Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్‌.. మోహన్‌లాల్‌ నటించిన పీరియాడికల్‌ చిత్రం ఎలా ఉందంటే?

మలయాళ నటుడు మోహన్‌లాల్‌ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్‌’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే?

Published : 24 Feb 2024 09:49 IST

చిత్రం: మలైకోటై వాలిబన్‌; తారాగణం: మోహన్‌లాల్‌, సోనాలీ కులకర్ణి, హరీశ్‌ పేరడి తదితరులు; సంగీతం: ప్రశాంత్‌ పిళ్లై; కూర్పు: దీపు ఎస్‌. జోసెఫ్‌; ఛాయాగ్రహణం: మధు నీలకందన్‌; నిర్మాతలు: శిబు బేబీ జాన్‌, అచ్చూ బేబీ జాన్‌, విక్రమ్‌ మెహ్రా, సిద్ధార్థ్‌ ఆనంద్‌ కుమార్‌, ఎంసీ ఫిలిప్‌, జకోబ్‌ కె. బాబు; స్క్రీన్‌ప్లే: పీఎస్‌ రఫీక్‌; రచన, దర్శకత్వం: లిజో జోస్‌ పెల్లిస్సేరి; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌.

ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal) హీరోగా దర్శకుడు లిజో జోస్‌ పెల్లిస్సేరి (Lijo Jose Pellissery) తెరకెక్కించిన చిత్రం ‘మలైకోటై వాలిబన్‌’ (Malaikottai Vaaliban). థియేటర్లలో జనవరి 25న మలయాళంలో విడుదలైంది. తెలుగులోనూ రిలీజ్‌కు సిద్ధమవగా అనివార్య కారణాల వల్ల సాధ్యపడలేదు. ఇప్పుడు ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+Hotstar) వేదికగా తెలుగుసహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, ఈ సినిమా కథేంటి? ఎలా ఉందంటే? (Malaikottai Vaaliban review in telugu)..

కథేంటంటే?: మల్లయోధుడైన వాలిబన్‌ (మోహన్‌లాల్‌) సోదరుడితో కలిసి గ్రామాలు సంచరిస్తూ ఉంటాడు. ఆయా ప్రాంతాల మల్లయోధులతో తలపడి అక్కడ విజయపతాకం ఎగరేస్తాడు. ఈ క్రమంలో పలువురు మహిళల మనసు దోచుకోవడంతోపాటు శత్రువుల సంఖ్య పెంచుకుంటాడు. ఆ శత్రుత్వం ఎక్కడికి దారి తీసింది? ఓ సంస్థానంలో ఆంగ్లేయుల చెరలో బందీలుగా ఉన్న వారికి వాలిబన్‌ ఎలా విముక్తి కలిగించాడు? ఏ కారణంతో సోదరుడిని కోల్పోయాడు? అసలు వాలిబన్‌ గతమేంటి? మలైకోటై వాలిబన్‌గా ఎలా మారాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే (Malaikottai Vaaliban review in telugu).

ఎలా ఉందంటే?: ఇదొక పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌. వాస్తవాన్ని తెలుసుకోకుండా ఇతరులు చెప్పిన అబద్ధాలు నమ్మే వారి జీవితం ఎలా తలకిందులవుతుంది? పగ, ప్రతీకారం ఎంత వరకూ దారి తీస్తాయనే అంశాలను దర్శకుడు లిజో ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి పాయింట్స్‌ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కానీ, చూపించే విధానమైనా విభిన్నంగా ఉంటే బాగుండేది. అసలు కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. మోహన్‌లాల్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ కూడా ఆకట్టుకోదు. ఫస్టాఫ్‌ మొత్తం సోదరుడితో కలిసి వాలిబన్‌ ఊరూరు తిరగడమే కనిపిస్తుంది. ఓ నర్తకి విషయంలో వాలిబన్‌ స్వీకరించిన సవాలు మినహా ఇతర సన్నివేశాలేవీ ఆసక్తి కలిగించవు. పైగా కొత్త పాత్రలెన్నో తెరపైకి వస్తూ వెళ్తుంటాయి. ఏవీ గుర్తుపెట్టుకునేలా ఉండవు. విన్న సంభాషణలే పదే పదే వినిపిస్తాయి. పాటలూ పెద్దగా ప్రభావం చూపవు. అవి లేకపోయినా సినిమాకొచ్చే నష్టమేమీ లేదు. వాటి వల్ల నిడివి పెరిగిందంతే (Malaikottai Vaaliban review in telugu).

తాను విద్య నేర్చుకున్న సంస్థానాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్‌ వారితో వాలిబన్‌ చేసే ఫైట్‌ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అక్కడి పోరాట దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఆ సంస్థానానికి వాలిబన్‌ రాజు అవుతాడేమో అని ఊహించిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. కథ అక్కడి నుంచి మరో ప్రాంతానికి షిఫ్ట్‌ అవడం టర్నింగ్‌ పాయింట్‌. నర్తకి ప్రేమను వాలిబన్‌ తిరస్కరించడం మరో మలుపు. వాలిబన్‌ సోదరుడి లవ్‌ట్రాక్‌ కూడా ఇక్కడ కీలకంగా నిలిచింది. వాలిబన్‌ మల్లయోధుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందనేది అతడి గురువు పాత్ర ద్వారా తెలియజేశారు. ఆ గురువు గతమేంటో తెలిశాక సదరు ట్విస్ట్‌కు వావ్‌ అనాల్సిందే. క్లైమాక్స్‌ను బాగా డిజైన్‌ చేశారు. దీనికి సీక్వెల్‌ తీసుకురానున్నట్లు ఖరారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తొలి భాగాన్ని సాగదీసినట్లు స్పష్టంగా కనిపించింది. ముందు నుంచీ కథను నెమ్మదిగా నడిపించి చివరిలో ట్విస్ట్‌లతో వేగంగా ముగించారు.  

ఎవరెలా చేశారంటే?: వాలిబన్‌ పాత్రే తెరపై ఎక్కువ కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్‌కు మోహన్‌లాల్‌ తగిన న్యాయం చేశారు. వేషధారణ, అభినయం ఆకట్టుకుంటాయి. నర్తకిగా సోనాలీ కులకర్ణి, వాలిబన్‌ గురువుగా హరీశ్‌ పేరడి అలరిస్తారు. వాలిబన్‌ సోదరుడు తదితర పాత్రధారులు పరిధి మేరకు నటించారు. సాంకేతిక బృందం విషయానికొస్తే.. ప్రశాంత్‌ పిళ్లై అందించిన మ్యూజిక్‌ అంతగా మ్యాజిక్‌ చేయలేకపోయింది. మధు నీలకందన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై దీపు జోసెఫ్‌ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ‘అంగమలి డైరీస్‌’, ‘జల్లికట్టు’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు లిజో జోస్‌ పెల్లిస్సేరి ఈ సినిమా విషయంలో అంతగా మెప్పించలేకపోయారు.

  • బలాలు
  • + మోహన్‌లాల్‌ నటన
  • క్లైమాక్స్‌
  • బలహీనతలు
  • - ఫస్టాఫ్‌
  • పాటలు
  • చివరిగా: వాలిబన్ కు కనెక్ట్ అవ్వాలంటే ఓపిక ఉండాలి!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని