వంటి వారు నటించడం, ప్రచార చిత్రాలు యువతను ఆకర్షించేలా ఉండటంతో ఈ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది. మరి గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఏయే అంశాలను ప్రస్తావించారు?

ముచ్చటైన జంట

కథేంటంటే: వేద (మృణాల్‌ ఠాకూర్‌) అర్జున్‌ (అంగద్‌ బేడీ) ఇరువురు వివాహం చేసుకోవాలని అనుకుంటారు. ఇరు కుటుంబాలు కలిసి వీరి వివాహం గురించి చర్చిస్తుంటారు. అదే సమయంలో వేద బామ్మ (నీనా గుప్త) మధ్యలో కలగజేసుకుని యువ జంట జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లి ముందు శృంగార జీవితాన్ని రుచి చూడాలని సలహా ఇస్తుంది. ఒకరి కోసం ఒకరు జీవితాంతం కలిసి ఉంటారా? లేదా? అన్నది ఆ అనుభవం ద్వారానే తెలుస్తుందని చెబుతుంది. బామ్మ చెప్పిన మాటలు విని వేద, అర్జున్‌ ఏం చేశారు? ఇరువురి కుటుంబాలు తీసుకున్న నిర్ణయం ఏంటి? వీరి వివాహం జరిగిందా? అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే: ‘పెళ్లికి ముందు శృంగారం’ అనేది చర్చించడానికి కూడా ఒక సంక్లిష్టమైన అంశం.  దాని చుట్టూ దర్శకుడు ఆర్‌.బాల్కి ఈ కథను తీర్చిదిద్ది, సరికొత్త ప్రశ్నలు లేవనెత్తారు. పాశ్చాత్య సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎపిసోడ్‌ను తెరకెక్కించారు. నిజ జీవితంలో ముఖ్యంగా భారతీయ సమాజంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన్నది అందరికీ తెలుసు. ప్రపంచ దేశాలు ఇప్పటికీ  భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవిస్తున్నాయంటే అందుకు కారణం మనం ఏర్పరుచుకున్న విలువలు, కట్టుబాట్లు. కానీ, ఆధునిక పోకడలు ఇలాగే ఉన్నాయని చూపించే ప్రయత్నం చేశారు. ఎపిసోడ్‌ మొత్తం వేద బామ్మ నీనా గుప్త చుట్టూనే తిరుగుతుంది. ఆవిడ సలహాలు సూచనల మేరకు పాత్రలు ప్రవర్తిస్తాయి. ఇక నటీనటుల పరంగా మృణాల్‌ ఠాకూర్‌ అందంగా కనిపించింది. అంగద్‌ బేడీ, హేమంత్‌ ఖేర్‌, కను ప్రియ పండిత్‌లు తమ పరిధి మేరకు నటించారు. పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. యువతను ఆకర్షించేలా సీన్స్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది.


అద్దం

కథేంటంటే: ఇషిత (తిలోత్తమ షోమీ) ముంబయిలో ఉద్యోగం చేస్తూ ఒంటరిగా నివసిస్తుంటుంది. ఒక రోజు మైగ్రేన్‌ కారణంగా తీవ్రమైన తలనొప్పి రావడంతో కాస్త ముందుగానే ఇంటికి వచ్చేస్తుంది. అదే సమయంలో ఇంటి పనిమనిషి సీమ (అమృత సుభాష్‌) తన భర్తతో కలిసి శృంగారం చేస్తుండగా చూసి షాకవుతుంది. ఆ తర్వాత ఇషిత ఏం చేసింది? ఇంటి పనిమనిషిపై ఎలాంటి చర్యలు తీసుకుంది? అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే: కొంకణ్‌ సేన్‌ శర్మ ఈ ఎపిసోడ్‌ను ఒక శృంగార నవలలా తీర్చిదిద్దారు. పాత్రలను డిజైన్‌ చేసుకున్న విధానం వాటిని తెరపై చూపించిన తీరు నేటి సమాజంలో ఒంటరి మహిళల జీవితాలను స్పృశించే ప్రయత్నం చేశారు. అయితే, నిడివి ఈ ఎపిసోడ్‌కు కాస్త అడ్డంకి. అలాగే, భర్తతో కలిసి పని మనిషి చేస్తున్న శృంగార సన్నివేశాలను పదే పదే చూపించటం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఒంటరి మహిళగా తిలోత్తమ, పనిమనిషిగా అమృత సుభాష్‌ తమపాత్రకు న్యాయం చేశారు. అసలు విషయం బయటపడిన తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా మారిపోతాయి? ఆ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఎలా ప్రవర్తిస్తారు? వంటి వాటిని చెప్పిన తీరు మాత్రం బాగుంది. మళ్లీ వాళ్లిద్దరూ కలిసినప్పుడు పాత గొడవలు మర్చిపోయి ఎలా ప్రవర్తిస్తారన్న కూడా బాగా చూపించారు. మానవుల ప్రవర్తనా తీరును ఆ రెండు పాత్రల్లో చూపించిన విధానం మెప్పిస్తుంది.


మాజీ ప్రేయసితో శృంగారం..

కథేంటంటే: విజయ్‌ చౌహాన్‌ (విజయ్‌ వర్మ) స్త్రీలోలుడు. అనిత (ముక్తి మోహన్‌)ను వివాహం చేసుకుంటాడు. ఇద్దరు పిల్లలు. ఒక రోజు తన ప్రియురాలు నిషా (జెన్నీఫర్‌)తో ఫోన్‌లో మాట్లాడుతూ కారులో వెళ్తుండగా, చెట్టును ఢీకొంటాడు. దీంతో కారు బ్రేక్‌డౌన్‌ అవుతుంది. దీంతో కారును అక్కడే వదిలేసి మెకానిక్‌ కోసం పక్కనే ఉన్న ఊళ్లోకి వెళ్తాడు. అక్కడే అతడికి తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. అప్పుడు విజయ్‌ ఏం చేశాడు? ఇంతకీ శాంతితో ఎలా విడిపోయాడు? తెలియాలంటే ఈ ఎపిసోడ్‌ చూడాల్సిందే.

ఎలా ఉందంటే: సుజయ్‌ ఘోష్‌ దీన్ని ఒక మిస్టీరియస్‌ కథగా తీర్చిదిద్దారు. ఎపిసోడ్‌ పూర్తయిన ప్రేక్షకుడికి ఒక చిన్న కన్ఫ్యూజన్‌ ఉంటుంది. గతంలో ఏం జరిగిందో స్పష్టంగా వివరించలేదు. అదొక మిస్టరీగా వదిలేశారు.  అయితే, తమన్నా, విజయ్‌ల మధ్య సన్నివేశాలు ఆసక్తిగా సాగుతాయి. ఆద్యంతం చీరకట్టులో తమన్నా అందంగా కనిపించింది. తన కెరీర్‌లో నో ముద్దు పాలసీని ఈ సిరీస్‌తో బ్రేక్‌ చేసినట్లు పదే పదే చెప్పడం కేవలం ప్రచారం కోసమేనని ఎపిసోడ్‌ చూస్తే అర్థమవుతోంది. ఆ సన్నివేశం కూడా చాలా సాధారణంగా ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లో చివరి సన్నివేశం చూసి కాస్త షాక్‌ అవుతాం.


బొద్దింక

కథేంటంటే:  బిజోక్‌పూర్‌లో రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి (కుముద్‌ మిశ్రా) తన భార్య దేవయాని (కాజోల్‌) కొడుకు అంకుర్‌ (జీషాన్‌ నదఫ్‌)తో కలిసి ఉంటాడు. ఇంట్లో అందమైన భార్య ఉన్నా, కుముద్‌ మనసు ఇంటి పనిమనిషి బిటోరి (పాయల్‌ పాండే) పైనే ఉంటుంది. ఒక రోజు బిటోరి స్థానంలో రేఖ (అనుష్క కౌశిక్‌) ఇంట్లో పనిచేయడానికి వస్తుంది. ఆమెపై కూడా కుముదు వాంఛను కలిగి ఉంటాడు. ఒకరోజు ఆమెను ఒప్పించి శృంగారంలో పాల్గొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయాలన్నీ భార్య దేవయానికి తెలుసా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్‌  చూడాల్సిందే!

ఎలా ఉందంటే: రవీంద్రనాథ్‌ శర్మ ఈ ఎపిసోడ్‌ను సాగదీతగా తెరకెక్కించారు. పై మూడు కథలతో పోలిస్తే, స్క్రీన్‌ప్లే చాలా నెమ్మదిగా సాగుతుంది. అసలు ఏం జరుగుతుంది? అన్నది చివరిలో కానీ తెలియదు.  అయితే, ట్విస్ట్‌ పాయింట్‌ కోసం అరగంటపైనే ఎపిసోడ్‌ను సాగదీశారు.  అనవసర సన్నివేశాలు తీసేస్తే, 20 నిమిషాల కన్నా ఎక్కువ సాగదు. 2018లో లస్ట్‌ స్టోరీ కియారా అడ్వాణీ ఎపిసోడ్‌తో ముగుస్తుంది. అంత ప్రభావవంతంగా ఈ సిరీస్‌ ముగియలేదు.

మొత్తంగా చూస్తే, ‘లస్ట్‌ స్టోరీస్‌’ భిన్న మనస్తత్వాలు కలిగిన మనుషుల భావోద్వేగాలను చెప్పే ప్రయత్నం చేయగా, ఈసారి కథకన్నా కూడా ‘లస్ట్‌’పైనే ఎక్కువ దృష్టి పెట్టింది చిత్ర బృందం. ప్రతి మనిషికి కొన్ని రకాలైన వాంఛలు ఉంటాయి. అందులో కామం కూడా ఒకటి. అయితే, భావోద్వేగాల మిళితంగా సమస్యలను ప్రస్తావిస్తూ తెరకెక్కిస్తే, ప్రతి ఎపిసోడ్‌ బాగుంటుంది. కథ కన్నా కూడా కామాన్ని ఎక్కువ చూపిస్తే, అది సెమీపోర్న్‌ మూవీ అవుతుంది తప్ప, ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ ఆంథాలజీలో ఒకట్రెండు ఎపిసోడ్స్‌లో జరిగింది అదే. ‘రెండు మనసులు కలిస్తే ప్రేమ, రెండు కుటుంబాలు కలిస్తే పెళ్లి’ అని అదేదో సినిమాలో డైలాగ్‌ ఉంటుంది. కానీ, మనసులు కాదు, శరీరాలు కూడా కలవాలని చెప్పడం ఎంత వరకూ కరెక్ట్‌ అనేది రచయిత, దర్శకుల విజ్ఞతకే వదిలేయాలి. కొంకణ్‌ సేన్‌ శర్మ తెరకెక్కించిన ‘అద్దం’ ఎపిసోడ్‌ ఒక్కటే భావోద్వేగాల కలబోతగా సాగుతుంది. కోరికలు, కోపాలు అన్నీ క్షణికాలే అన్నట్లు చూపించారు.

ఇక ‘లస్ట్‌ స్టోరీస్‌2’ ప్రకటించిన దగ్గరి నుంచి తమన్నా ఎపిసోడ్‌పై అందరికీ ఆసక్తి ఏర్పడింది. అది లస్ట్‌స్టోరీయా, ఘోస్ట్‌ స్టోరీయా అర్థం కాలేదు. తమన్నా డైలాగ్‌ చెప్పిందనడం కన్నా అప్పజెప్పింది అనడం కరెక్టేమో. విజయ్‌ వర్మతో ఆఫ్‌స్క్రీన్‌ కెమెస్ట్రీని ఆన్‌ స్క్రీన్‌ కెమెస్ట్రీగా చూపించడానికి ముద్దు సన్నివేశం తీసినట్లు ఉంది. ఇక చివరి కథను మనుషుల వాంఛలను ఎలా ఆయుధంగా మలచుకోవచ్చు కుముద్‌, దేవయాని పాత్రల ద్వారా చూపించారు. కానీ కథనం నెమ్మదిగా సాగడం ఒక ప్రధాన అడ్డంకి. ‘‘లస్ట్‌ స్టోరీస్‌2’ ఎన్నో రకాల భావోద్వేగాల కలయిక. లస్ట్‌ అనే పేరు చూసి మోసపోకండి.  అందరితో కలిసి దీన్ని చూడండి’’  తమన్నా ప్రచారంలో భాగంగా చెప్పుకొచ్చింది. కానీ, ‘లస్ట్‌’ ప్రధానంగానే కథలన్నీ సాగుతాయి. యువతను దృష్టిలో పెట్టుకునే ఈ ఆంథాలజీని తీశారు. కుటుంబంతో కలిసి చూసేలా ఒక్క ఎపిసోడ్‌ కూడా ఉండదు. ఇంతకీ ‘లస్ట్‌’ అంటే ఏంటో తెలుసా? ‘బలమైన కామవాంఛ’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని