Merlapaka Gandhi: అద్భుతం జరగాలని ఎదురుచూసినందుకు...!

‘‘తొలి రోజు తొలి ఆటకి ప్రేక్షకుడిని థియేటర్‌కి తీసుకు రావడమే మా లక్ష్యం. అందుకోసమే వైవిధ్యంగా ప్రచారం చేశాం. తొలి ఆట చూశాక ‘సినిమా బాగుంద’ంటే చాలు... కచ్చితంగా విజయం  దక్కుతుంది’’ అన్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ.

Updated : 03 Nov 2022 07:46 IST

‘‘తొలి రోజు తొలి ఆటకి ప్రేక్షకుడిని థియేటర్‌కి తీసుకు రావడమే మా లక్ష్యం. అందుకోసమే వైవిధ్యంగా ప్రచారం చేశాం. తొలి ఆట చూశాక ‘సినిమా బాగుంది’ అంటే చాలు... కచ్చితంగా విజయం  దక్కుతుంది’’ అన్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi). ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ (Like Share And Subscribe). సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత.  ఈ నెల 4న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిన ఓ ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. ఆ సమయంలో చాలా మంది యూ ట్యూబ్‌ కంటెంట్‌కి అలవాటుపడ్డారు. కావల్సినంత తీరిక సమయం, బయటికి వెళ్లలేని పరిస్థితి కావడంతో నేను కూడా ట్రావెల్‌ వీడియోలు చూశా. రకరకాల ప్రదేశాలు, వాటి చరిత్ర చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ సమయంలోనే ఓ యూ ట్యూబర్‌కథ చెప్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ట్రావెల్‌ వ్లాగర్లు, వాళ్లకున్న కష్టాలు, సవాళ్లు, ప్రమాదాల నేపథ్యంలో ఈ కథ సిద్ధం చేశా. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ ట్రావెల్‌ వ్లాగర్సే. తొలి ఫ్రేమ్‌ నుంచి చివరి వరకూ ఒక నవ్వుల ప్రయాణంలా ఉంటుంది. సంతోష్‌ శోభన్‌తో ‘ఏక్‌ మినీ కథ’ చేశా. ఆ తర్వాత ఈ కథ చెప్పినప్పుడు తనకి బాగా నచ్చింది. ఫరియాకి కూడా అంతే బాగా నచ్చింది. సుదర్శన్‌, బ్రహ్మాజీ పాత్రలు కూడా సినిమాకి కీలకం’’.

* ‘‘కథనం ఈ సినిమాకి ప్రధానబలం. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ సినిమాల్ని గుర్తు చేస్తూ...  ప్రతి పదిహేను నిమిషాలకి కథలో ఓ మార్పు, ఓ మలుపు చోటు చేసుకుంటుంది. అది చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం మారేడుమిల్లి అడవుల్లో చేసిన ప్రయాణం గుర్తుండిపోతుంది. మా సినిమాకి ఏదో ఒక అద్భుతం జరగాలని ఎదురు చూశాం. చిరంజీవి సర్‌ ‘వాల్తేరు వీరయ్య’ టీజర్‌ రూపంలో అది జరిగింది. టీజర్‌లో లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ అనే డైలాగ్‌ చెప్పగానే అందరూ మీ సినిమా పేరు చెప్పారంటూ మమ్మల్ని ట్యాగ్‌ చేశారు’’.

* ‘‘పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, యు.వి.క్రియేషన్స్‌, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు, నిర్మాత కృష్ణతో సినిమాలు చేయాలి. కొత్త కథలతోనే సినిమాలు చేస్తాను తప్ప, రీమేక్‌ మాత్రం చేయను. అనుభవం కోసమే ‘అంధాధున్‌’ రీమేక్‌ చేశా. ‘మీ నాన్న నవలలంటే మాకు చాలా ఇష్టం. ఆయన కథలతో సినిమాలు చెయ్యి’ అంటుంటారు చాలామంది. మా నాన్న మేర్లపాక మురళి కథతో ఓ సినిమా చేయాలని ఉంది’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని